అవినీతి లేని పాలన అందిస్తా: వైఎస్‌ జగన్

17 Mar, 2019 14:49 IST|Sakshi

మోగిన వైఎస్సార్ సీపీ ఎన్నికల సమర భేరీ 

అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దు

చంద్ర‌బాబు ఎండ మావుల‌ను చూసి న‌మ్మ‌కండి

సాక్షి, నర్సీపట్నం : ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లా నుంచే వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమర భేరీ మోగింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నర్సీపట్నం వేదికగా రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నర్సీపట్నం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతి లేని పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలను పార‍్టీలకు అతీతంగా అందిస్తామని, అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. చంద్ర‌బాబు నాయుడు ఎండ మావుల‌ను చూసి న‌మ్మ‌కండి. ఈ ఎన్నిక‌లు ధ‌ర్మానికి అధ‌ర్మానికి మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం. విశ్వ‌స‌నీయ‌త‌కు వంచ‌న మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం. ఈ కురు క్షేత్ర సంగ్రామంలో ప్ర‌తి ఒక్క‌రి దీవెన‌లు వైఎస్సార్‌ సీపీకి కావాలి. ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం మాకు అవ‌స‌రం. మీ అమూల్యమైన ఓటు వేసి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమశంకర్‌ గణేష్‌, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సత్యవతిని గెలిపించాలని ఆయన కోరారు. చదవండి....(వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన..)

వైఎస్‌ జగన్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ...‘పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల నడిచాను. 13 జిల్లాల ప్రజల కష్టాలు విన్నాను. ప్రతి కుటుంబం పడుతున్న బాధను కళ్లారా చూశాను. నాడు హోరున వర్షంలో పాదయాత్రలో వెంట నడిచారు. ఇవాళ మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలి వచ్చారు. నర్సీపట్నంలో మీ అందరి మధ్య ఈరోజు వైఎస్సార్‌ సీపీకి ఓటు వేయండి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి అని అడిగే ముందు...మాకు అధికారం ఇస్తే....ఏం చేయదలచుకున్నామో చెబుతాను. ఆదుకోవాల్సిన 108 సకాలంలో రావడం లేదు. ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవు. 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. ఉద్యోగాలిస్తామని చెప్పి... ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళుతోంది. 

ప్రతి ఒక్కరి నష్టాన్ని కళ్లారా చూశా...
రాష్ట్రంలో ప్రతి కష్టాన్ని చూశా.. ప్రతి నష్టాన్ని చూశా. నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలను చూశాను. ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న పిల్లలను చూశాను. నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసిన వైనాన్ని చూశాను. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూశాను. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నష్టాన్ని చూశాను. తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చూస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తాం. వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేస్తాం. గిట్టుబాటు ధలు అందిస్తాం. అయిదేళ్లలో ప్రతి నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తా. అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం.  ఎక్కడ చూసినా లంచాలే. మట్టి నుంచి ఇసుక దాకా దేన్నీ వదలకుండా దోచుకున్నారు. కుల పిచ్చి లేని పరిపాలన ఇస్తాను. జలయజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. సంక్షేమ పథకాలను పార‍్టీలకు అతీతంగా అందిస్తాం.

జన్మభూమి కమిటీలు రద్దు చేస్తా..
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాం. ఈ ఎన్నిక‌ల‌లో ఒక జిత్తుల మారి న‌క్క‌తో యుద్దం చేస్తున్నాం. మోసాలు చేసే చంద్ర‌బాబుతో త‌ల‌ప‌డుతున్నాం. ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఆయ‌న గ్రామాల‌కు డ‌బ్బు మూట‌ల‌ను పంపిస్తారు. అనేక ప్ర‌లోభాలు పెడ‌తారు. ప్ర‌తి ఓట‌రుకు రూ3 వేలు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తారు. చంద్ర‌బాబు ఇచ్చే డ‌బ్బుకు మోసపోవ‌ద్ద‌ని ప్ర‌తి కుటుంబానికి తెలియచెప్పండి. అడ్డ‌గోలుగా డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేసిన చంద్ర‌బాబు మోసాల గురించి వారికి తెలియ జేయండి. ఎన్నిక‌ల నాటికి  డ్వాక్రా రుణాలు ఏమేర‌కు ఉన్నాయో ఆ రుణాన్ని నాలుగు ద‌ఫాలుగా చెల్లిస్తాం. వ‌డ్డీ లేని రుణాల‌ను రైతులు, మ‌హిళ‌ల‌కు అందిస్తాం. రానున్న‌ది వైఎస్సార్‌సీపీ  ప్ర‌భుత్వం. 

ఏపీలో రేష‌న్ కావాల‌న్నా.. పెన్ష‌న్ కావాల‌న్నా..లంచం . లంచాలు లేనిదే ప‌ని జ‌ర‌గ‌దు.  మీ అంద‌రి స‌హ‌కారంతో అధికారంలోకి వ‌చ్చే వైఎస్సార్‌ సీపీ ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న‌ను అందిస్తుంది. ప్ర‌జ‌ల బాగోగుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని వారిని ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లోపించాయి. మా చిన్నాన్న‌ను ఇంట్లో ఉండ‌గా గొడ్డ‌లితో న‌రికి చంపారు. మ‌హిళా ఎమ్మార్వోను జుట్టు ప‌ట్టుకుని  టీడీపీ ఎమ్మెల్యే లాగినా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోరు. మా ప్ర‌భుత్వ హ‌యాంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అవినీతిమ‌య‌మైన జ‌న్మ భూమి క‌మిటీల‌ను ఎత్తి వేస్తాం. 

పేద‌ల చ‌ద‌వుల భారాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. కేవ‌లం రెండే రెండు సంవ‌త్స‌రాల‌లో విద్యా రంగంలో ఏ విధంగా విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకుని వ‌స్తామో మీరే చూస్తారు. ఏ కుటుంబం గానీ ఆస్తులు అమ్ముకునే ద‌య‌నీయ స్థితి ఉండ‌రాదు. వ్య‌వ‌సాయం ఒక పండుగలా త‌యారు చేస్తాం. రైతాంగానికి గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల‌కు అయిదు సంవ‌త్స‌రాల‌లోగా ల‌క్షాధికారుల‌ను చేస్తాం. ప్ర‌తి మ‌హిళ ఆర్థిక స్థితి గ‌తుల‌ను మెరుగు ప‌రుస్తాం.

ఏటా ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌లను నిర్వ‌హించి నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు కల్పిస్తాం. ఏపీ అభివృద్ది కావాలంటే ప్రత్యేక హోదా స్థాయి త‌ప్ప‌నిస‌రి. ఏపీకి హోదాను సాధించి అన్ని రంగాలు అభివృద్ధి అయ్యేలా చూస్తాం. ఆయా ప్రాంతాల‌లో ఏర్పాటు అయ్యే ప‌రిశ్ర‌మ‌ల‌లో స్థానికుల‌కే  70 శాతం ఉద్యోగాలు ల‌భించేలా కొత్త‌గా ఒక చ‌ట్టాన్ని రూపొందిస్తాం. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను స‌త్వ‌రం పూర్తి చేసి సాగు తాగు నీటి స‌దుపాయాన్ని క‌ల్పిస్తాం. జ‌ల‌య‌జ్ఞానికి అధిక ప్రాధాన్య‌త ఉంటుంది. ద‌ళితుల‌కు తోడుగా నిలుస్తాం.’ అని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు