చేసేవి 420 పనులు.. పేరు మాత్రం ధర్మ పోరాటమా?

29 Apr, 2018 18:53 IST|Sakshi

సాక్షి, పామర్రు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇసుక మాఫియా డాన్‌గా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర (148వ రోజు) ఆదివారం కృష్ణా జిల్లా పామర్రు చేరుకుంది. చంద్రబాబు పాలనలో రైతులు ఇసుకాసురులు, మట్టికాసురులను చూస్తున్నారంటూ విమర్శించారు. బాబు పాలనలో అంతా అవినీతిమయమే అని ద్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీఎస్టీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. లక్షల ఇళ్లులు కట్టిస్తామని చెప్పిన బాబు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేక పోయారు. బాబు హామీతో పేదవారు బాధపడుతున్నారంటూ తెలిపారు . రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని, గిట్టుబాటు ధర లేక కన్నీరు పెట్టుకుంటున్నారని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ' రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. పంట పండిచిన తర్వాత అమ్మకోలేని పరిస్థితి ఉంది. రైతుల గోడు చూస్తుంటే కళ్లలోనుంచి నీళ్లు వస్తున్నాయి. బాబు పాలనలో కన్నీరు పెట్టని రైతు ఎవరైనా ఉన్నారా? నాలుగేళ్ల పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా ? దళారీ వ్యవస్థను తీసేయకుండా చంద్రబాబు దళారిగా మారారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొని హెరిటేజ్‌ ఫుడ్స్‌లో అమ్ముతున్నారు. చంద్రబాబు పాలనలతో ఫోన్‌ కొడితే మద్యం ఇంటికి వస్తోంది. కరెంట్‌ చార్జీలు మూడు సార్లు పెంచిన ఘనత చంద్రబాబుది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా ? వేలం నోటీసులు మాత్రం వస్తున్నాయి. నేడు జాబు రావాలి అంటే బాబు పోవాలి అనే పరిస్థితి వచ్చింది. 

40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని బాబు అబద్ధాలు చెబుతున్నారు. ఇటువంటి మోసాలు చేసే బాబు తన మీద కేసులు పెడితే కాపాడాల్సిన బాధ్యత ప్రజలదేనని అంటున్నారు. ప్రత్యేక హోదాని ఖూని చేయడం చాలా అన్యాయమైన విషయం. చంద్రబాబు గట్టిగా అడిగితే హోదా వచ్చి ఉండేది. మోసం చేస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడు.. కానీ మళ్లీ బుకాయిస్తాడు. నాలుగేళ్లు హోదాను తాకట్టుపెట్టి ఇవాళ తిరుపతిలో సభ అంటున్నారు. చంద్రబాబు చేసేవన్నీ 420 పనులు.. పెట్టే పేరు మాత్రం ధర్మపోరాటమట' అంటూ చంద్రబాబు ప్రభుత్వ పనితీరును ప్రతిపక్షనేత నిలదీశారు.

>
మరిన్ని వార్తలు