ఇలాగైతే ఎలా బతకాలన్నా..?

8 Mar, 2018 03:13 IST|Sakshi
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు శివారులో బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు తమ కష్టాలు వివరిస్తున్న రైతులు

దారిపొడవునా ప్రతిపక్ష నేత ఎదుట గోడు వెళ్లబోసుకున్న రైతులు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక నష్టపోయానన్నా.. అంటూ ఓ పొగాకు రైతు, అప్పు తెచ్చి.. పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే తుదకు పెట్టుబడి ఖర్చులు కూడా చేతికందలేదని మిర్చి రైతు, శనగ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నా అని మరో రైతు.. బుధవారం ఇలా దారిపొడవునా అన్నదాతలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వారి కష్టాలు ఏకరువుపెట్టారు.

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 106వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఇంకొల్లు శివారు నుంచి ప్రారంభమై హనుమోజిపాలెం, జరుబులవారిపాలెం, కొడవలివారిపాలెం, కేశవరప్పాడు, రంగప్పనాయుడుపాలెం క్రాస్‌రోడ్స్‌ మీదుగా సంతరావూరు వరకు కొనసాగింది. ఓ వైపు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను జగన్‌కు విన్నవించగా, మరో వైపు తమ కష్టాలు వినే నాయకుడు వచ్చాడంటూ ఊరూరా జనం స్వాగతం పలికారు.

వేలిముద్రలు పడలేదని బియ్యం ఇవ్వలేదు
నాలుగు నెలలుగా వేలిముద్రలు పడటం లేదని రేషన్‌ బియ్యం ఇవ్వకుండా ఆపేశారని నందిగుంటపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుల సుగుణమ్మ(90) తన బాధను జగన్‌తో చెప్పుకుంది. తాను ఎన్నో ఏళ్లుగా రేషన్‌ బియ్యం తీసుకున్నానని, ఇప్పుడే ఈ సాకు చూపుతూ బియ్యం ఆపేయడం దారుణం అని వాపోయింది. చంద్రబాబు పాలన అంతా డాబుసరితోనే ఉంది తప్ప తమ లాంటి వారికి న్యాయం జరగటం లేదంది.  అందరి కష్టాలు ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు