పోటెత్తిన జనాభిమానం 

9 Aug, 2018 04:30 IST|Sakshi
ఎస్‌.అగ్రహారంలో జన సందోహం మధ్య పాదయాత్ర సాగిస్తున్న జగన్, ఎస్‌.అగ్రహారం, గిడిజాంలో మహిళలు ఆత్మీయంగా పరిచిన చీరలపై నడుస్తున్న జననేత

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం  

రోడ్డుపై చీరలు పరిచి స్వాగతించిన మహిళలు 

వర్షం వల్ల ఉదయం పూట పాదయాత్ర రద్దు 

మధ్యాహ్నం యాత్ర మొదలవ్వగానే భారీగా అడుగులో అడుగు వేసిన జనం 

జననేతతో మాట్లాడాలని పోటీ పడిన యువత 

అందరి సమస్యలు విని ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జగన్‌ 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  రోడ్డుపై చీరలు పరిచి మహిళల స్వాగతాలు.. అడుగడుగునా హారతులు.. కిటకిట లాడిన గ్రామాల కూడళ్లు.. జాతర జరుగుతోందా.. అన్నట్లుగా ఆద్యంతం ఆ దారి జనంతో కిక్కిరిసింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 232వ రోజు బుధవారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనం చూపిన ఆదరణ ఇది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉదయం పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి వర్షం కురుస్తోంది. అయినప్పటికీ జనం జగన్‌ను కలవడానికి భారీగా తరలి వచ్చి రౌతులపూడి శివారులోని బీబీ నగర్‌ క్రాస్‌ వద్ద ఆయన విడిది చేసిన శిబిరం బయట వేచి ఉన్నారు.

వర్షం తగ్గక పోవడంతో ఉదయం పూట పాదయాత్ర రద్దయినట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఆ పూట యాత్ర రద్దయిందని, జగన్‌ బయటకు రారని తెలియడంతో మహిళలు, యువకులు నిరాశతో వెనుదిరిగారు. మధ్యాహ్నం వర్షం తెరిపి ఇవ్వడంతో పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలియగానే ఒక్కసారిగా జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. 1.30 గంటలకు జగన్‌ పాదయాత్ర ప్రారంభించగానే భారీ సంఖ్యలో జనం ఆయన అడుగులో అడుగు వేశారు. పాదయాత్ర సాగిన మార్గమంతా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో సందడిగా మారిపోయింది. దారికిరువైపులా పెద్ద సంఖ్యలో అక్కచెల్లెమ్మలు, యువతీ యువకులు, అవ్వా తాతలు.. ఉత్సాహంతో ఎదురు చూశారు. జగన్‌ అక్కడికి రాగానే ఆయనతో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.
 
స్వాగతాలు.. విన్నపాలు.. 
గిడిజాం, ఎస్‌.అగ్రహారం గ్రామాల్లో మహిళలు జగన్‌ తమ గ్రామంలోకి వచ్చినపుడు రోడ్లపై చీరెలు పరిచి స్వాగతించారు. మరికొన్ని చోట్ల కింద పరిచిన చీరలపై పూలు చల్లి, వాటిపై నుంచి జగన్‌ నడిచి వచ్చేలా చేశారు. దారిపొడవునా హారతులు పట్టారు. జగన్‌తో సెల్ఫీ దిగడానికి అక్కచెల్లెమ్మలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. అనంతరం పక్కకు వచ్చి ఆ సెల్ఫీని వారి స్నేహితులు, బంధువులకు పంపడం కనిపించింది. మరికొందరు తాము జగన్‌తో ఫొటో దిగామని అక్కడున్న వారికి చూపుతూ సంబరపడ్డారు.  

జగన్‌ మాట ఇచ్చారంటే చేస్తారన్న నమ్మకం ఉందని, తండ్రిని మించిన తనయుడిగా ప్రజలను ఆదుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదని జనం చర్చించుకున్నారు. మరోవైపు అన్ని వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకున్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఒక ప్రభుత్వోద్యోగి కుటుంబం జగన్‌తో మొర పెట్టుకుంది. తాము వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారమని పింఛన్లు తొలగించారంటూ పలువురు వాపోయారు. రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదని, ఇళ్లు మంజూరు చేయడం లేదని పలువురు జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. అవ్వలు, తాతలు, దివ్యాంగులతో జగన్‌ ఆత్మీయంగా మాట్లాడారు. అందరి సమస్యలు ఓపికగా వింటూ.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ఆయన ముందుకు సాగారు.    

ఇంటికి టీడీపీ జెండా కడితేనే రుణమిస్తారట 
మాది మండపం. ఇంటి నిర్మాణానికి రూ.1,5 లక్షలు ఇస్తామన్నారు. నిర్మాణ పనులు ప్రారంభించాక రుణం మంజూరు కాలేదు. అధికారుల చుట్టూ ఎన్నిమార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. దీనిపై గ్రామంలోని పాలక పార్టీ ప్రముఖులను ప్రశ్నించగా ఇంటికి టీడీపీ జెండా కడితేనే ఇంటి రుణమిప్పిస్తామని తేల్చి చెప్పారు. దీంతో 70 సెంట్ల భూమిని అమ్మడంతో పాటు రూ.రెండు లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టాను. ఇదీ చంద్రబాబు పాలన.                                  
– నక్కా నూకరాజు 

కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం లేదు 
నా పేరున ఉన్న కార్డులో భర్త, పిల్లల పేర్లున్నాయి. కుమార్తె, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లయ్యాయి. వారి పేరున రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాలేదు. కొత్తవారికి రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదు. మరోవైపు కార్డులు ఉన్న వారికి కూడా సరుకులు సక్రమంగా ఇవ్వడం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రేషన్‌ సరుకులు సక్రమంగా అందేవి. 
– నక్కా గంగా 

జగనన్న చెప్పారంటే చేస్తారు.. 
మాది రౌతులపూడి. నేను డైట్‌లో డీఎడ్‌ చదువుతున్నాను. రూ.25 వేలు ఫీజు కట్టమంటున్నారని బీబీ క్రాస్‌ వద్ద జగనన్నకు చెప్పాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎవరికీ సక్రమంగా అందడం లేదని చెప్పాను. తమ ప్రభుత్వం రాగానే పేదలు ఎంత వరకు చదువుకున్నా చదివిస్తానని జగనన్న చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం జగనన్నకే సాధ్యమని నమ్ముతున్నాను.                        
  – జి.శాంతి    

>
మరిన్ని వార్తలు