కృష్ణమ్మ తీరాన జనహారతి 

13 May, 2018 11:33 IST|Sakshi

ప్రజా సంకల్పయాత్రకు కృష్ణా జిల్లాలో నీరాజనాలు 

అడుగడుగునా ఘన స్వాగతం.. అడుగులో అడుగేసిన జనం 

దారిపొడవునా గోడు వెళ్లబోసుకున్న వివిధ వర్గాల ప్రజలు 

టీడీపీ ముఖ్య నేతలు పలువురు వైఎస్సార్‌సీపీలో చేరిక 

12 నియోజకవర్గాల్లో 130 గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర  

228 కిలోమీటర్లు.. 10 బహిరంగ సభలు.. 4 ఆత్మీయ సమ్మేళనాలు 

జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని ప్రకటన 

నేడు కృష్ణాలో ముగింపు.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశం 

పార్టీ శ్రేణుల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం  

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన ప్రజా సంకల్ప యాత్రకు కృష్ణా జిల్లా జనహారతి పట్టింది. దుర్గమ్మ వారధి ప్రకంపించేలా జనం అడుగులో అడుగేస్తూ నభూతో.. అన్నట్లు కదం తొక్కారు. రాజకీయ చైతన్యానికి వేదికైన జిల్లాలో ఆయన పాదయాత్ర అంచనాలను మించి విజయవంతం కావడం భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై విస్పష్టమైన సంకేతాలను పంపింది. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఆద్యంతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇసుక వేస్తే రాలనంతంగా బహిరంగ సభలకు జనం పోటెత్తారు. మాట తప్పని, మడమ తిప్పని జననేత నైజం మెచ్చి పాలక పార్టీ నేతలు సైతం ఆ పార్టీకి బై చెప్పి వైఎస్సార్‌ కుటుంబంలో సభ్యులయ్యారు. కనకదుర్గమ్మ వారధి మొదలు కైకలూరు దాకా జననేతను చూడాలని, కరచాలనం చేయాలని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు.  

సాక్షి, అమరావతిబ్యూరో: కృష్ణా జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్‌ పాదయాత్ర జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికింది. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అలుపెరగని పోరాటంపై ప్రజల్లో సానుకూలత.. వెరసి జగన్‌కు జనాభిమానం వెల్లివిరిసింది. ప్రజా సంకల్ప యాత్ర వేదికగా ప్రత్యేక హోదా వాణిని ఆయన బలంగా వినిపించారు. 

ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్, విపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి ఏప్రిల్‌ 16న రాష్ట్ర బంద్‌ నిర్వహించాయి. ఆ బంద్‌కు సంఘీభావంగా ఆ రోజు ఆయన పాదయాత్రకు విరామం ప్రకటించి, తాను బస చేసిన ప్రాంతం నుంచే బంద్‌ విజయవంతమయ్యేలా పర్యవేక్షించారు. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబు.. యూటర్న్‌ తీసుకుని ప్రజలను మరోమారు మోసం చేయడానికి పన్నిన కుట్రను జగన్‌ ఎండగట్టారు. చంద్రబాబు విజయవాడలో ఏప్రిల్‌ 30న నిర్వహించిన దీక్షను 420 దీక్షగా అభివర్ణిస్తూ ప్రజలను జాగృతం చేశారు. 

ఆదే రోజున ప్రజా వంచన దినంగా పాటిస్తూ  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలు విశాఖపట్నంలో దీక్ష చేశారు. దీనికి సంఘీభావంగా జగన్‌ చేతికి నల్ల బ్యాడ్జీ కట్టుకుని, నల్ల జెండాలతో పామర్రు నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా మే 5న పార్టీ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సైతం పాల్గొన్నారు.  

పోటెత్తిన జనసంద్రం 
గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ఏప్రిల్‌ 14న ఆయన కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడలో ప్రవేశించారు. ఆయన అడుగులో అడుగేసేందుకు వేలాదిమంది కదం తొక్కడంతో కనకదుర్గమ్మ వారధి కంపించింది. దారిపొడువునా అవ్వాతాతాలు, మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తులవారు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఇలా అన్నివర్గాల వారు జగన్‌ను కలిసి తమ సమస్యలు వెళ్లబోసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో తాము పడుతున్న బాధలు, ప్రభుత్వ అవినీతి, కబ్జాలు, ఇసుక దోపిడీ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 

ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని, ఉద్యోగాలు లేవని.. తాగు, సాగునీరు అందడం లేదని వాపోయారు. అందరి సమస్యలను ఓపిగ్గా వింటూ.. అందరినీ ఆదుకుంటానని ధైర్యం చెబుతూ జగన్‌ ముందుకు సాగారు. జిల్లాకు ఎన్టీరామారావు పేరు పెడతామని నిమ్మకూరులో ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో నిర్వహించిన అన్ని బహిరంగ సభలకు జనం పోటెత్తారు. జిల్లాలో మొత్తం 224 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆదివారం 4 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం కృష్ణాలో యాత్ర పూర్తవుతుంది. దీంతో కృష్ణా జిల్లాలో మొత్తం 232 కి.మీ.పాదయాత్ర చేసినట్లు అవుతుంది. 

12 నియోజకవర్గాల్లో 5 మున్సిపాలిటీలు, 18 మండలాల్లో 130 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. పది బహిరంగ సభలు, నాలుగు ఆత్మీయ సమ్మేళనాల్లో (న్యాయవాదులు, నాయీబ్రాహ్మణులు, ఎస్సీలు, కలంకారి వృత్తిదారులు) జగన్‌ ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యేలు యలమంచిలి రవి, బీవీ రమణమూర్తి రాజు (కన్నబాబు–విశాఖ), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కర్నూలు), మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్‌లతో పాటు పలువురు నేతలు, కార్యక్తర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. కృష్ణాలో పాదయాత్ర విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.  

మరిన్ని వార్తలు