విద్యకు ధీమా.. వైద్యానికి భరోసా

6 Apr, 2019 04:26 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీలు

ప్రభుత్వ స్కూళ్లకు పిల్లల్ని పంపించాలంటే భయపడేలా చేస్తున్నారు  

ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసేలా కమిషన్‌ను తీసుకొస్తాం  

ఆ కమిషన్‌ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం  

అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజులు తగ్గించి చూపిస్తాం..  

స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పించేలా నేనే సమీక్షిస్తా..  

పేదలు, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది 

నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు  

వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తాం 

సొంత తమ్ముడినే చిన్నచూపు చూసిన బాబు ప్రజలకు పెద్దన్నగా ఉంటానంటున్నాడు   

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని చూశాడు  

ఇప్పుడు తెలంగాణను బూచిగా చూపించి ఏపీ ప్రజలను రెచ్చగొడుతున్నాడు  

వైద్యం ఇలా..
నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు  
పేదలు, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది
వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తాం

విద్య ఇలా..
ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసేలా కమిషన్‌ను తీసుకొస్తాం  
ఆ కమిషన్‌ నేరుగా సీఎంకు రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం  
అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజులు తగ్గించి చూపిస్తాం..

గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లిస్తాం. శనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,500గా నిర్ణయిస్తాం. రైతుల వద్దనున్న పంటంతా కొనుగోలు చేస్తాం’’

తన నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరులో గడిచిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు పూర్తి చేయలేని చంద్రబాబు రేపు రాష్ట్రానికి ఏదో చేస్తానంటే నమ్ముతామా? ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లను మూసివేయిస్తూ ప్రైవేట్‌ రంగానికి మేలు చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు

రాష్ట్రంలో ఎవరికైనా జాబు వచ్చిందంటే అది చంద్రబాబు ఇంటికి మాత్రమే వచ్చింది. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు, మంత్రిని సైతం చేసుకున్నాడు. చంద్రబాబు హయాంలో కొత్త ఉద్యోగాలు రాలేదు, ఉన్న ఉద్యోగాలే ఊడిపోయాయి

సాక్షి, చిత్తూరు/సాక్షి ప్రతినిధి కడప/సాక్షి, గుంటూరు:  నానాటికీ పెరిగిపోతున్న విద్య, వైద్యం రుసుములను తట్టుకోలేక ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప ఊరట కలిగించారు. ఈ ఫీజుల భారం భారీగా తగ్గించేందుకు కొత్త విధానాలను ప్రకటించారు. ఈ రెండింటిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసే విధంగా కమిషన్‌ను తీసుకొస్తామని తెలిపారు. ఆ కమిషన్‌ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజులు తగ్గించి చూపిస్తామని స్పష్టం చేశారు. అలాగే సంవత్సరానికి రూ.5 లక్షలు, అంటే నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తామన్నారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే చాలు వాళ్లందరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో తానే ఈ పథకాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని వెల్లడించారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం, వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు, గుంటూరు జిల్లాలో గుంటూరు నగరం, కృష్ణా జిల్లా విజయవాడలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. తల్లి పేరిట ఉన్న ఆస్తులను సొంత అక్కచెల్లెమ్మలకు పంచకుండా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని మండిపడ్డారు.  ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే... 

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించి చూపిస్తాం
గుంటూరు సభలో..
3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో నగరాల్లో మధ్య తరగతి ప్రజలు, పేదవాళ్లు పడుతున్న బాధలు విన్నాను. నగరాల్లో ఉన్న వాళ్లు రెండు మూడు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. అందులో ఒకటి పిల్లలను చదివించాలంటే ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లల్ని పంపించాలంటే భయపడే విధంగా చంద్రబాబు చేస్తున్నారు. సమయానికి పుస్తకాలు ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులను పెండింగ్‌లో పెడుతున్నారు. మనంతట మనమే ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లేలా చేస్తున్నారు.

వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి..: ఆరోగ్యం బాగోలేక పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ఆసుపత్రికి వెళ్తే వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ పథకం కేవలం పేదలకే వర్తిస్తోంది. పట్టణాలు, నగరాల్లో నెలకు రూ.40 వేల లోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇబ్బందులు పడుతున్నాయి. మధ్య తరగతి ప్రజలకు కూడా సహాయం అందించాలని ఆలోచించా. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సంవత్సరానికి రూ.5 లక్షలు, అంటే నెలకు రూ.40 వేలలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే చాలు వాళ్లందరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తాం.  

