‘చంద్రబాబు పాలనలో ప్రజలకు అష్టకష్టాలు’

12 Mar, 2018 18:11 IST|Sakshi

హోదాపై బాబు డ్రామాలాడుతున్నారు

25 మంది ఎంపీలు రాజీనామ చేస్తే హోదా ఎందుకు రాదు

దయనీయంగా ఆరోగ్య శ్రీ

బాపట్ల బహిరంగ సభలో ప్రతి పక్షనేత  వైఎస్‌ జగన్‌

సాక్షి, బాపట్ల: చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. 110వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని, వ్యవసాయం పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితికి చేరుకుందన్నారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారుల పరి‍స్థితి మరింత దారుణంగా తయారైందన్నారు. డీజిల్‌ రేటు భారీగా పెరిగిందని, సబ్సిడీ కింద డీజిల్‌ ఇవ్వడంలేదని రైతులు చెబుతుంటే మనసు కలిచి వేస్తుందన్నారు. కొత్త బోట్లు కొనుక్కుంటే డీజిల్‌ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదన్నారు. 

బాబు నోరు తెరిస్తే అబద్ధం
నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన చూస్తున్నామని, అభివృద్ధి పేరుతో నోరు తెరిస్తే బాబు అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. గిట్టుబాటు ధరల్లేక  రైతన్నలు అల్లాడుతున్న పరిస్థితుల్లో కూడా బాబు వ్యవసాయం బ్రహ్మండంగా ఉందంటున్నారని ధ్వజమెత్తారు. ఓ వైపు డిగ్రీలు చదివిన పిల్లలకు ఉద్యోగాల్లేక హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వెళ్తూంటే ఈ పెద్దమనిషి మాత్రం విశాఖ సమ్మిట్‌లతో కోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని ఊదరగొడుతున్నారని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు ఏమైనా వచ్చాయా అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. అప్పుల కోసం రూ. 5 వేల మిగులు బడ్జెట్‌ చూపిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు మారాలన్నారు.

నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటేనే అభివృద్ధి అంటారని, కానీ ఈ నాలుగేళ్ల పాలనల్లో మీరు సంతోషంగా ఉన్నారా (ప్రజలనుద్దేశించి) అని అడిగారు. రుణమాఫీ పేరుతో రైతులకు, డ్వాక్రా మహిళలకు బాబు కుచ్చుటోపి పెట్టారని విమర్శించారు. బాబు వస్తే రుణ మాఫీ అన్నారు. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి రుణ మాఫీ అయిందా, రుణమాఫీ ఏమో కానీ బ్యాంకు నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

94 వేలు బాకీ ఉన్నావని నిలదీయండి.!
జాబు రావాలంటే బాబు రావాలని, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తానని, చదువుకోకపోయినా ఉపాధి కల్పిస్తానని, లేకుంటే నిరుద్యోగి భృతి ఇస్తానని బాబు హామి ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఆ హామీలను అటకెక్కించారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా మీకు రావాల్సిన నిరుద్యోగ భృతి 94 వేల రూపాయలు బాకీ పడ్డట్లు బాబును నిలదీయండని ప్రజలకు సూచించారు.

ఊరుకో బెల్ట్‌ షాప్‌.!
అధికారంలోకి రాక ముందు యువత మద్యం తాగి చెడిపోతున్నారని, మద్యం షాపులు తగ్గిస్తానన్న బాబు అధికారంలోకి రాగానే ఏం చేశాడని ‍ప్రశ్నించారు. ఊరికో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో కానీ బెల్ట్‌ షాప్‌ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఫోన్‌ కొడితే మందు బాటిల్‌ ఇంటికొచ్చె పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.

హోదా విషయంలో బాబు డ్రామాలు
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు డ్రామాలుడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు, ఆర్థిక సంఘానికి సంబంధంలేదని, 2014 మార్చిలో హోదాను కేబినెట్‌లో ఆమోదించిన వెంటనే ప్రణాళికా సంఘానికి ఆదేశాలు పంపారన్నారు. 2014 డిసెంబర్‌ వరకు 14వ ఆర్థిక సంఘం అమల్లో ఉందని అయినా చంద్రబాబు పట్టించుకోలేదని, హోదా గురించి ఆలోచించలేదన్నారు. హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని, ఢిల్లీ పెద్దలు చెప్పగానే చంద్రబాబు గంగిరెద్దులా తలూపారన్నారు. గతంలో అర్థరాత్రి ఏం చెప్పారో మొన్న కూడా అదే విషయాన్ని జైట్లీ చెప్పారని స్పష్టం చేశారు. నాలుగేళ్లు డ్రామాలు చేసిన చంద్రబాబు వైఎస్‌ఆర్‌సీపీ పోరాటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించారని దుయ్యబట్టారు.

సిగ్గులేకుండా ఇంకా ఎన్డీఏలోనే కొనసాగుతున్నారని, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని అడిగితే వెనకడుగు వేశారని, 25 మంది ఎంపీలు ఒక్కతాటిపై నిలబడితే కేంద్రం దిగిరాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు.

దయనీయంగా ఆరోగ్య శ్రీ
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా ఉండేదని, బాబు హయాంలో ఎంత దయనీయంగా మారిందో చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. 108 కాల్‌ చేస్తే అంబులెన్స్‌ వచ్చేదని, ఇప్పుడు చేస్తే డ్రైవర్లకు జీతాల్లేక సమ్మెలో ఉన్నారని చెబుతున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ హైదరాబాద్‌లో చెల్లడం లేదని.. కిడ్నీ, క్యాన్సర్‌, చిన్నపిల్లలకు వైద్యం అందక నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వస్తే  వెయ్యి రూపాయలు దాటితే ప్రతి పేదవాడికి వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కింద  ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు సహా ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామన్నారు. అంతేగాకుండా ఆపరేషన్‌ సమయంలో కుటుంబ పెద్దకు విశ్రాంతి అవసరమైతే ఆర్థిక సాయం చేసి అన్ని విధాల ఆదుకుంటామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పెన్షన్‌ ఇస్తామని, వైద్యం కోసం ఎవరూ అప్పులు చేసే పరిస్థితి రానివ్వమని, నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. నవరత్నాలపై సలహాలు, సూచనలివ్వాలని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరారు. 

మరిన్ని వార్తలు