సైకిల్‌కు అసలు స్టాండే లేదు: మోహన్‌ బాబు

5 Apr, 2019 08:11 IST|Sakshi

సాక్షి, భీమవరం :  రాష్ట్రాన్ని దోచేసిన గజదొంగ చంద్రబాబు అని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మట్టి దగ్గర నుండి రాష్ట్ర నిర్మాణం కోసం వచ్చిన లక్షల కోట్లు నిధుల్ని చంద్రబాబు దోచేశాడని విమర్శించారు.  ఆయన ఐదేళ్ల పాలన దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగిపోయిందన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయరన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని విమర్శించారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశమిస్తే రాష్ట్రం అథోగతేనంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని పార్టీలు వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని ఓటర్లకు మోహన్ బాబు కోరారు.

సైకిల్‌కు అసలు స్టాండే లేదని, మనకు ఏసీ ఉన్నా ఫ్యానే కావాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన అంత మోసగాడు రాష్ట్రంలోనే ఎవరూ లేరని మోహన్‌ బాబు మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగ అవకాశాలు, పిల్లల చదువులు ఇలా నవరత్నాలను జగన్‌ మీ కోసం రూపొందించారన్నారు. ఎక్కడో వ్యక్తులను కాకుండా నిత్యం అందుబాటులో ఉండే గ్రంథి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా, నర్సాపురం పార్లమెంట్‌ అభ్యర్థి కె.రఘురామ కృష్ణంరాజును గెలిపించేందుకు ఫ్యాన్‌ గుర్తులకు ఓటు వేయాలని మోహనబాబు విజ్ఞప్తి చేశారు. 

చంద్రబాబు ఇష్టానుసారం కేంద్రంతో వ్యవహరిస్తాడని, బిజెపీతో కొంతసేపు, కాంగ్రెస్‌తో కొంతసేపు సహజీవనం చేసి ఆంధ్రుల్ని ఆట వస్తువుగా ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీతో చెలిమి చేసిన అన్ని రోజులూ ఆయనకు ప్రత్యేక హోదా కన్పించలేదని, ప్రత్యేక ప్యాకేజీ సొమ్మును కాజేసి ఆ పార్టీపై తిరగబడ్డాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి తిరుగుతున్నాడని మోహన్‌ బాబు విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఎంతో మంచి వ్యక్తి అని అనుకున్నానని, ఆయన అంత కన్నింగ్‌ ఎవరూ ఉండరని మోహనబాబు అన్నారు. రాష్ట్రంలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు...పత్రికలు, టీవీలను తన చేతిలో పెట్టుకుని భజన చేయించుకుంటున్నాడని విమర్శించారు. నిత్యం జగన్‌పై కేసులు గురించి మాట్లాడే చంద్రబాబు.. తనపై ఉన్న కేసులు సంగతేమిటో ప్రజలకు చెబితే బాగుంటుందన్నారు. 

మరిన్ని వార్తలు