‘ప్రైవేట్‌’కు మేలు చేయాలన్నదే బాబు ఆరాటం..: గుంటూరు నగరం మీదుగా నా పాదయాత్ర సాగింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల పేరిట ఎక్కడికక్కడ రోడ్లు తవ్వి పూడ్చకుండా వదిలేయడం చూశాను. తన నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరులో గడిచిన ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు పూర్తి చేయలేని చంద్రబాబు రేపు రాష్ట్రానికి ఏదో చేస్తానంటే నమ్ముతామా? గుంటూరులో తాగునీటి సరఫరా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల పైపులైన్‌లోకి మురుగు నీరు చేరి డయేరియాతో 32 మంది చనిపోయారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదు. బాధిత కుటుంబాల పక్షాన వైఎస్సార్‌సీపీ దీక్షలు, ఉద్యమాలు చేసింది. 32 మందికిగాను కేవలం 8 మంది చనిపోయారని ప్రభుత్వం నిర్ధారించడం దారుణం. గుంటూరు ప్రజలకు సమగ్ర మంచినీటి సరఫరా కోసం 2013లో అప్పటి ప్రభుత్వం రూ.365 కోట్లు కేటాయించింది. ఆ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌లో లైట్లు లేక సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇదే ఆస్పత్రిలో ఎలుకలు కొరకడం వల్ల పది రోజుల చిన్నారి చనిపోయింది. ఇలాంటి ఘటనలు గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ చోటు చేసుకోలేదు. పేదవాళ్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లేలా చేసేందుకు కావాలనే ప్రభుత్వాస్పత్రుల్లోకి ఎలుకలను పంపుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నుంచి తప్పించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, స్కూళ్లను మూసేయిస్తూ ప్రైవేట్‌ రంగానికి మేలు చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు. 

పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా నారాయణ, చైతన్య వంటి స్కూళ్లు విస్తరిస్తున్నాయి. ఎల్‌కేజీ చదవాలంటే ఏడాదికి రూ.25 వేలు కట్టాల్సిన పరిస్థితి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసే విధంగా కమిషన్‌ను తీసుకొస్తాం. ఆ కమిషన్‌ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం. 
అధికారంలోకి రాకముందు మీ ఫీజులు ఇవి, అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గించిన ఫీజులు ఇవి అని అందరికీ చూపిస్తాం. స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పించేలా నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌ ద్వారా నేనే సమీక్షిస్తాను.  

గండికోట నిర్వాసితులకు రూ.10 లక్షలు  
జమ్మలమడుగు సభలో..
దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలనే ఉద్దేశంతో దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టరీ నెలకొల్పారు. బ్రహ్మణి స్టీల్స్‌ సంస్థకు శ్రీకారం చుట్టారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాం. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం. గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ చెల్లిస్తాం. శనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,500గా నిర్ణయిస్తాం. రైతుల వద్దనున్న పంటంతా కొనుగోలు చేస్తాం.  

బాధితులకు ఏం సందేశం ఇస్తున్నారు?..:  ఈ ప్రాంతంలో కేశవరెడ్డి స్కూల్‌ బాధితులు ఎక్కువగా ఉన్నారు. చదువుల పేరు చెప్పి రూ.లక్షల్లో డిపాజిట్లు వసూలు చేసి, తల్లిదండ్రులకు ఎగనామం పెట్టారు. ఐదేళ్ల పాలనలో కేశవరెడ్డి బాధితులకు చంద్రబాబు న్యాయం చేయలేదు. అదే కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకుని, మంత్రిని కూడా చేశారు. దీనిద్వారా బాధితులకు చంద్రబాబు ఏం సందేశం ఇస్తున్నారు? ఇదే నియోజకవర్గంలో 2008లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజోలి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. నాన్నగారు చనిపోయాక ఈ రిజర్వాయర్‌ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పాలకులు వారి స్వార్థం కోసం మినహా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేశారా?  

ఆ ఇద్దరి వల్లే గ్రామాల్లో ఫ్యాక్షన్‌ ..: జమ్మలమడుగులో టీడీపీకి ఒక కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీకి మరో కుటుంబం అండగా నిలిచింది. ఆ రెండు కుటుంబాలు చెరో పార్టీలో ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలు కారణంగానే ప్రతి గ్రామానికి ఫ్యాక్షన్‌ వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరూ ఏకమయ్యారు. నాకు అలాంటి నాయకులు అండగా లేరు. నాన్న ఇచ్చిన కుటుంబం నాకు తోడుగా ఉంది. నాకు ప్రజలందరి అండ కావాలి. మిమ్మల్ని నమ్ముకొని ఎన్నికలకు వెళ్తున్నా.   

దోషులకు చంద్రబాబు రక్షణ   
విజయవాడ సభలో..
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు విజయవాడలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. విజయవాడలో కాల్‌మనీ–సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో టీడీపీ నేతలు ఆడవాళ్లకు అప్పులిచ్చి, అప్పు కట్టలేని మహిళల మానాలతో ఆడుకున్నారు. ఆ దోషులను చంద్రబాబు తప్పించాడు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న కేశినేని నాని ట్రావెల్స్‌పై కేసులు పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి చొక్కా పట్టుకున్నారు. ఆ ఎమ్మెల్యే, ఎంపీని అరెస్ట్‌ చేయలేదు. ఎలాంటి శిక్ష వేయలేదు. మొన్నటికి మొన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ను ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు బెదిరించాడు. స్వాతంత్య్ర సమరయోధుల స్థలాలను కొట్టేశాడు. టూరిజం పేరిట లైసెన్స్‌లు లేని బోటు బోల్తాపడి 23 మంది చనిపోతే అందుకు కారణమైన మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారా? దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయి. ఇంతకంటే అన్యాయం దేశ, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు.  

