‘అందరి ఆరోగ్యం చూసుకొనే తమకే భద్రత లేదు’

30 Dec, 2018 08:30 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆరోగ్య మిత్రలు

సాక్షి, శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆరోగ్యమిత్రలు ఆదివారం కలిశారు. 2003 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నా తమను రెగ్యులర్ చేయడం లేదని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమను రెగ్యులర్‌ చేయకపోగా ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని వైఎస్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయడంలేదని చెప్పారు. ఫలితంగా అందరికీ ఆరోగ్యం అందించేందుకు పనిచేసే తమకే ఆరోగ్య భద్రత లేకుండా పోయిందని వాపోయారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని  కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు తమ గోడును తెలియజేస్తూ జననేతకు వినతిపత్రం ఇచ్చారు.

నేటి పాదయాత్ర ఇలా..
ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 333వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం పలాస నియోజకవర్గంలోని ఉండ్రుకుడియ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం, మహదేవిపురం క్రాస్‌, గరుడఖంది వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ లంచ్‌ విరామం తీసుకుంటారు. విరామం అనంతరం చినబాదాం మీదుగా పలాస-కాశిబుగ్గ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం పలాస-కె.టి రోడ్డులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

మరిన్ని వార్తలు