మద్యాన్ని నిషేధించాలన్న నా సంకల్పం మరింత బలపడింది

21 Jan, 2018 03:10 IST|Sakshi

66వ రోజు
20–01–2018, శనివారం
చిందేపల్లి, 
చిత్తూరు జిల్లా

ఈ రోజు ఉదయం మోదుగపాలెంలో వాణెమ్మ అనే అవ్వ ‘మా ఊర్లో మందు షాపు తీయించు నాయనా.. ఊరంతా గుల్లయిపోతాంది’అంది. మద్యం వల్ల కాపురాలు కకావికలమవుతున్నాయి. కుటుంబ బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు కరువవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోయి, విచక్షణాజ్ఞానం కోల్పోయి, ఉచితానుచితాలు మరచి ప్రవర్తిస్తున్నారు. కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇన్ని జరుగుతున్నా.. ఈ ప్రభుత్వమే మద్యం రక్కసిని పెంచిపోషిస్తోంది. ఆ అవ్వకు ఉన్న కనీస సామాజిక స్పృహ ఈ ప్రభుత్వానికి ఉంటే ఎంత బావుండేది. అందుకే మన ప్రభుత్వంలో మద్యాన్ని నిషేధించాలన్న నా సంకల్పం మరింత బలపడింది. 

కొత్తవీరాపురం గ్రామంలో.. ఊరంతా సంక్రాంతి వాతావరణాన్ని తలపించింది. గ్రామ ప్రజలు ఉదయం నాలుగు గంటలకే లేచి, ఊరంతా కళ్లాపి చల్లి, ముగ్గులు వేసి, పూలు పరిచి.. నా కోసం ఎదురుచూశారు. ‘అన్నా.. ఈ రోజే మాకు అసలైన పండుగ’అన్నారు. వారి ప్రేమాభిమానాలు నన్ను కట్టిపడేశాయి. 

కోబాక వద్ద నరసింహనాయుడు అనే తాత కలిశాడు. గత మే నెలలో తుపాను కారణంగా తన ఇల్లు ధ్వంసమైందని, రెవెన్యూ అధికారులు వచ్చి రూ.65 వేలు నష్టం జరిగిందని అంచనా వేశారని, కానీ.. రాజకీయ కారణాలతో ఇంతవరకూ తనకు పరిహారం ఇవ్వలేదని చెప్పాడు. సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్న పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా అదే తుపానులో కూలిపోయిందని, దానిని ఇంతవరకూ పునరుద్ధరించకపోవడంతో వ్యవసాయం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వాపోయాడు. తన గ్రామంలో 20, 30 సంవత్సరాల కిందట కట్టుకున్న మరుగుదొడ్లకు కూడా టీడీపీ వారు బిల్లులు చేసుకున్నారని, తనలాంటి అర్హులైన వారిపట్ల అన్ని విషయాలలో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు.

ప్రభుత్వ పక్షపాత వైఖరి వల్ల 70 ఏళ్లు పైబడిన ఆ తాత పడుతున్న ఇబ్బందిని చూసి చాలా బాధేసింది. 
సాయంత్రం.. మన్నసముద్రానికి చెందిన శివచంద్ర అనే యువకుడు తన తల్లితో కలిసి వచ్చి ‘అన్నా.. మేము ఎస్సీలం. చాలా పేదవాళ్లం. నేను ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ చేశాను. 80 శాతం పైగా మార్కులొచ్చాయి. 2014లో చదువు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు ఉండి ఉంటే.. నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు’అని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఇప్పించామంటున్న పాలకులు.. ఇలాంటి యువకులకు ఏం సమాధానం చెబుతారు?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మన రాష్ట్రంలో లక్షలాది మంది యువకులు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఏమైంది మీ ఇంటికో ఉద్యోగం? ఎక్కడికి పోయింది మీ నిరుద్యోగ భృతి? 


ఏర్పేడులో చిన్నారిని ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు