జననేతకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు...

18 Nov, 2018 13:47 IST|Sakshi

చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. వజ్రసంకల్పంతో ముందడుగు వేస్తున్నారు వైఎస్‌ జగన్‌. ప్రతి గుండెలో తాను కొలువై ఉండాలని... ప్రతి ఇంటా వెలుగులు నింపాలన్న ఆకాంక్షతో జననేత పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 2017, నవంబర్‌ 6న ఇడుపులపాయలో మొదలైన జననేత పాదయాత్ర... 11జిల్లాలు పూర్తిచేసుకుని... 12వ జిల్లాలో కొనసాగుతోంది. తనపై హత్యాయత్నం జరిగినా తలవంచని ధీరుడిగా ముందుకుసాగుతున్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పరితపిస్తానన్న వైఎస్‌ జగన్‌.. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు వెలిగించాలన్న తన సంకల్పాన్ని మరింత బలపరుచుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత కురుపాం నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టనున్నారు.

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆదివారం మధ్యాహ్నం భోజన విరామం తరువాత కురుపాం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తమ నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న జననేతకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పవాణి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ రాకకోసం కురుపాం నియోజవర్గ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. తమ సమస్యలు తీర్చే నాయకునికి ఘనస్వాగతం పలకాలని ప్రజలు ఆశపడుతున్నారని అన్నారు. కాగా, నేడు కురుపాం నియోజకవర్గంలో గరుగుబిల్లి, రామినాయుడు వలస మీదుగా తోటపల్లి రిజర్వాయర్‌ వరకు జననేత పాదయాత్ర సాగనుంది.

మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చి.. తమ ఆవేదనను పంచుకుంటున్నారు. పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిసిన గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యూలర్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ పోస్టులను డీఎస్సీలో చూపించి.. తమ జీవితాలను రోడ్డున పడేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసిన రెల్లి కులస్తులు తమ సమస్యలపై.. ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి తమకు సరైన ప్రోత్సహాకాలు అందడంలేదని వాపోయారు. నిరుపేదలుగా జీవనం గడపాల్సి వస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు వైఎస్‌ జగన్‌ కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పరిహారం అందక, ఉండేందుకు ఇల్లు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వారు కన్నీరు పెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే తమకు న్యాయం జరుగుతుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు