జగన్‌ సీఎం కావాలి

10 Aug, 2018 12:17 IST|Sakshi

2019లో వైఎస్‌ జగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాను

దివంగత మాజీ సీఎం జనార్దన్‌రెడ్డి కుమారుడు

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:   ఈ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిన అవసరం, అవశ్యం ఉందని దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి జగన్‌ పాలనతోనే సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి పాతకాలం నుంచి మంచి స్నేహం ఉందని చెప్పారు. గురువారం నెల్లూరులోని స్వర్ణముఖి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. నేదురుమల్లి అనుచరులు, అభిమానులు అందరితో చర్చించిన తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో కలిసి అన్ని అంశాలపై మాట్లాడానని వివరించారు. తాను గత మూడేళ్లుగా బీజేపీలో కొనసాగానని, ఇప్పుడు బీజేపీలోని పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నానని చెప్పారు. కొద్ది రోజుల్లో పాదయాత్రలో జగన్‌ను కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రినేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని నిరంతరం పరితపించారని, ఆయన ఆశయసాధనే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తమకు మిత్రుడే అన్నారు.

నిందలు వేయడానికే ప్రభుత్వమా?
ప్రజలు పాలన చేయమని అధికారం కట్టబెడితే ఇతర పార్టీలపై నిందలు వేయడానికే తెలుగుదే శం పార్టీకి సరిపోతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధాని చాలెంజ్‌గా తీసుకోవాల్సింది పోయి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అని విధాలా ముందుకు తీసుకుని పోవాలంటే జగన్‌ ఒక్కరే సమర్దుడని ఐదు కోట్ల మంది ప్రజ లు భావిస్తున్నారని తెలిపారు. 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక జిల్లా రూపురేఖలు మారిపోవటం ఖాయమని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని వివరించారు.

చైర్‌ పర్సన్‌ను అవమానించడం సిగ్గుచేటు
జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల పోకడలు దా రుణంగా ఉన్నాయన్నారు. వెంకటగిరిలో బీసీ మహిళా చైర్‌పర్సన్‌ను అధికార పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ అవమానించడం సిగ్గు చేటన్నారు. రాపూరులో దళితులపై తప్పుడు కేసులు, గూడూరు చైర్‌ పర్సన్‌ను అవమానించడాలు, అక్రమ మైనింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా ఇలా చెప్పుకుంటే పోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సొంత సామ్రాజ్యాలుగా చేసుకుంటూ ప్రజ లతో ఎన్నుకోబడిన వారిని అవమానించడం బాధాకరమన్నారు. వీటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జిల్లాలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లు బాగా పనిచేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలపై తప్పుడు కేసులు పెట్టకుం డా, అధికార పార్టీ నేతల బెదిరింపులకు దిగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మూడేళ్లుగా బీజీపీలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి  కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీల్లో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు.

అధిష్టానం నిర్ణయం మేరకు పనిచేస్తా
అధిష్టానం ఏ పని అప్పగిస్తే అది చేస్తానని, ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతంగా ఉందన్నారు. మరింత తమవంతుగా బలో పేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. నేదురుమల్లి అభిమానులను అందరిని గ్రామ స్థాయిలో కలిసి పార్టీని మరింత పటిష్టం చేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేద్దామని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు