హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

11 Jan, 2019 16:19 IST|Sakshi

ప్రతిపక్షనేతకు ఘనస్వాగతం పలికిన కడప ప్రజలు

సాక్షి, కడప: అధికారంలోకి రాగానే హార్టికల్చర్‌ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర అనంతరం జిల్లాకు వచ్చిన ఆయనకు ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరులో హార్టికల్చర్‌ వర్శిటీ విద్యార్థులు ప్రతిపక్షనేతను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. హార్టికల్చర్‌లో కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జగన్‌ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.

గ్రామ సచివాలయం అనే కాన్సెప్ట్‌ను అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అమలు చేస్తామని, ఇందులో అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైతులకు టెక్నికల్‌గా సలహాలు, సూచనలు ఇచ్చే హార్టికల్చర్‌ విద్యార్థుల సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. మరో ఆరునెలల్లో దేవుడి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం వస్తుందని, చంద్రబాబు హయాంలో ధర్నాల చేసి అనవసరంగా చదువులు పాడుచేసుకోవద్దని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ విద్యార్థులకు సూచించారు. 

మరిన్ని వార్తలు