పాదయాత్ర @ 3,000 కిలోమీటర్ల మైలురాయి

20 Sep, 2018 12:18 IST|Sakshi

ఈ నెల 24న విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం వద్ద మైలురాయిని దాటనున్న జననేత

ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ, పైలాన్‌ ఆవిష్కరణ

పాదయాత్రకు బ్రహ్మాండమైన ప్రజాదరణ.. బాబు పాలన అంతానికి అంకురార్పణ

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం వెల్లడి

 

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఓ మహా సంకల్పంలా ముందుకు సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ.. నేనున్నానని భరోసా ఇస్తూ.. ముందుకుసాగుతున్న జననేత పాదయాత్ర మరో మైలురాయిని దాటబోతోంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఈ నెల 24వ తేదీన విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గరలోని దేశపాత్రునిపాలెం వద్ద 3000కిలోమీటర్ల మైలురాయిని చేరనుందని, ఈ సందర్భంగా అక్కడ ఓ భారీ బహిరంగ సభ నిర్వహించి.. ఫైలాన్‌ను ఆవిష్కరించబోతున్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు అంతరాయం కలిగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. పార్టీ శ్రేణులు వాటినన్నింటినీ అధిగమించి పాదయాత్రను విజయవంతం చేశాయని సంతోషం వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలివస్తున్నాయని తెలిపారు. దేశంలోనే వైఎస్‌ జగన్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరని అభిప్రాయపడ్డారు. ఆయన పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణతోనే చంద్రబాబు పాలన అంతానికి అంకురార్పణ జరిగిందని అన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ విజయం సాధించారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు పాలనను వైఎస్సార్‌ ఎలా అంతమొందించారో.. ఇప్పుడు అలానే వైఎస్‌ జగన్‌ పునరావృతం చేస్తారని అన్నారు. జననేత పాదయాత్ర ఇప్పటివరకు.. 116 నియోజకవర్గాల్లోని 193 మండలాల్లో.. 1650 గ్రామాల మీదుగా సాగిందని, అదేవిధంగా 44 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల పరిధిలో పాదయాత్ర జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు పాదయాత్రలో భాగంగా 106 సభలు, 41 ఇంట్రాక్షన్లు జరిగాయని వివరించారు.  269వ రోజు పాదయాత్ర దేశపాత్రునిపాలెంలోకి ప్రవేశిస్తుందని, అక్కడ 107వ బహిరంగ సభ జరగనుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు