నువ్వే మాకు అండ..

16 Nov, 2018 03:26 IST|Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో మహిళలు

అప్పట్లో పేదలకు మీ నాన్నే పెద్ద దిక్కు

వాళ్లెన్ని కుట్రలు చేసినా ఈసారి మీరే వస్తారు  

అందరినీ ఆదుకుంటారని నమ్మకం  

దారిపొడవునా కష్టాలు చెప్పుకున్న రైతులు, విద్యార్థులు

అందరికీ ధైర్యం చెప్పిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మాలాంటి పేదోళ్లకు మీ నాన్న పెద్ద దిక్కుగా ఉండే వారు.. ఇప్పుడు నువ్వే అండ.. నీకేమీ కాకూడదన్నా.. ఎవరెన్ని కుట్రలు చేసినా అవి నిన్నేమీ చేయలేవన్నా.. నువ్వు తప్పకుండా సీఎం అవుతావన్నా..’ అని మహిళలు పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 298వ రోజు గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు.

ఉదయం జగన్‌ పాదయాత్ర శిబిరం నుంచి బయటికి రావడానికి సుమారు గంట ముందునుంచే ఆయన్ను కలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో మహిళలు అక్కడ వేచి ఉన్నారు. దారిపొడవునా మహిళలు ఆయన్ను చుట్టుముట్టి కలుసుకోవడానికి ప్రయత్నించారు. పొలాల్లో ఉండే రైతులు సైతం వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. చిన్నారాయుడుపేట వద్ద గుంపులుగా వచ్చిన మహిళలు.. నువ్వు బాగుండాలని అశ్రునయనాలతో ఆకాంక్షించారు. జగన్‌ యాత్రలో అడుగడుగునా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. మార్గం మధ్యలో విద్యాసంస్థలు వచ్చినపుడు పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.  
 

బాబొస్తే జాబు వస్తుందన్నారు..
‘ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. బాబొచ్చారు కానీ జాబు లేదు. ఉద్యోగం లేదా ఉపాధి చూపలేకపోతే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామన్నారు. అదీ లేదు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని పది మందిలో ఒకరికి.. కంటితుడుపుగా కేవలం రూ.వెయ్యి ఇస్తూ అందరినీ మోసం చేశారు’ అని పద్మ అనే మహిళ వాపోయింది. తన ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తున్నా ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఝంజావతి హైలెవెల్‌ కెనాల్‌ను నిర్మించి తమను ఆదుకోవాలని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు జగన్‌కు విన్నవించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయినా ప్రభుత్వం తమను ఆదుకోలేదని ఫిర్యాదు చేశారు. ‘మా గ్రామ శివారులోని చిట్టిగెడ్డపై వంతెన లేక ఇక్కట్లు పడుతున్నాం. గ్రామం నుంచి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. దీనిని దాటుకొని వెళ్లడం వలన తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పలువురు మృత్యువాత పడ్డారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికార పార్టీ నాయకులను ఎన్ని సార్లు వేడుకున్నా ఫలితం లేద’ని పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌ వై.రమణమూర్తి జననేత దృష్టికి తీసుకొచ్చారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
 

 

నకిలీ విత్తనాలతో నట్టేట ముంచారన్నా..
అన్నా.. మాది సూరంపేట. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సుమంగళి సీడ్స్‌కు చెందిన ఎంటీయూ 1075 రకం విత్తనాలు సరఫరా చేశారు. అవన్నీ నకిలీ విత్తనాలే. మమ్మల్ని నట్టేట్లో ముంచారు. వందల ఎకరాల్లో పంట నష్టపోయాం. సీతానగరం వ్యవసాయ శాఖ ద్వారా మండలంలోని రైతులకు 367 బ్యాగుల నకిలీ విత్తనాలను సరఫరా చేశారు. మా పంటలు పోయిన వెంటనే అధికారులకు ఫిర్యాదు చేస్తే విత్తనాలు నకిలీవే అని ధ్రువీకరించి లిఖిత పూర్వకంగా మాకు అందజేశారు. ఆదుకుంటామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు.   – బొంగు హేమ సుందరనారాయణ, ఎం.వెంకటరమణ, బి.రమేష్, వై.కామేశ్వరరావు, సింహాచలం, ఫకీరునాయుడు
 

మైదాన ప్రాంత ఎస్టీలను ఐటీడీఏ పరిధిలో చేర్చాలి
అన్నా.. మైదాన ప్రాంత ఎస్టీలను ఐటీడీఏ పరిధిలోకి తీసుకుని గిరిశిఖరాల్లో ఉన్న ఎస్టీలతో సమానంగా రిజర్వేషన్లు కల్పించాలి. కేవలం మైదాన ప్రాంతంలో ఉంటున్నామనే కారణంతో ఇక్కట్లు పడుతున్నాం. నర్సింగ్, డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్నాం. మీరు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఐటీడీఏ పరిధిలో చేర్చి, రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు చేపట్టాలి.   – ఎస్టీ నిరుద్యోగ యువతులు, చినరాయుడుపేట    మేమంతా నీ వెంటే ఉన్నాం..

మేమంతా నీ వెనకే ఉన్నాం
మేమంతా నీ వెనకే ఉన్నాం అన్నా.. నిన్నెవరూ ఏం చేయలేరన్నా.. నీ వెనక ఉన్న జనాన్ని చూసి ఓర్వలేక నిన్ను కడతేర్చాలనుకున్నారన్నా.. ఆ దేవుడి దయతో అది విఫలమైంది. అలా చేయించినోళ్లు మట్టికొట్టుకు పోతారన్నా.. ఎప్పటికైనా మంచోళ్లకు మంచే జరుగుద్దన్నా. ఎంతమంది కుట్రలు చేసినా మీరు సీఎం అవుతారు.. పేదలందరినీ ఆదుకుంటారనే నమ్మకం మాకుంది.    – కుడుము సరస్వతి, వాగదండ అప్పలనర్సమ్మ, పబ్బిరెడ్డి అప్పలనర్సమ్మ, ఉద్వాల గంగ, ఉద్వాల పార్వతి, రెడ్డి అప్పలనర్సమ్మ, చినరాయుడుపేట  

మరిన్ని వార్తలు