నాన్న ఇచ్చిన కుటుంబం అండగా ఉంది: వైఎస్‌ జగన్‌

5 Apr, 2019 15:08 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు(కడప) : ‘జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఒకే కుటుంబం.. కాంగ్రెస్‌ నుంచి ఒకే కుటుంబం ఉండేది. వీరిద్దరు కూడా ఒకరినొకరు పొడుచుకున్నారు.. చంపుకున్నారు. వీరిద్దరి వల్ల ప్రతి గ్రామంలో కక్ష్యలు వచ్చాయి. ఈ ఇద్దరు ఇప్పుడు వారి స్వార్థ రాజకీయాల కోసం ఒక్కటయ్యారు. ఇలాంటి పెద్దపెద్ద నాయకులు నాకు తోడుగా లేరు. కానీ నాకు అండగా ఉంది నాన్న ఇచ్చిన కుటుంబమే.’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌ను తెరుస్తామని, చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు రూ. 24వేలు ఇస్తామని, శనగ రైతులకు గిట్టుబాటు ధరల కల్పిస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్‌, కేశవరెడ్డి బాధితలను ఆదుకుంటామన్నారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.సుధీర్‌రెడ్డి‌‌‌, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

మీ కడప బిడ్డగా ...
‘జమ్మలమడుగు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్‌గా చిన్నాన వైఎస్‌ వివేకానందరెడ్డి ఇక్కడ ఉండాల్సింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమంతా మౌనం పాటిద్దాం. మీ కడప బిడ్డగా రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. ప్రభుత్వ సాయం అందక ఇబ్బంది పడుతున్నా.. ప్రతి పేదవాడికి చెబుతున్నా.. మీ అందరికీ నేనన్నానే భరోసా ఇస్తున్నా. గిట్టుబాటు ధరలేక రైతులు పడ్డ కష్టాలు చూశాను. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నేను విన్నాను. సకాలంలో 108 రాక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆవేదన విన్నా.. పక్షపాతం వచ్చి ఆరోగ్య శ్రీ అందక వీల్‌చైర్‌లో వచ్చి నాతో చెప్పుకున్న బాధితుల పరిస్థితిని ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలను చదివించడం కోసం కూలీ పనులకు వెళ్తున్న అక్కాచెల్లెమ్మల బాధలు విన్నా. మద్యం షాపులు ఎక్కవై చిన్నాభిన్నమైన కుటుంబాలను చూశాను. ఉద్యోగాలు రాక తల్లడల్లితున్న విద్యార్థులను చూశాను. కడప స్టీల్‌ కోసం ఎదురు చూస్తున్న పిల్లలను చూశాను. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ అయ్యే పరిస్థితులు లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్న యువతను చూశాను. నాన్నగారు.. దివంగత మహానే వైఎస్సార్‌ చేసిన మంచి పనుల గురించి మీరు చెప్పిన మాటలను విన్నాను. పరిశ్రమలు కావాలని, ఉద్యోగాలు రావాలని నాన్నగారు. బ్రాహ్మణి స్టీల్‌ను తీసుకొచ్చారు. కానీ ఆ స్టీల్‌ కూడా ఇప్పుడు పూర్తిగా మూతబడింది. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాను.. 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అని హామీ ఇస్తున్నాను.

శనగ పంటకు మద్దతు ధర..
ఇక్కడ శనగ పంట సాగు ఎక్కువ. గత మూడేళ్లుగా దాని రేటంతా అని అడుగుతున్నా? గిట్టుబాటు ధర వచ్చిందా? శనగకు కనీస మద్దతు ధర రూ.5,200 అంటారు. కానీ రైతన్న దగ్గర రూ.4వేలకు కూడా కొనేపరిస్థితి లేదు. గోడౌన్‌లో పంట కుల్లిపోతుంటే.. వడ్డీలు కట్టలేక ఇంట్లోని బంగారు తాకట్టుపెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. శనగను సాగుచేసే ప్రతిరైతన్నకు చెబుతున్నా.. అధికారంలోకి రాగానే గోడౌన్‌లో ఉన్న మొత్తం శనగపంటను రూ. 6500 ఇచ్చి కొనుగోలు చేస్తాను. ఇబ్బంది పడుతున్న రైతన్నలకు అండగా ఉంటాను. పొతిరెడ్డి పాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకురావడానికి వైఎస్సార్‌ గండికోట ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే ఈ ప్రాజెక్ట్‌ పనులు 85 శాతం పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు పాలనలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ పనులను అంచనా మాత్రం 100 శాతం పెంచారు. నామినేషన్‌ పద్దతిలో చంద్రబాబు బినామీ సీఎం రమేశ్‌కు ఇస్తారు. ఆ గండికోట ముంపు గ్రామాలకు ముష్టివేసినట్లు నష్టపరిహారం ఇస్తున్నారు. ఆ గండికోట బాధితులకు చెబుతున్నా.. అధికారంలోకి రాగానే రూ.10 లక్షలు నష్టపరిహారంగా ఇస్తానని హామీ ఇస్తున్నాను. 

ఐదేళ్లుగా మైలవరం రిజర్వాయర్‌కు నీరురాని పరిస్థితి ఉంది. మనపార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి మంత్రి కూడా అయ్యారు. ఆ రాజోలు రిజర్వాయర్‌ పనులు జరిగాయా? చంద్రబాబుకు ఏ రోజు ప్రజలపై ప్రేమ లేదు. ఐదేళ్లు ఏం చేయని ఆయన ఎలక్షన్‌ ముందు వచ్చి టెంకాయ కొట్టి పోతారు. చేనేత కార్మికులు కూడా ఇక్కడ ఎక్కువే. ఈ ఐదేళ్లలో ఆ చేనేత కార్మికులు సంతోషంగా ఉన్నారా? నూలు సబ్సిడీ రావడం లేదు. గత ఎన్నికల వేళ.. చేనేతలకు మేనిఫెస్టోలో ఒక పేజీ కేటాయించారు. చేనేతల రుణమాఫీ అన్నాడు.. అయ్యాయా? ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా? ప్రతి చేనేత కార్మీకుడికి చెబుతన్నా.. అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలతోనే కాకుండా ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఇస్తాం. అగ్రిగోల్డ్‌ బాధితులను అడుగుతున్నాను. కనీసం ఒక్కరూపాయి అయినా ఇచ్చారా? అగ్రిగోల్డ్‌ ఆస్తులను చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులు, బినామీలు గద్దల్లా తీసుకోవాలని చూస్తున్నారు. రూ.1150 కోట్లను తొలి బడ్జెట్‌లో పెడ్తాం. మిగిలిన వారికి అగ్రిగోల్డ్‌ ఆస్థులను అమ్మి ఇస్తాం. ఈ నియోజకవర్గంలో కేశవరెడ్డి బాధితులు ఎక్కువే...బాధితులకు న్యాయం చేయకపోగా కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు.

మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ 9 అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి.  ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు