ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం: వైఎస్‌ జగన్‌

30 Mar, 2019 16:44 IST|Sakshi

ఆర్టీసీ కార్మీకులకు జగన్‌ వరాల జల్లు

చంద్రబాబు పాలనలో అంతా మోసమే

ఓటు అడిగే ధైర్యం లేక.. ఢిల్లీ నాయకులను తెచ్చుకుంటున్నారు

మడకశిర ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి, మడకశిర (అనంతపురం జిల్లా) : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబుకు ఐదేళ్ల తన పాలనపై ఓటు అడిగే ధైర్యం లేక ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో మోసం తప్ప ఏం జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసే అబద్దపు వాగ్ధానాలకు మోసపోవద్దని కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలను బీసీలకే కేటాయించామన్నారు. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.తిప్పేస్వామి, హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

20 శాతం పనులు కూడా..
మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ కోసం.. రూ.250 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులను ఆ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు కూడా చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పూర్తి చేయలేదు. మడకశిరలో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని ధర్నాలు చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. పరిశ్రమలు పెట్టిస్తానన్నారు. ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? డిగ్రీ కాలేజీలు కట్టించాడా? మడకశిరలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేస్తానన్నాడు. చేశాడా? ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తానన్నాడు. నిర్మించాడా? ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు.

ఐదేళ్ల పాలనలో ఏం జరిగిందంటే..
చంద్రబాబు పాలనలో ఏం జరిగిందంటే.. రైతుల అప్పులు రూ. లక్ష 50 వేలకు పైగా రెట్టింపయ్యాయి. రైతులకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ పథకం కనుమరుగైంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాలేదు. పెంచిన కరెంట్‌, రాయాల్టీ చార్జీలకు పరిశ్రమలు మూతపడ్డాయి. చంద్రబాబు హయాంలో నిరుద్యోగం పెరిగింది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ బాబు వచ్చారు ఉన్న ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగభృతి పేరిట ప్రతి ఇంటికి రూ.లక్ష ఇరవై వేలు ఎగ్గొట్టాడు. పొదపు సంఘాలు బలహీనమయ్యాయి. డ్రాక్రా మహిళల రుణాలు రూ. 26వేల కోట్లకు రెట్టింపయ్యాయి. అక్కా చెల్లమ్మల సున్నా వడ్డీ పథకం కూడా లేకుండా పోయింది. మహిళల భద్రతకు రక్షణ లేకుండా పోయింది. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్తే చంద్రబాబు ఏ చర్యలు తీసుకోలేదు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌తో మహిళలను వేధించిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతన్నలకు పంట దిగుబడి తగ్గింది. ఎస్టీ,ఎస్సీల భూములను లాక్కున్నారు. బీసీ పిల్లలు చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. బెల్ట్‌షాపులు విపరీతమయ్యాయి. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కాస్త.. నారా వారి సారా స్రవంతి అయింది. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో మాఫీయాను ఏర్పాటు చేశారు. ఏదీ కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. 108 ఫోన్‌ చేస్తే రాని పరిస్థితి.

యుద్దం ఒక్క చంద్రబాబుతోనే కాదు..
యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే సింగపూర్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇస్తారు. కానీ పేదవాడి గుండెనొప్పి వస్తే పక్కరాష్ట్రంలో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ రాదంటారు. బాబు పాలనలో చార్జీలు బాదుడే బాదుడు. అమరావతి పేరు పెట్టి.. అమరేశ్వరుడి భూములు కొల్లగొట్టేశారు. అదిగో రాజధాని అంటూ బాహుబలి సినిమా చూపించారు. రాజధాని పేరిట చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. రైతన్నలకు గిట్టుబాటు ధరల కోసం రూ.5వేల కోట్ల స్థిరికరణ నిధి పెడుతానన్నారు.. అది పెట్టలేదు కానీ లోకేశ్‌ స్థిరికరణల నిధి పెట్టుకున్నారు. ప్రజలను చూసి ఓటు అడగటానికి దమ్ములేదు.. దీంతో ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు. ప్రతి కులాన్ని మోసం చేశారు. 2014 మేనిఫెస్టోను మాయం చేశారు. ఈ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం తప్పా ఏం చూడలేదు. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు రోజుకో సినిమా చూపిస్తారు. ఈ కుట్రలన్నీ గమనించి అప్రమత్తంగా ఉండండి. మన యుద్దం ఒక చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన అన్నీ చానళ్లతో చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. 

20 రోజులు ఓపిక పట్టమని చెప్పండి..
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలవండి. నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. పిల్లల చదువులకు ఎంత ఖర్చు అయినా ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద అన్నే ఉచితంగా చదివిస్తాడని చెప్పండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

మరిన్ని వార్తలు