ఉద్యోగాలు ఎవరికొచ్చాయన్నా?

20 Sep, 2018 04:11 IST|Sakshi
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం గిడిజాల వద్ద విద్యార్థులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి కోత పెడుతోంది 

ఈ పాలనలో చదువులు సాగట్లేదు.. ఉద్యోగాల్లేవని ఆవేదన 

మీరు సీఎం అయితేనే కష్టాలు తీరతాయని ఆకాంక్ష

 దారిపొడవునా కష్టాలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు 

మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటానని జననేత భరోసా 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్‌ చెబుతున్నారు. ఎవరికిచ్చారన్నా ఉద్యోగాలు? వాళ్ల పార్టీ కార్యకర్తలకా? నిన్నటిదాకా ఒక్క నోటిఫికేషన్‌ లేదు. డీఎస్సీ ఏమైందో తెలీదు. టెట్‌ల మీద టెట్‌లు పెడుతూ నిరుద్యోగులను అప్పులపాలు చేస్తున్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదు’ అంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 266వ రోజు బుధవారం ఆయన విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలంలో పాదయాత్ర సాగించారు.

ఈ ప్రాంతంలో పలు విద్యా సంస్థలు ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థులు జగన్‌ కోసం వేచి ఉండి ఆయన్ను కలుసుకుని తమ మనోభావాలను వెల్లడించారు. జగన్‌ను చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. ఏటా లక్షలాది మంది డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ, తదితర చదువులు చదువుకుని బయటకు వస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ తప్పుడు లెక్కలేనని పలువురు విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు. ‘ఈ ప్రభుత్వం మూడు సార్లు భాగస్వామ్య సదస్సులు ఇదే విశాఖపట్టణం గడ్డ మీద నిర్వహించింది. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్పారు. నాలుగు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. మేం చదువుకుంటున్నా భవిష్యత్‌తో ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ కనిపించడం లేదు. అసలు కళాశాల క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్లకే ఎవరూ రావడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పుణ్యమా అని ఇంజినీరింగ్‌ చదుకున్నా, ఉద్యోగాలు లేక రోజు వారీ పనులు చేసుకుంటున్నామని ఓ నిరుద్యోగ యువకుడు జగన్‌ దృష్టికి తెచ్చారు.  

జాబు కావాలంటే.. జగనన్న రావాలి.. 
జగన్‌ సెంచూరియన్‌ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నపుడు.. అప్పటికే అక్కడ ఎంతో సేపటి నుంచి పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్న విద్యార్థులు కేరింతలు కొట్టారు. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినులు ఆయన్ను చుట్టుముట్టి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ‘జగనన్నా.. నువ్వు గెలవాలన్నా.. సీఎం కావాలన్నా.. మీరు సీఎం అయితేనే మాలాంటోళ్లందరికీ మేలన్నా..’ అని వారు అభిలషించారు. తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తించడం లేదని సెంచూరియన్‌ యూనివర్సిటీలో పారా మెడికల్, బీఎస్సీ చదువుకుంటున్న విద్యార్థినులు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు సీఎం అయ్యాక మాకు ఆ పథకం వర్తింపజేయాలి’ అని కోరారు. పెద్ద చదువులకు ఫీజులు కడతానని మీరు ఇచ్చిన హామీ సంతోషం కలిగిస్తోందన్నారు. ‘జాబు కావాలంటే.. జగనన్న రావాలి..’ అంటూ సాయి గణపతి ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ విద్యా సంస్థల అధ్యాపకులు సైతం విద్యాభివృద్ధి విషయంలో జగన్‌ ఇచ్చిన హామీలు బాగున్నాయని కితాబిచ్చారు. తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగా వస్తోందని, దీని వల్ల చదువు పూర్తయినా తమకు డిప్లొమా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కొందరు విద్యార్థులు వాపోయారు. పాదయాత్ర సాగిన దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు జననేతకు కష్టాలు చెప్పుకున్నారు. అర్హత ఉన్నా పింఛన్లు రావడం లేదని పలువురు వృద్ధులు కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వాళ్లంటూ ఇళ్లు మంజూరు చేయడం లేదని, రేషన్‌ కార్డులు కూడా ఇవ్వడం లేదని మరికొందరు బావురుమన్నారు.  

మంత్రి గంటా మోసం చేశారు.. 
చిట్టివలస జూట్‌ మిల్లు కార్మికులు జగన్‌ను కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు తమను మోసం చేశారని తెలిపారు. 2009లో జూట్‌ మిల్లు మూత పడిందని, గత ఎన్నికల్లో (2014) టీడీపీ అధికారంలోకి వస్తే మిల్లు తెరిపిస్తానని గంటా తమకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారన్నారు. ఆ తర్వాత మిల్లు తెరిపించే ప్రయత్నం చేయకుండా మోసం చేశారన్నారు. మీరు అధికారంలోకి రాగానే మిల్లును తెరిపించి 6 వేలకు పైగా ఆ మిల్లుపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పడంతో ఆయన మాటలు నమ్మి రుణం చెల్లించలేదని,  ఆయన ఆ మాట నిలుపుకోక పోవడంతో ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నామని గుమ్మిడివాని పాలెంకు చెందిన అప్పయ్యమ్మ వాపోయింది. అసలు, వడ్డీ కలిపి ఇప్పుడు బ్యాంకుల వాళ్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అందరి కష్టాలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. 

ఇల్లులేదని చిన్న కొడుక్కి పెళ్లి చేయలేదు..
నాకు ఇద్దరు కొడుకులు. నా భర్తకు కళ్లు కనిపించవు. 70 ఏళ్లుంటాయి. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి పథకాలు అందడం లేదు. పెద్ద కొడుక్కి పెళ్లి చేశాను. ఉన్న ఒక్క గదిలోనే అందరం ఉంటున్నాం. ఇంటి కోసం నాయకుల చుట్టూ రోజూ తిరుగుతున్నాం. పట్టించుకోవడంలేదు. చిన్నకొడుకు పెళ్లీడుకొచ్చాడు. ఉండటానికే ఇల్లు సరిగా లేదు.. చిన్నోడికి కూడా పెళ్లి చేసి ఎక్కడ ఉంచాలో తెలీక జంకుతున్నాం బాబూ.. మీ నాన్నగారి హయాంలో అందరికీ ఇళ్లు ఇచ్చారు. అయితే అప్పట్లో మా నాయకులు మమ్మల్ని పట్టించుకోనందున కట్టుకోలేకపోయాం. మీరొస్తేనే న్యాయం జరుగుతుంది. 
– సీహెచ్‌ రామయ్యమ్మ, గిడిజాల

జగనన్న హామీతో భరోసా  
కాపు కార్పొరేషన్‌కు హామీ మేరకు నిధులు కేటాయించక పోవడం వల్ల కాపు యువకులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించి ఏదో గొప్పగా చెబుతోంది. అత్యధిక జనాభా ఉన్న కాపులకు ఆ డబ్బు ఏ మూలకూ సరిపోలేదు. అది కూడా వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. అధికారంలోకి రాగానే కాపుల కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని జగనన్న హామీ ఇవ్వడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. పాదయాత్రలో జగనన్నను కలిసి కృతజ్ఞతలు తెలిపాం. 
– నాగిరెడ్డి మోహన్, కర్రి సంతోష్, ఆకుల సుధాకర్,తమ్మునాయుడు, కొడితల గణేష్, ఆర్‌.కల్యాణ్, కె. రాజు  

అన్నీ కాకిలెక్కలే.. ఉద్యోగాలెక్కడ?   
పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, తదితరత కోర్సులు పూర్తి చేసిన వారు ఏటా లక్షల్లో బయటికొస్తున్నారు. ఒక్క విశాఖలోనే రెండు మూడు లక్షల మంది ఏటా కళాశాలల నుంచి బయటికొస్తున్నారు. వారిలో కనీసం ఐదు శాతం మందికి కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. చంద్రబాబు మాత్రం.. లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చాయని భాగస్వామ్య సదస్సుల్లో చెబుతున్నారు. వాస్తవంగా అందుకు విరుద్ధంగా ఉంది. అన్నీ కాకిలెక్కలే. జగన్‌ వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న నమ్మకం ఉంది. 
– మల్లికార్జునరావు, అనురాధ, గీత, అంజలి, శ్రీవాణి 

మరిన్ని వార్తలు