ప్రజాసంకల్పయాత్ర : తునిలో జనతరంగం

11 Aug, 2018 17:51 IST|Sakshi

సాక్షి, తుని: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర  234వ రోజు శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చేరుకుంది. ఇక్కడ అడుగుపెట్టగానే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర  2700 కిలోమీటర్ల మైలురాయిని దాటడం విశేషం. జననేతకు తుని ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

తునిలో అడుగు పెట్టిన జననేత వైఎస్‌ జగన్‌కు ప్రజలు, పార్టీనేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. పూల దండలతో ఎదురేగి రాజన్న తనయుడిని ఆహ్వానించారు. తమ బాధలను జననేత జగన్‌తో చెప్పుకోవడానికి వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పెద్దఎత్తున తరలివచ్చిన జనంతో రోడ్లన్ని కిక్కిరిశాయి. రాజన్న తనయుడిని చూసేందుకు వేలాది అభిమానులు భవనాలపైకి చేరుకున్నారు. రహదారుల వెంట ఎటుచూసినా జనమే కనిపించారు. దీంతో తుని పట్టణం జనసాగరాన్ని తలపించింది.

వైఎస్‌ జగన్‌ తన ప్రసంగంలో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల గురించి వివరించినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చంద్రబాబు మోసాలు, కుట్రలను బట్టబయలు చేయడంతో జగన్‌ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు.

మరిన్ని వార్తలు