చంద్రబాబుకు ఓట్లు అడిగే ధైర్యం లేదు: వైఎస్‌ జగన్‌

31 Mar, 2019 15:57 IST|Sakshi

సాక్షి, గిద్దలూరు: సీఎం చంద్రబాబు నాయుడుకు తన ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై ఓటు అడిగే ధైర్యం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ స్కూల్‌ కూడా ఉండదని తెలిపారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓటేస్తే.. ఎల్‌కేజీకి లక్ష రూపాయలు, ఇంజనీరింగ్‌కు 5లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందన్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు కూడా తీసేస్తారని, తనను ప్రశ్నించినవారిని ఎవరినీ చంద్రబాబు బతకనివ్వరని విమర్శించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఎండలు మండుతున్న తన కోసం తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా?
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘గిద్దలూరులో తాగునీటి సమస్యలేని గ్రామమేదైనా ఉందా?.230 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ఓనర్లుకు పది కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకపోవడంతో వారు సరఫరా నిలిపివేశారు. 48 మండలాలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే గిద్దలూరులో నీటి సమస్య తీరుతుంది. వెలిగొండ ప్రాజెక్టు పనులను దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 80 శాతం వరకు పూర్తిచేశారు. ప్రాజెక్టు పూర్తయితే తాగునీటి సమస్య తీరుతుందని తెలిసిన కూడా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. పత్తికి కనీసం 4,500 రూపాయలు కూడా రావడంలేదు. మిర్చికి 10వేల రూపాయలు ఉంటే 5,500 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. ఇలా పత్తి, మిర్చి, శనగ, కంది పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఇంతటి అన్యాయమైన పరిస్థితుల్లో రైతన్నలు ఉంటే పట్టించుకోని ప్రభుత్వం మనకు అవసరమా?

చంద్రబాబు ధనిక సీఎం.. రైతన్న అత్యంత పేదవాడు
చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే మన రైతన్నలు అత్యంత రుణభారంలో ఉన్నారని నా బార్డు నివేదికలు తెలిపాయి. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మల అప్పులు వడ్డీలతో కలిపి 26వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో అక్కాచెల్లమ్మలు అప్పులు రెట్టింపు అయ్యాయి. నిరుద్యోగ సోదరుల సంఖ్య రెట్టింపు అయింది. చంద్రబాబు నాయుడు హయంలో రైతులు, అక్కాచెల్లమ్మలు, యువత ఎవరు బాగుపడలేదు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నటా?.  2014 ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలన్నారు చం‍ద్రబాబు.. కానీ నేడు జాబ్‌ రావాలంటే బాబు పోవాలని యువత అంటుంది. ఇక్కడ జాబులు దొరక్క ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. రాష్ట్రంలో లక్షా 42వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ చెప్పింది. రిటైర్‌ అయిన వారితో కలిపి ఖాళీలు 2.30లక్షలకు చేరాయి. చంద్రబాబు నాయుడు పాలనలో ఉద్యోగాలు రావడం సంగతి పక్కన ఉంచితే.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. 30వేల మంది ఆదర్శ రైతులు, 1000మంది గోపాలమిత్రల, ఆయూష్‌లో పనిచేస్తున్న 8000 మంది, సాక్షార భారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగాలు పోయాయి. 14 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85వేల మంది అక్కాచెల్లమ్మల ఉద్యోగాలు పోయాయి. జీతాలు పెంచమని హోంగార్డ్‌ల నుంచి, ఆశా వర్కర్‌లు, అంగన్‌ వాడీలు జీతాలు పెంచాలని అడుగుతూంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

నిరుద్యోగులకు వైఎస్‌ జగన్‌ భరోసా..
చంద్రబాబు అన్యాయమైన పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని నేను చూశాను. నేను విన్నాను. మీ అందరికీ నేను ఉన్నాను అని హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. ప్రతి ఊరిలోను గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అందులో ఆ ఊరికి చెందిన చదువుకున్న పదిమందికి ఉద్యోగాలు ఇస్తాం. జన్మభూమి కమిటీలు ఉండవు, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పథకాలకు, నవ రత్నాలకు సంబంధించి ఏ పని అయినా 72 గంటల్లో పూర్తి చేసేలా గ్రామ సచివాలయం పనిచేస్తుంది. ఇందులో కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమని హామీ ఇస్తున్నాను. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇస్తాం. వారికి గౌరవ వేతనం కింద 5000వేల రూపాయలు అందజేస్తాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యతలను వారే చూస్తారు. రేషన్‌, పింఛన్‌ ఇలా ప్రతి ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తారు. పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెస్తాం. ప్రతి జిల్లాకు ఉచితంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం​. గవర్నమెంట్‌ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తాం. నిరుద్యోగ యువతకు వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద రుణం, సబ్సిడీ అందజేస్తాం. కాంట్రాక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం.

ప్రతి జిల్లా హైదరాబాద్‌ అవుతుంది..
దేశంలో రేపు ఏ ఒక్కరు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉందని వార్తలు వెలువడుతున్నాయి. మనం 25 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలను గెలిపించుకుందాం. ప్రత్యేక హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతిస్తాం. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుంది. ఉద్యోగ సమస్యకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.  గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబును, ఎంపీ అభ్యర్థి శ్రీనన్నను ఆశీర్వదించమ’ని కోరారు. 

మరిన్ని వార్తలు