రాజకీయ ప్రభంజనం 

24 Sep, 2018 04:39 IST|Sakshi
విశాఖలోని కంచరపాలెం సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం

టీడీపీలో వణుకు పుట్టిస్తున్నప్రజాసంకల్ప యాత్ర 

వైఎస్సార్‌సీపీదే భవిష్యత్తు అంటూ నిగ్గుతేల్చిన జాతీయ సర్వేలు 

జగన్‌ నిర్ణయాలతో బాబు బోల్తా..హోదాపై యూటర్న్‌ 

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మాటల తూటాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. సర్కార్‌ అవినీతిపై చర్నాకోలా ఝళిపిస్తూ.. వైరి పక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సాగిపోతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. జనవాణి అభీష్టానికి తగ్గట్టుగా వైఎస్సార్‌సీపీ జెండాను వారికి మరింత దగ్గర చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ అవనికలో వైఎస్సార్‌సీపీనే జనంలోకి దూసుకెళ్తోందని జాతీయ సర్వేలు నిగ్గుతేల్చే స్థితికి తీసుకొచ్చారు.  దాదాపుగా ఏడాది కాలం నుంచి పాదయాత్ర చేస్తూ జగన్‌ జనం మధ్యే ఉండగా ఈ సమయంలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమీకరణాలు మారాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజకీయ వేడి రాజుకుంది. అయినా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ జగన్‌ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 

అధికార పక్షం ఉక్కిరిబిక్కిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలన.. అవినీతిపై జగన్‌ సంధించిన విమర్శనాస్త్రాలు అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భవిష్యత్తులో రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమన్న భావన టీడీపీ వర్గాలను పీడిస్తోంది. మెజారిటీ ఓటర్లు జగన్‌ వైపే దృష్టిపెట్టడంతో అధికార పార్టీ జీర్ణించుకోలేని స్థితి. ‘మన ప్రభుత్వం అధికారంలోకొస్తే ఏం చేస్తుందో’ చెప్పడంలో జగన్‌ నూటికి నూరుపాళ్లు అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. ఉదాహరణకు..  

- ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆక్వా రైతుల ఆవేదన విన్న వెంటనే జగన్‌ స్పందించారు. అధికారంలోకొస్తే యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామన్నారు.  ఠి తానొస్తే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను దశల వారీగా పర్మినెంట్‌ చేస్తానంటూ జగన్‌ చేసిన ప్రకటనతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. 
ప్రభుత్వోద్యోగుల సీపీఎస్‌ను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానన్న జగన్‌ భరోసా సర్కార్‌ ఉద్యోగులకు ఊరటనిచ్చింది. దీంతో ప్రభుత్వం షాక్‌కు గురైంది. 
 జగన్‌ ఎత్తులతోనే బాబు యూటర్న్‌: పాదయాత్ర సమయంలో ప్రకంపనలు పుట్టించిన మరో అంశం ప్రత్యేక హోదా. హోదా కంటే ప్యాకేజీనే భేష్‌ అంటూ చంద్రబాబు చేసిన ప్రచారాన్ని జగన్‌ రాజకీయంగా చిత్తు చేశారు. హోదా కోసం తన పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారని, ఏపీ భవన్‌లో ఆమరణ దీక్షకు సిద్ధపడతారంటూ రాజకీయ వర్గాలను కంగుతినిపించే కీలక నిర్ణయాన్ని పాదయాత్ర సభలో జగన్‌ వెల్లడించారు. జాతీయ స్థాయిలో రాజకీయ వేడి పుట్టించిన ఈ ఘట్టం అనేక మలుపులు తిరిగింది. ఎన్డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకునే సందర్భంలోనూ జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.  హోదా కోసం కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టే క్రమంలోనూ వైఎస్సార్‌సీపీదే పైచేయి. అందుకు జగన్‌ మద్దతు కూడగడుతున్న సమయంలోనే చంద్రబాబు యూటర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది.  బీజేపీనే కాదు.. ఏ పార్టీతోనూ వచ్చే ఎన్నికల్లో పొత్తుకెళ్లాల్సిన అవసరమే తమకు లేదని జగన్‌ కుండబద్దలు కొట్టారు. వీటన్నింటితో ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఫలితంగా తామంతా జగన్‌ వెంటేనని ప్రజలు స్పష్టీకరిస్తున్నారు.   
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం: పార్టీ అంతర్గత.. విస్తృతస్థాయి సమావేశాలన్నీ పాదయాత్ర కేంద్రంగానే నిర్వహించారు.  విశాఖలో ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 

రాష్ట్ర రాజకీయ గతిని మార్చేసిన ఘట్టాలు 
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సీఎం చంద్రబాబును ఆత్మరక్షణలో పడేశాయి. తొలుత ప్రత్యేక హోదాకు ‘నో’ అన్న చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లో యూటర్న్‌ తీసుకుని హోదా డిమాండ్‌కు జై కొట్టాల్సి వచ్చింది.  
నెల్లూరు జిలా ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి బహిరంగ సభలో జగన్‌ విసిరిన సవాలుకు చంద్రబాబు విలవిలలాడారు. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో తమ పార్టీ లోక్‌సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో పోరాడతారని, సానుకూలంగా స్పందన రాకపోతే ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేస్తారన్న వైఎస్‌ జగన్‌ ప్రకటన చంద్రబాబును దిమ్మతిరిగేలా చేసింది. 
ఈ సంఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగారు.  
వందల కోట్ల నష్టాలతో కునారిల్లుతున్న ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రతిపక్ష నేత జగన్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపింది.  
పాడి పరిశ్రమకు కీలక జిల్లాల్లో ఒకటైన చిత్తూరు పాదయాత్రలో ఉన్నప్పుడు ప్రతి లీటర్‌ పాలపై రూ.4 సబ్సిడీ రైతులకు చెల్లిస్తామని ప్రకటించి అధికార పక్షాన్ని ఓ కుదుపు కుదిపారు. 
కాపు సామాజికవర్గ సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని, అందుకోసం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని తూర్పు గోదావరి జిల్లాలో ప్రకటించారు. చిత్తశుద్ధితో చేసిన ఈ ప్రకటనకు కాపు సామాజికవర్గం నుంచి మంచి స్పందన లభించింది.  
ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలతోపాటు అగ్ర కులాల్లోనూ పేదలు ఉన్నారని, ఇలా వెనుకంజలో ఉన్న ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఆయా కులాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని వార్తలు