ఈ సర్కారు ఎవరిని ఆదుకుందన్నా?

2 Aug, 2018 03:13 IST|Sakshi
గొల్లప్రోలులో అశేష జనవాహిని మధ్య పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రతిపక్ష నేత ఎదుట వాపోయిన వివిధ వర్గాల ప్రజలు

రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదని మండిపాటు

పరిహారం ఇవ్వకుండానే తరిమేశారని వాపోయిన పోలవరం నిర్వాసితులు

సుద్దపల్లి కాలువ ముంచెత్తుతున్నా స్పందనే లేదని బాధితుల ఆగ్రహం

అందరి సమస్యలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జననేత

రెట్టింపు నిధులు ఇస్తానన్న జగన్‌కు బ్రహ్మరథం పట్టిన కాపులు

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. చుట్టూ గోదావరి.. ఊరి పక్క పిల్ల కాల్వలు ఉన్నా రైతుల ఆత్మహత్యలు తప్పడం లేదు.. పోలవరం ప్రాజెక్టు కోసం పునరావాసం చూపించకుండానే మమ్మల్ని సొంతూళ్ల నుంచి వెళ్లగొట్టారు.. సుద్దగడ్డ కాలువ ఊళ్ల మీద పడి కకావికలం చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ ప్రభుత్వం ఎవరిని ఆదుకుందన్నా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం 226వ రోజు ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి గొల్లప్రోలు మీదుగా తాటిపర్తి క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగించారు. మన కష్టాలు వినే నాయకుడు వచ్చారంటూ ఊరూరా పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ, మంగళ వాయిద్యాల మధ్య హారతులు పట్టి.. వార్లు పోసి ఘన స్వాగతం పలికారు. మరోవైపు.. ఈ మూగ, చెవిటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు ఎక్కడం లేదని కష్టాలు చెప్పుకున్నారు.    

చచ్చిపోతున్నా పట్టించుకోరా?
పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో సైతం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఓ కౌలు రైతు కుమార్తె అడపా దేవి జగన్‌ దృష్టికి తీసుకువచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఏడుగురు అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వారిలో తన తండ్రి రామిశెట్టి రామకృష్ణ (2015లో) కూడా ఉన్నారని బావురుమంది. ఈ ఏడుగురు రైతుల్లో ఏ ఒక్కరికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని వాపోయింది.

‘బలవన్మరణానికి పాల్పడ్డ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అందుకు వివిధ రకాల పత్రాలు చూపించాలని జీవో కూడా ఇచ్చారు. ఆ మేరకు అన్ని రకాల పత్రాలు.. ఆధార్, రేషన్, ఎఫ్‌ఐఆర్, పంచనామా, మరణ ధృవీకరణ పత్రాలు అధికారులకు అందజేసినప్పటికీ ఇంతవరకు ఎక్స్‌గ్రేషియో రాలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేదు.

ఇలాగైతే ఎలాగన్నా.. మేమెలా బతకాలన్నా? చనిపోయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోదా?’ అని ఆమె కన్నీటిపర్యంతమైంది. దేవీ బాధను విన్న జగన్‌.. ఈ విషయమై పూర్తి వివరాలను కనుక్కోవాల్సిందిగా తన సహాయకులను ఆదేశించారు. అవసరమైతే సంబంధిత అధికారులతో మాట్లాడండని సూచించారు. రామకృష్ణ సహా బలవన్మరణాలకు పాల్పడ్డ కుటుంబాలన్నింటినీ ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  
 
పునరావాసం ఎప్పుడు?
పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూముల్ని తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి పరిహారం గానీ, పునరావాసం కాని కల్పించలేదని ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం (గిరిజన, గిరిజనేతరులు) ప్రతినిధులు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. గొల్లప్రోలు హై వే సమీపంలో వారు జగన్‌ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇప్పించాలని కోరారు. సహాయ పునరావాస చట్టం ప్రకారం ఇళ్లు కట్టించి ఇవ్వాలని విన్నవించారు. జగన్‌ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం రాగానే తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

సుద్దగడ్డ కాలువను ఆధునీకరించకపోవడంతో గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురయి తీవ్రంగా నష్టపోతున్నట్టు పలువురు బాధితులు జగన్‌కు తమ గోడు వినిపించారు. ప్రత్తిపాడు సమీపంలో ప్రారంభమయ్యే ఈ కాలువ తాటిపర్తి, కొడవలి, గొల్లప్రోలు, మల్లవరం మీదుగా సముద్రంలో కలుస్తుంది. నాలుగైదేళ్లుగా ఈ కాలువను బాగు చేయకపోవడంతో పూడుకుపోయి గొల్లప్రోలు సమీపంలోని ఇబీసీ, ఎస్సీ కాలనీలు, సుమారు 20 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి పరిస్థితే ఏర్పడితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ కాలువను ఆధునీకరించి నీళ్లు సజావుగా పోయేలా చేశారని వివరించారు.  
 
ఏలేరు ఆధునీకరణలో అక్రమాలు..
ఏలేరు ఆధునీకరణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకు చెందిన రైతులు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయలు కమీషన్ల పేరిట నొక్కేస్తున్నారని చెప్పారు. తమకు రుణాలు మాఫీ చేయకపోగా నూలు మీద రాయితీని తగ్గించారని చేనేతలు వాపోయారు. దారిపొడవునా జనం.. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని, పింఛన్లు రావడం లేదని, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని జగన్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులు, ఏఎన్‌ఎంలు జగన్‌ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.  
 
జగన్‌ను అభినందించిన కాపు నేతలు
కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో కాపులు బ్రహ్మరథం పట్టారు. జగన్‌కు కృతజ్ఞతలు అంటూ ప్లకార్డులు పట్టుకుని కాపు యువకులు పాదయాత్రలో జగన్‌తో కలిసి అడుగులు వేశారు. పూల వర్షం కురిపించారు. వైఎస్‌ జగన్‌ మాటపై నమ్మకముందని చెబుతూ పూలమాలలు అందించి శాలువాలు కప్పారు. కాపుల్ని పక్కదారి పట్టించే చంద్రబాబును, ఆయన అనుయాయులను నమ్మబోమంటూ పలువురు కాపు నేతలు చెప్పారు.  
 

మరిన్ని వార్తలు