అండగా ఉంటా

30 Mar, 2019 13:13 IST|Sakshi
నగరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌కే రోజాను పరిచయం చేస్తున్న జగన్‌

నగరి ప్రజలకు వైఎస్‌ జగన్‌ భరోసా

జనసంద్రమైన  పుత్తూరు

రోడ్‌ షో సూపర్‌ సక్సెస్‌

‘మీ అండదండలతోనే సుదీర్ఘ పాదయాత్ర చేశా. నేను వెళ్తున్న దారిపొడవునా ఎంతో మందిని కలిశా. వారి సాధకబాధకాలు విన్నా. ఈ ఐదేళ్ల పాలనలో వారు పడుతున్న ఇబ్బందులు చూశా. జన్మభూమి కమిటీల పేరుతో పేదలను హింసించిన తీరును చూశా. సంక్షేమ పథకాలకు దూరమైన అభాగ్యులను చూశా. చదువులకు దూరమైన పేద పిల్లలను చూశా. వారి కష్టాలు విన్నా. మీకందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని చెబుతున్నా. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. మీ కన్నీళ్లు తుడిచే అన్నగా ఉంటా..’ అని విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం నగరి నియోజకవర్గం పుత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

పుత్తూరు: పుత్తూరు జనసంద్రమైంది. జనహృదయ నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాకతో పుత్తూరు వీధులు పోటెత్తాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుత్తూరుకు వచ్చారు. పట్టణంలోని కేఎన్‌ రోడ్డు మండపం వద్ద ఏర్పాటు చేసిన బస్సు నుంచి ప్రసంగించారు. ఐదేళ్లలో సీఎం చంద్రబాబు అసమర్థపాలన, అవినీతి, దౌర్జన్యాలు, హత్యలపై ఆయన చేసిన ప్రసంగానికి అనూహ్య స్పందన వచ్చింది. చేనేత కార్మికుల కష్టాలను గుర్తు చేస్తూ, అధికార పార్టీ నాయకులకు చెందిన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌ పరిశ్రమల వల్ల మామిడి రైతులు మోసపోతున్న వైనాన్ని వివరించారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి, షుగర్‌ ఫ్యాక్టరీల మూసివేతకు కారణమైన చంద్రబాబు దమననీతిని ఎండగట్టారు.

హెరిటేజ్‌ డెయిరీ కోసం పాడిరైతుల కడుపుకొడుతున్న సీఎం చంద్రబాబు నీచబుద్ధిని ఎండగట్టారు. జిల్లాలోని తూర్పు ప్రాంతాల జీవనాడి గాలేరు–నగరి సుజల–స్రవంతి ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఇందుకు సీఎం విధానాలే కారణం అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలను దుర్వినియోగం చేసిన చంద్రబాబు సర్కార్‌ తీరును తూర్పారబట్టారు. సర్కార్‌ హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీల దాష్టీకాలతో అర్హులైన పేదలకు అన్యాయం చేశారన్నారు. ఐదేళ్ల పాలనలో పెరిగిన ఇంటి పన్నులు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ చార్జీలు, పెట్రోల్, డీజిల్‌ ధరల బాదుడుపై ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి వీలుగా పేదలకు నవరత్న పథకాలతో న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ ఎలా అండగా ఉంటానో భరోసా ఇస్తూ.. చంద్రబాబునాయుడు ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ.. మరో సారి చంద్రబాబునాయుడు చేతిలో మోసపోవద్దని గణాంకాలతో సహా వివరిస్తూ సుమారు గంట సేపు పైగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఆద్యం తం ప్రజలను ఆకట్టుకుంది. ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రజ లు కేరింతలు కొట్టారు. ఈ సభ పుత్తూరు చరిత్రలో నిలిచిపోతుందనే మాటలు వినబడ్డాయి. రోడ్‌ షో సూపర్‌ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. పుత్తూ రు జన సమ్మోహనమైంది.

మరిన్ని వార్తలు