అదో చరిత్ర!

24 Sep, 2018 13:10 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

‘మాది ఇచ్ఛాపురం... దివంగత మహానేత కుటుంబంతో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఊరు ఇది. 2003 సంవత్సరంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ముగింపుగా ఇక్కడికొచ్చినప్పుడు ఆయన్ను కలవడంతోనే నా జన్మ ధన్యమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు అమోఘం. ఆ తర్వాత ఆయన తనయ వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర ముగింపుకూడా ఇక్కడే. అప్పుడామెను చూస్తే మా రాజన్నను మళ్లీ చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ఆయన కుమారుడైన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ప్రజాసంకల్ప యాత్ర పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు చేరుకుందని తెలిసి నాకెంతో ఆనందం కలుగుతోంది. ఈ యాత్ర కూడా కనీవినీ ఎరగని రీతిలో మా ఊరిలోనే ముగించనున్నారంటే అదో రికార్డు!’  – ఇదీ తుంగాన మాధవరావు అనే వ్యక్తి మనోభావం! ఆయనొక్కరే కాదు సిక్కోలు ప్రజలంతా జననేత రాక ఎప్పుడెప్పుడా అనే ఆర్ధ్రతతో ఎదురుచూస్తున్నారు! 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అలవిగాని ఆరొందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా దోపిడీలతో పాలన చేస్తున్న వేళ! విభజనతో గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెడతానని చెప్పిన నేతలు మాటమార్చి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న నేపథ్యంలో ‘అన్న వస్తున్నాడు’ అని భరోసా ఇచ్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టినదే ప్రజాసంకల్ప యాత్ర! 2017 నవంబరు 6వ తేదీన వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ మహాకార్యం 11 జిల్లాల్లో 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,650 గ్రామాలను దాటుకొని 3000 కిమీ మైలురాయిని నేడు అందుకుంటోంది.

ప్రజల జయజయధ్వానాల మధ్య జననేత అడుగుపెడుతున్న ఈ ఘట్టానికి వేదికవుతోంది విజయనగరం జిల్లా! మరికొద్ది రోజుల్లో అంతకుమించిన జనప్రభంజనం మధ్య ముగింపు ఘట్టాన్ని నభూతో నభవిష్యతి రీతిన నిర్వహించాలని సన్నద్ధమవుతున్న వేదిక కూడా ఇచ్ఛాపురమే! ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు నేతలు సుదీర్ఘ పాదయాత్రలు నిర్వహించడం ఒక రికార్డు! అలా ఆ మూడు పాదయాత్రల ముగింపునకూ ఇచ్ఛాపురమే వేదిక కావడం అదో ఘనత! మరో కొద్ది రోజుల్లో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు ఇచ్ఛాపురం నియోజకవర్గ కేంద్రంలోనే ముగి యనుంది! విజయనగరం జిల్లా తర్వాత జిల్లాలో అడుగుపెట్టబోయే జననేతకు ఘనంగా ఎప్పుడు స్వాగ తం పలకాలా అని సిక్కోలు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

సంఘీభావంగా పలు కార్యక్రమాలు...
ప్రజాసంకల్పయాత్ర 3 వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్‌ ఆరోగ్యం కోసం సోమవారం శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటీశ్వరాలయంలో 3 వేల పుష్పాలతో వైఎస్సార్‌సీపీ నాయకులు పూజలు నిర్వహించనున్నారు. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర 3 వేల కిమీ పూర్తయినందుకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ బైక్‌ర్యాలీలు నిర్వహించనున్నారు. తర్వాత మూడ్రోజుల పాటు సంఘీభావ పాదయాత్రలు అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టనున్నారు. ఇందునిమిత్తం నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

వైఎస్‌ రాజశేఖరరెడ్డి...2003 నాటికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కనీవినీ ఎరుగని కరువుకాటకాలు! తెలుగు నేల అతలాకుతలమైన విపత్కర పరిస్థితులు! ఇలాం టి పరిస్థితుల్లో కర్షక, కార్మిక, బడుగు వర్గాలను పలకరించి ఉపశమనం కల్పించాలని నాడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం మొదలైంది. 2003 ఏప్రిల్‌ 9న ప్రారంభమైన ఈ యాత్ర 68 రోజుల పాటు 1,470 కిమీ దూరం సాగింది. అడుగడుగునా ప్రజల కష్టాలు చూస్తూ వారి కన్నీళ్లు తుడుస్తూ సాగిన ఈ పాదయాత్ర జూన్‌ 15వ తేదీన ముగిసింది.

వైఎస్‌ షర్మిల... 2012 నాటికి ప్రతిపక్షం టీడీపీతో కుమ్మకైన ప్రభుత్వం కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను మరింత కష్టపెడుతున్న వైనం! జననేతగా ఎదుగుతున్న రాజన్న తనయుడు జననన్నను నేరుగా ప్రజల్లో ఎదుర్కోలేక అక్రమంగా కేసులు బనాయించిన కుతంత్రం! 14 నెలల పాటు బయటకు రానీయకుండా బంధించిన దుర్మార్గం! ఇలాంటి పరిస్థితుల్లో  తండ్రి వైఎస్సార్‌ ఆశయాలే ప్రాణంగా... జగనన్న వదిలిన బాణంగా... ప్రజల తోడుగా.. ప్రజల సాక్షిగా ప్రజల కోసం వైఎస్‌ షర్మిల తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర! అదో సంచలనం! 2012 అక్టోబరు 18న వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద నుంచి మొదలైన ఈ పాదయాత్ర 13 జిల్లాల్లో 116 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3,112 కి.మీ. పాటు కొనసాగి 2013 ఆగస్టు 4న ముగింపు.

మరిన్ని వార్తలు