ప్రకాశం జిల్లాలోకి ప్రజాసంకల్పయాత్ర

16 Feb, 2018 10:05 IST|Sakshi

రాజన్నబిడ్డకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

కొత్తపేటలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, ఒంగోలు: వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా వైఎస్‌ జగన్‌ కొత్తపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.  ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో 9 నియోజకవర్గాల పరిధిలో 255 కి.మీ. మేర సాగనుంది. జగన్‌ యాత్రకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

జగన్‌ భరోసా కోసం ఎదురుచూపు:
గత ఎన్నికల సమయంలో వందలాది హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చక చంద్రబాబు సర్కారు ప్రజలను వంచించింది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ రకరకాల హామీలిచ్చి అన్ని వర్గాలను మభ్యపెట్టారు. ఓట్లేయించుకొని గద్దెనెక్కి హామీలను తుంగలో తొక్కారు. బాబు వంచనతో రైతులు మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, చేనేతలు, కార్మికులు అన్ని రకాల వారు దగా పడ్డారు. చంద్రబాబు సర్కారు వంచనను ఎండగట్టడమే కాక దగా పడిన బాధితులందరికీ తానున్నానంటూ భరోసా కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ యాత్ర సాగుతోంది. జగన్‌కు తమ బాధలు, కష్టాలు, కన్నీళ్లు చెప్పుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. రామాయపట్నం పోర్టు వస్తే వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు మేలు జరుగుతుందని అందరూ ఆశ పడుతున్నారు. పోర్టు వస్తేనే పరిశ్రమలొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలొస్తాయని ఎదురు చూస్తున్నారు.

పొగాకుకు గిట్టుబాటు ధరల్లేక ఇక్కడి రైతులు లబోదిబోమంటున్నారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ నీళ్లే దిక్కు కావడంతో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధుల బారినపడి వందలాది మంది మృత్యువాతపడుతున్నారు.గుక్కెడు మంచినీళ్ల కోసం వారు దోసిలొగ్గి వేడుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే వరుస కరువులకు నిలయంగా మారిన పశ్చిమ ప్రకాశం కష్టాలు తీరతాయి. కానీ బాబు సర్కారు కనికరించడం లేదు. మిరప రైతులకు గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి, నాగార్జున సాగర్‌ కుడికాలువ ఉన్నా వరి పంటకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పంటలకు అంతంతమాత్రమే నీరు. వైఎస్‌ హయాంలో కొద్దిపాటి నీరున్నా పెద్ద మనసుతో నీళ్లిచ్చిన ఘనత ఆయనకే దక్కిం ది. చీరాల ప్రాంతంలో చేనేతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముం దుకు రావడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో సవాలక్ష సమస్యలున్నా బాబు సర్కారు పట్టించుకోవడం లేదు. సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చేందుకు జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఆయన భరోసా కోసం ఆశపడుతున్నారు.

తొలిరోజు ప్రజాసంకల్పయాత్ర ఇలా...
తొలిరోజు జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి రాళ్లపాడు రిజర్వాయర్, తాతా హోటల్, జంపాలవారిపాలెం, పెంట్రాల,వాకమళ్లవారిపాలెం, లింగసముద్రం, బలిజపాలెం,  రామకృష్ణాపురానికి చేరనుంది. ఇక్కడితో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 1200 కి.మీ. చేరనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం భోజన విరామం సైతం ఇక్కడే. ఆ తర్వాత తిమ్మారెడ్డిపాలెం క్రాస్, వెంగళాపురం మీదుగా వలేటివారిపాలెం మండలం కమ్మపాలెం, బంగారక్కపాలెం క్రాస్‌ వద్ద తొలిరోజు యాత్ర ముగియనుంది.

ఇక్కడే రాత్రి బస
17వ తేదీ ఉదయం వలేటివారిపాలెం నుంచి రెండవ రోజు యాత్ర ప్రారంభమై పోలినేనిపాలెం వద్ద మధ్యాహ్నం స్టే. ఆ తర్వాత షామిరుపాలెం క్రాస్‌ రోడ్డు, పోకూరు వరకు రెండో రోజు యాత్ర ముగుస్తుంది.18న బడేరుపాలెం ఎస్సీ కాలనీ, మోపవరం, బడేరుపాలెం, బొంతవారిపాలెం, కాకుటూరు, చెర్లోపల్లి, ప్రశాంత్‌నగర్‌ వరకు మధ్యాహ్నం స్టే. ఆ తర్వాత కందుకూరులో సభ, సాయంత్రం వెంకటాద్రిపాలెం వరకు యాత్ర సాగి అక్కడ రాత్రి బస ఉంటుంది. 

మరిన్ని వార్తలు