‘కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్‌ ఇస్తాం’

31 Dec, 2018 17:52 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకోని.. వారిలో భరోసా నింపడానికి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంక్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. సోమవారం జననేత పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడ వైఎస్‌ జగన్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ముగ్గురు, నలుగురు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారుంటే ఇంటికి ఒక్కరికి మాత్రమే డయాలసిస్‌ చేస్తున్నారని వారు వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ప్రభుత్వం తమకు ఎలాంటి పెన్షన్‌ ఇవ్వడం లేదని వాపోయారు. ఆస్పత్రికి వెళ్తే మందులు కూడా లేవంటున్నారని చెప్పారు. ఉయాలసిస్‌ యంత్రాలు సరిపోక రోజుల తరబడి పడిగాపులు కాయల్సి వస్తుందని అన్నారు. కిడ్నీ వ్యాధితో వందల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు.

కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కాగా, జననేత హామీలపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు