‘ఆపరేషన్‌ గరుడ’పై విచారణ కోరరెందుకు?

21 Nov, 2018 04:33 IST|Sakshi
విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఒక భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సూటి ప్రశ్న

విచారణ కోసం రాష్ట్రపతిని ఎందుకు అడగరు? 

సుప్రీంకోర్టులో విచారణ కోసం కేసెందుకు వేయరు? 

విచారణ జరిగితే మీ పేరే బయటకు వస్తుందని భయమా? 

నాలుగున్నరేళ్లుగా అబద్ధాలు, మోసం, అవినీతి, దోపిడీ 

వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త డ్రామాలు 

జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యలపై పోరాటమట 

ఉచిత కరెంటు అని చెప్పి రైతులకు భారీగా బిల్లులు 

చంద్రబాబు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి.. 

మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం

చంద్రబాబు దొంగతనాలు, దోపిడీలు, అరాచకాల మీద విచారణ చేయాల్సిందిగా రేపు హైకోర్టు ఆదేశిస్తే, మన రాష్ట్రానికి హైకోర్టే అక్కరలేదని ఆయన అనగలుగుతారు. రేపు బాబు అక్రమాస్తుల మీద విచారణ చేయాని సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే.. ఏపీ వ్యవహారాలు సుప్రీం పరిధిలోకి రావని ఏకంగా జీవోనే ఇచ్చేస్తాడు.

రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా..చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో ఉండటం లేదు. ఏ టీవీ చూసినా, పత్రిక తెరచినా కనిపించేదేమిటంటే.. ఒక రోజు చంద్రబాబు కర్ణాటకలో కుమారస్వామితో కలిసి కాఫీ తాగుతుంటాడు. ఇంకో రోజు తమిళనాడులో స్టాలిన్‌తో కలిసి సాంబార్‌ ఇడ్లీ తింటుంటాడు. మరో రోజు బెంగాల్‌లో మమతా బెనర్జీతో కలిసి టిఫిన్‌ చేస్తుంటాడు. ఇలా జాతీయ,
అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యలను పరిష్కరిస్తారట.

అగ్రిగోల్డ్‌ బాధితుల పరిస్థితి నిజంగా అరణ్య రోదనే అయింది. వాళ్లకు మేలు చేయాల్సింది పోయి ఆ అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఎలా కొట్టేయాలా అని చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచన
చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకునే విధంగా ఉంది.

– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘ఆపరేషన్‌ గరుడ’ అనే పేరుతో ఢిల్లీ పెద్దల ప్రమేయంతో తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని టీవీల్లో మోత మోగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి దీనిపై విచారణ జరిపించాల్సిందిగా భారత రాష్ట్రపతిని ఎందుకు కోరరు? విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో కేసెందుకు వేయరు?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు రాష్ట్రంలో మోసపూరిత, దోపిడీ పాలన సాగించారని మండిపడ్డారు. ఒక్క మంచి పని కూడా చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జాతీయ,, అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యలపైనా పోరాటం చేస్తానని డ్రామా లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 302వ రోజు మంగళవారం ఆయన  విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

 ఐటీ శాఖ సోదాలు చేయకూడదట.. 
‘మీరంతా చంద్రబాబు డ్రామాలు చూస్తున్నారు. ఆపరేషన్‌ గరుడ పక్షి.. అని ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు. ఆపరేషన్‌ గరుడ అని చంద్రబాబు గారు యాగీ చేస్తున్నారు. టీవీలల్లో విపరీతంగా మోగించిన విషయం మనమంతా చూశాం. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్ర జరగబోతోందని, దాన్ని ఢిల్లీ పెద్దలు నడిపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఢిల్లీకి పోయినపుడు ఇదే విషయం మీద విచారణ జరిపించాల్సిందిగా భారత రాష్ట్రపతిని ఎందుకు కోరలేదు? ఈ మధ్య కాలంలో చంద్రబాబు సీబీఐని నానా రకాలుగా యాగీ చేశాడు. మోదీ అంటూ ఒంటికాలిపై ఎగురుతూ నానా యాగీ చేస్తున్నాడు. ఇలా రోజుకో రకంగా యాగీ చేయడం మనకు పత్రికల్లో కనిపిస్తోంది. రాష్ట్ర సమస్యల గురించి మాత్రం చంద్రబాబు పట్టించుకోడు. జాతీయ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు, ఇంకా అంతరిక్ష సమస్యలను కూడా చంద్రబాబు పట్టించుకుంటాడట. కానీ రాష్ట్రంలో ప్రజలు ఎటు పోతున్నా, ఏమై పోతున్నా కూడా పట్టించుకోడు. ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఎవరైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ నాలుగున్నరేళ్లలో లేదా ఈ ఐదేళ్లలో ఈ మంచి చేశాను.. నేను చేసిన మంచిని చూసి ఓటేయండని ప్రజలను అడగాలి. కానీ చంద్రబాబు రాష్ట్రంలో మోసపూరిత, అన్యాయ, అబద్ధాల, అవినీతి పాలన సాగిస్తున్నాడు. ఇలాంటి పాలన సాగిస్తున్నాడు కాబట్టే ప్రజల కళ్లు గప్పి, మభ్య పెట్టి, వారిని మైమరిపింప జేసి వారి దృష్టి మళ్లించేందుకు ఇవాళ జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యలపై పోరాటమంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. 

ధాన్యానికి మద్దతు ధర ఏదీ? 
పాదయాత్ర చేస్తున్నప్పడు ఇక్కడి ప్రజలు నాతో అంటున్న మాటలివి. అన్నా ఇదే నియోజకవర్గంలో 35,845 ఇళ్లు కట్టించిన చరిత్ర ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారిదని చెబుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం ఊరికి ఐదారు ఇళ్లు కూడా ఇవ్వని పరిస్థితి. ఇలా నక్కకు నాగలోకానికి ఉన్న తేడాను చూపిస్తుంటే నిజంగా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. దారిలో వరి కోస్తున్న రైతన్నలు కలిశారు. అన్నా.. ఈ ఏడాది వర్షాభావం కారణంగా ఒకవైపు దిగుబడులు రాలేదని బాధ పడుతుంటే మరోవైపు మద్దతు ధర కరువైందని చెప్పారు. మద్దతు ధర క్వింటాలుకు రూ.1,750 అని చెబుతున్నారు కానీ, మా వద్ద రూ.1,050, రూ.1,100 కే కొంటున్నారన్నా అని రైతన్నలు చెబుతున్నారు. పంటంతా దళారుల పాలయ్యాక తీరుబడిగా చంద్రబాబు  కొనుగోలు కేంద్రాలు తెరుస్తాడన్నా.. అప్పుడు దళారులకే మేలు జరుగుతుంది కదా? అని చెప్పకొచ్చారు.

సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబే తన హెరిటేజ్‌ షాపుల కోసం దళారీగా మారితే రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది? రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని ప్యాక్‌ చేసి మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి హెరిటేజ్‌ షాపుల్లో కన్పిస్తుంది. నా దగ్గరకు కొంత మంది రైతన్నలు వచ్చి కరెంటు బిల్లులు ఇచ్చారు. ఈ బిల్లు ఇచ్చింది రెడ్ది రామలక్ష్మి అనే ఆవిడ. ఈమెది రామనాయుడువలస గ్రామం. ఆమె అన్న మాటేమిటంటే అన్నా.. రైతులకు ఉచితంగా కరెంటు అంటారు. మరి నెల నెలా నాకు రూ.300 బిల్లు ఎందుకేస్తున్నారన్నా అంది. ఇదే మాదిరిగా వెంకటరాజపురానికి చెందిన ఇంకో రైతు బడే కన్నమనాయుడు. ఆయనకు ఏకంగా రూ.1,945 బిల్లు వేశారు. ఒకవైపు ఉచిత కరెంటు అంటూనే.. మరోవైపు వేర్వేరు కారణాలు చెప్పి నెల నెలా రూ.300, రూ.400 గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజుల్లో దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ఎన్నికలప్పుడు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు వెకిలి నవ్వులు నవ్వాడు. కరెంటు తీగలు చూపిస్తూ.. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని అవహేళన చేశారు ఆ రోజుల్లో. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి గారు ఇచ్చిన మాట నిలుపుకుని రైతులకు మేలు చేశారు. ఇవాళ చంద్రబాబు 9 గంటల కరెంటు ఎలాగు ఇవ్వడం లేదు.  ఇచ్చే కరెంటుకు రకరకాల పేర్లతో బిల్లులు లాగుతున్నారు. ఇలాంటి అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా?   

అధ్వానమైన పాలన 
అన్నా.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తోటపల్లి ప్రాజెక్టు గుర్తుకు రాలేదన్నా.. అని రైతులు చెప్పారు. 2004 ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబుకు తోటపల్లి గుర్తుకు వచ్చింది. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు వచ్చి టెంకాయ కొట్టి ఆ తర్వాత పట్టించుకోలేదని రైతులు చెప్పారు. ఆ తర్వాత నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు పనులను పరిగెత్తించారని రైతన్నలు చెప్పారు. నాన్నగారి హయాంలోనే ఈ ప్రాజెక్టు దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసుకుంది. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యాక ఆ మిగిలిపోయిన పది శాతం పనులు కూడా నత్తనడకగా సాగుతున్న పరిస్థితి. ఇదే నియోజకర్గంలోని జియమ్మవలస, గరుకుమిల్లి మండలాల్లో ఎడమ కాలువ కింద 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువను ఆధునీకరించకపోవడం వల్ల కేవలం 5 వేల ఎకరాలకు  కూడా నీరు సరిగా అందడం లేదని రైతులు వాపోతున్నారు. దాసంగి వద్ద లిఫ్ట్‌ పెడితే 20 గ్రామాలకు నీరందుతుందని, అప్పట్లో డిజైన్‌లో ఉన్న లిప్ట్‌ ఇప్పుడు ప్రాజెక్టులో కన్పించడంలేదని చెప్పారు. లిఫ్ట్‌ పెట్టకపోవడంతో ఇవాళ తోటపల్లి ప్రాజెక్టు పక్కనే ఉన్నా, తమ గ్రామాలకు నీరు రాక వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉందన్నా అని రైతన్నలు బాధపడుతున్నారు.

వట్టిగడ్డ రిజర్వాయర్‌ ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 10 వేల ఎకరాలకు కూడా సాగు నీరు సరిగా అందని పరిస్థితి. కనీసం కాలువల్లో పూడిక కూడా తీయరు. పక్కనే జంఝావతి ప్రాజెక్టు కన్పిస్తుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఒడిశాతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్టుకు గేట్లు పెడితే నీటిని పూర్తిగా నిల్వ చేసుకోవచ్చు. దీని వల్ల గరుగుబిల్లి మండలంతో సహా అనేక ప్రాంతాలకు నీరు వస్తుందని తెలిసి కూడా పట్టించుకోని పరిస్థితి. అప్పట్లో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి రబ్బరు డ్యామ్‌ కట్టి ఏడు వేల ఎకరాలకు నీరు అందిస్తే ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ప్రాజెక్టు ముందుకు కదలని పరిస్థితి. కురుపాం మండలంలో గుమ్మిడిగడ్డపై మినీ రిజర్వాయర్‌ కడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎక్కడైనా కన్పించిందా? నాగవళి నదిపై పూర్ణపాడు – లాబేసు మధ్య చిన్న వంతెన కూడా నిర్మించలేని ఆధ్వానమైన పాలన సాగిస్తున్నారంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. కురుపాం నియోజకవర్గంలో సామాజిక ఆసుపత్రులు (కమ్యూనిటి హాస్పిటల్స్‌) మూడు ఉన్నాయి. ఒక్కో చోట ఎనిమిదేసి మంది డాక్టర్లు ఉండాలి. భద్రగిరి, చినమిరంగిలో ఒక్కొక్కరు, కురుపాంలో నలుగురు డాక్టర్లు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందా?  
 
ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి 
ఈ పెద్దమనిషి చేసిన మోసానికి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. రుణ మాఫీ జరగక డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కోర్టు నోటీసులు వస్తున్నాయి. రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు. కొత్త అప్పులు ఇవ్వడం లేదు. చదువుకున్న వారికి ఇవాళ ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతీ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంతకన్నా లేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు చూస్తే పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు.. ఇసుక, మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, మద్యం, రాజధాని భూములు, విశాఖపట్టణం భూములు చివరికి గుడి భూములు, దళితుల భూములు.. ఇలా వేటినీ వదలకుండా అవినీతికి పాల్పడుతూ దోచేస్తున్న పరిస్థితి. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు, ఆర్టీసీ బస్సు చార్జీలు, ఇంటి పన్నులు, స్కూలు, కాలేజీ ఫీజులు.. అన్నింటా బాదుడే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పాతరేశారు. ఆరోగ్యశ్రీ చూస్తే పూర్తిగా పడకేసింది. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ఇంటి స్థలాలు ఇవ్వరు.. ఇళ్లు కట్టివ్వరు. వీధి వీధినా బెల్టు షాపులే. గ్రామ గ్రామాన చంద్రబాబు.. జన్మభూమి కమిటీల పేరుతో ఒక మాఫియాను తయారు చేశాడు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలన పూర్తయింది. మార్చికల్లా ఎన్నికల షెడ్యూలు వస్తుంది. ఇక మూడు నెలలే మిగిలి ఉంది. ఈ తరుణంలో మీకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

కుమారస్వామితో కాఫీ.. స్టాలిన్‌తో సాంబార్‌ ఇడ్లీ.. మమతతో టిఫిన్‌.. 
తన నాలుగున్నరేళ్ల పాలనలో నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయించుకోలేక పోయాడు. అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు నిత్యం అబద్ధాలాడుతూ డ్రామాలు చేస్తున్నాడు. ఇవాళ మీ అందరి తరఫున ఈ పెద్దమనిషి చంద్రబాబును ఒక ప్రశ్న అడుగుతున్నా. ఖరీఫ్‌ పంటలు వేసే సమయం జూన్‌ 1వ తేదీ నుంచి నవంబర్‌ 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో వర్షపాతం ఏ మేరకు నమోదైందో ఓసారి లెక్కలు చూద్దాం. రాయలసీమలో మైనస్‌ 50.4 శాతం లోటు ఏర్పడింది. అక్కడ పంట పొలాల్లోకి చంద్రబాబు అడుగుపెట్టడు కానీ.. పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్లి దేవేగౌడ, కుమారస్వామితో కలిసి కాఫీ తాగుతాడు. మీరైనా పీఎం కావచ్చు.. నేనైనా పీఎం కావచ్చు.. ఇద్దరం కలిసి పని చేద్దాం అని చెబుతాడు. తన సొంత జిల్లా చిత్తూరులో మైనస్‌ 47.3 శాతం వర్షపాతం లోటు ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ నివేదికలే ఈ విషయం చెబుతుంటే ఆయన చిత్తూరును పట్టించుకోకుండా పక్కనే ఉన్న తమిళనాడుకు వెళ్లి స్టాలిన్‌తో కలిసి సాంబార్‌ ఇడ్లీ తింటాడు. ఫొటోలకు పోజులిస్తాడు. ఇద్దరమూ కలిసి జాతీయ రాజకీయాలను ఏలేద్దాం అని ఆయనతో అంటాడు. నెల్లూరు జిల్లాలో మైనస్‌ 66.9 శాతం లోటు వర్షపాతం ఉంది. ప్రకాశం జిల్లాలో మైనస్‌ 58.1 శాతం లోటు వర్షపాతం ఉంది. చంద్రబాబు వీటిని పట్టించుకోకుండా ప్రత్యేక విమానంలో బంగళాఖాతం దాటి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి వెళ్లి అక్కడ మమత బెనర్జీని శాలువతో సన్మానించి టిఫిన్‌ తింటాడు. ఆ తర్వాత దేశాన్ని మనిద్దరం ఏలుదామని ఆమెతో అంటాడు. అయ్యా చంద్రబాబూ.. మీ సచివాలయం ఉన్న గుంటూరు జిల్లానే తీసుకుంటే అక్కడ మైనస్‌ 40.6 శాతం, కృష్ణా జిల్లాలో మైనస్‌ 24.5 శాతం లోటు వర్షపాతం ఉంది. మొన్న ఖరీఫ్‌లో రాష్ట్రం మొత్తం మీద 470 మండలాల్లో కరువు పరిస్థితులు. ఇవాళ నవంబర్‌ 14 వరకు పరిస్థితులను పరిశీలిస్తే 528 మండలాల్లో కరువు ఏర్పడింది. విజయనగరం జిల్లాలోనే 26 మండలాల్లో కరువు ఉంది. ఈ కరువు మండలాలకు మొన్నటి ఖరీఫ్‌ సీజన్‌లో అక్షరాల రూ.2 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా కనీసం ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఈ పెద్దమనిషి ఇవ్వలేదు.   

మన ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం 
- ఎన్నికల తేదీ నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల రుణాలు ఎంతైతే ఉన్నాయో ఆ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాం. అక్కచెల్లెమ్మలకు మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఆ వడ్డీ సొమ్మును ప్రభుత్వమే కడుతుంది.   
ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి దారుణంగా ఉంది. రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. సబ్సిడీ సొమ్ము కూడా అరకొరగా ఉంటోంది. వైఎస్సార్‌ చేయూత పథకాన్ని తెచ్చి కార్పొరేషన్‌ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి అక్క గ్రామ సచివాలయానికి వెళ్లి వైఎస్సార్‌ చేయూత పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో సంవత్సరం నుంచి నాలుగు దఫాలుగా నాలుగు సంవత్సరాల్లో రూ.75,000 ఇస్తాం. ఇది అప్పుగా కాదు.. ఉచితంగా ఆ అక్కల చేతిలో పెడతాం.  
మీ చిట్టి పిల్లలను బడులకు పంపిస్తే ప్రతి అక్కకూ.. ప్రతి చెల్లికీ ఏటా రూ.15,000 ఇస్తాం. ఏబడికి పంపించినా çఫరవాలేదు.  
మీ పిల్లలను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను చదివిస్తానని హామీ ఇస్తున్నాను. ఎంత ఖర్చు అయినా çఫరవాలేదు. మీ పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువులు చదవడానికైనా హాస్టల్‌లో ఉండాల్సి వస్తుంది. వారి ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం.  
గ్రామాల్లో ఏ పథకం కావాలన్నా లంచాలివ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మీ గ్రామంలోనే గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. మీ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలిచ్చి అక్కడ కూర్చోబెడతాను. ఏ పథకం కావాలన్నా.. మీరు దరఖాస్తు చేసిన 72 గంటల్లో మంజూరు చేస్తాం. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు.  
60 ఏళ్లు నిండిన ప్రతి తల్లికీ ఇచ్చే పింఛన్‌ రూ.2000 చేస్తాను.  
ప్రతి పేదవాడికీ ఉచితంగా ఇల్లు నిర్మించి ఇస్తాను. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. వారికి ఏదైనా అవసరానికి డబ్బు కావాల్సి వస్తే ఆ గృహపత్రాలు తీసుకుని బ్యాంకుకు వెళ్లి పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.
2024 సంవత్సరంలో నేను మళ్లీ మిమ్మల్ని ఓటు అడిగే నాటికి మద్యం షాపులు లేకుండా చేస్తాను.  

ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో అంటున్న మాటలేమిటంటే.. ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ జరగడానికి వీల్లేకుండా సుప్రీంకోర్టుకు వెళతాడట. అయ్యా చంద్రబాబూ.. నువ్వు ప్రత్యేక హోదా కోసంగానీ, ఆంధ్రప్రదేశ్‌ సమస్యల కోసం గానీ  ఏ రోజూ సుప్రీంకోర్టుకు పోలేదు. నీ వాళ్ల మీద ఆదాయపు పన్ను, ఈడీ సోదాలు జరిగితే మాత్రం అవి ఎన్నికలకు ఆరు నెలల ముందు జరక్కూడదు అని ఆరాటపడతావు.  

ఆపరేషన్‌ గరుడ మీద విచారణ జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయలేదు చంద్రబాబూ? ఈయన కేసులు వేయడు.. దీని మీద దర్యాప్తు జరిపించమని రాష్ట్రపతిని కోరడు. కారణం ఏమిటంటే.. దానిపై విచారణ జరిపిస్తే చంద్రబాబే దొంగ అనే విషయం బయటకు వస్తుంది కాబట్టి.  

గిరిజన ప్రాంతంలో బయోమెట్రిక్‌తో గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మారు మూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండదు. రేషన్‌ కోసం, పింఛన్‌ కోసం నెల నెలా మండల కేంద్రాలకు రావాల్సి వస్తోంది. ఇంటర్నెట్‌లేని గ్రామాలను బయోమెట్రిక్‌ నుంచి మినహాయించాలని కురుపాం, కొమరాడ, జియమ్మవలస మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ప్రజలు నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. కొద్దోగొప్పో బియ్యం మిగిలితే మంచిదే కదా అనే దిక్కుమాలిన ఆలోచన చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.   

మొన్న తిత్లీ తుపాను కారణంగా పంటలు, ఆస్తులు దెబ్బతింటే ప్రభుత్వం అరకొర సాయం చేసిందని, అదీ కొందరికే ఇచ్చారని రైతన్నలు బాధపడ్డారు. రూ.3,435 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు స్వయానా లేఖ రాశాడు. ఇందులో నువ్వు ఎంత డబ్బు విడుదల చేశావని అడుగుతున్నా. రూ.3,435 కోట్ల నష్టం జరిగితే చంద్రబాబు ఇచ్చింది రూ.520 కోట్లేనట. కేవలం 15 శాతం కూడా డబ్బులు ఇవ్వలేదు. తిత్లీ బాధితులను విపరీతంగా ఆదుకున్నారని ఏ బస్సు మీద చూసినా ఈయన ఫొటోలే. విజయవాడలో ఫ్లెక్సీలు కట్టి ఈయన ఫొటోలు పెట్టారు. 
అడ్వర్టయిజ్‌మెంట్లతో ప్రచారం చేసుకున్నారు.  

25 నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర 
పాలకొండ రూరల్‌: ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 25వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి అడుగు పెడుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మంగళవారం ఏర్పాటు చేసిన సమాయత్త సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. 11 జిల్లాల్లో పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిందని, 12వ జిల్లా విజయనగరంలో సైతం అపూర్వ ఆదరణ మధ్య కొనసాగుతోందని చెప్పారు. చివరిగా శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 25న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై లక్ష్యం దిశగా సాగుతుందని చెప్పారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలతో పాటు జిల్లాలోని పది నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర ఉంటుందన్నారు. ప్రజల కష్టాలను తీర్చడంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వ పాలనకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.   

మరిన్ని వార్తలు