మాయాబజార్‌ సినిమా చూపిస్తున్నాడు..: రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలకు, దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పేరుతో విజయవాడ ప్రజలకు చంద్రబాబు మాయాబజార్‌ సినిమా చూపిస్తున్నాడు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక బిల్డింగ్‌లు ఏర్పాటు చేశారు. శాశ్వత నిర్మాణాలకు ఇంతవరకు ఒక్క ఇటుక కూడా వేయలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు కట్టించలేదు. గుణదల వంతెన, గుణదల ఫ్లై ఓవర్, రాజీవ్‌నగర్, శాంతినగర్‌ వంటి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నా పట్టించుకోలేదు. ఈ నగరంలో వీధికో మద్యం దుకాణం కనిపిస్తోంది. నగరంలో 300 మద్యం దుకాణాలు ఉన్నాయంటే చంద్రబాబు ఏ స్థాయిలో ప్రజలతో తాగిస్తున్నాడో ఆలోచించాలి. విజయవాడలో కొండలపై ఉన్న ఇళ్లను రెగ్యులరైజ్‌ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఎంతమందికి రెగ్యులరైజ్‌ చేశాడు? భవానీపురం స్టేడియం నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఉర్దూ జూనియర్‌ కళాశాలను డిగ్రీ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేస్తానని చెప్పి మనందరికి డ్రామాలు చూపించారే కానీ ఎక్కడా జరగలేదు.  
 
25 ఎంపీ సీట్లు ఇవ్వండి.. హోదా తెచ్చుకుందాం..: రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతు తెలుపుతాం. మన 25 మంది ఎంపీలకు, తెలంగాణలోని 17 మంది ఎంపీలు కూడా తోడై మొత్తం 42 మంది ఎంపీలు ఒక్క తాటిపైకి వచ్చి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న దిగి రావాల్సిందే. ప్రధానమంత్రిగా ఎవరున్నా సరే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ సంతకం పెట్టి తీరాల్సిందే. 

ఐదేళ్ల కాలంలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ కట్టలేకపోయారు. రాజధాని ఎక్కడా? అని అడిగితే బాహుబలి సినిమా చూపిస్తున్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క పనీ చేయలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకు బందర్‌ రోడ్డు, ఏలూరు రోడ్డుకు మాత్రమే పెయింటింగ్‌ల మీద పెయింటింగ్‌లు వేస్తున్నారు. ఇది తప్ప విజయవాడలో చంద్రబాబు చేసిందేమిటి? 

జగన్‌ హామీలు  
- ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసే విధంగా కమిషన్‌ను తీసుకొస్తాం. ఆ కమిషన్‌ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం.  
- ఫీజులు తగ్గించడమే కాదు.. స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పించే విధంగా నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌ ద్వారా నేనే సమీక్షిస్తా.  
- నెలకు రూ.40 వేల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000  దాటితే చాలు వాళ్లందరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తాం.  
- పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం.  
- ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. 
- ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందజేస్తాం.  
- మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.. ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం. 
- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద 4 దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం.  
- పంటల సాగుకు పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్నకు రూ.12,500 అందజేస్తాం. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాం.  
- రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాం.  
- అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుతాం.   
- ఇల్లు లేని పేదల కోసం అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం.  
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పోస్టుల భర్తీకి ప్రతిఏటా జనవరి 1న క్యాలెండర్‌ విడుదల చేస్తాం.  
- ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తాం.  
- గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం.  
- ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, నెలకు రూ.5 వేలు వేతనం ఇస్తాం.   
- ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు అందజేస్తాం. వడ్డీ లేని రుణం రూ.10 వేలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాం.  
- జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ మూడేళ్ల పాటు ఇస్తాం. వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.   
- సొంత ఆటో, సొంత ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం.  
- చిన్నచిన్న దుకాణాలు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు, రజకులకు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు అందజేస్తాం.  
- అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు తెలంగాణలో కంటే రూ.1,000 ఎక్కువ జీతం చెల్లిస్తాం.  
- ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం.  
- సంఘమిత్ర, వీవోఏలు, వెలుగు యానిమేటర్లకు జీతం రూ.10 వేలు ఇస్తాం.  
- మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తాం.  
- ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తాం. వాహనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ వచ్చేలా చేస్తాం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం.  
- ప్రభుత్వం ఇచ్చే ఫ్లాట్లకు గాను పేదలు తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణాన్ని మాఫీ చేస్తాం.  
- తొలి బడ్జెట్‌లోనే రూ.1,100 కోట్లు కేటాయించి 13 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం.   
- మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకం ఇస్తాం.   

మరిన్ని వార్తలు