రాష్ట్రంలో నేరగాళ్ల పాలన!

6 Mar, 2019 03:25 IST|Sakshi
నెల్లూరు సమరశంఖారావం సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజల గోప్యమైన డేటా వివరాలను తస్కరించి చట్ట విరుద్ధంగా ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగిస్తావా?

చంద్రబాబుపై నెల్లూరు సమరశంఖారావంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

సీఎం చంద్రబాబు చేసింది తీవ్రమైన నేరం 

నీకు, ఆ కంపెనీలకు ఉన్న సంబంధం ఏమిటి? 

అసలు డేటాను ఎవరిచ్చారు? 

ఇంతకంటే తీవ్రమైన నేరం వేరే ఉంటుందా? 

సీఎంగా ఉండటానికి నువ్వసలు అర్హుడివేనా? 

నేరం నువ్వే చేసి మళ్లీ దొంగే దొంగ అని అరిచినట్లుగా ఎదురుదాడి చేస్తావా? 

తప్పు చేస్తూ పట్టుబడిన నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్లీ ఎదురు దాడి చేస్తావా?

ఏపీ పోలీసులను వాచ్‌మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నావ్‌ 

స్వయంగా మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటును తొలగించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు 

ఎన్నికలు సమీపించడంతో తనకు ఓట్లేయని వారిని చంపించటానికి కూడా బాబు వెనుకాడరేమో!

మీ సంతకాలూ ఫోర్జరీ కావచ్చు
చంద్రబాబుకు మీ బ్యాంకు ఖాతా నెంబరు, మీ చెక్కు బుక్కు నెంబరు తెలుసు. మీ సంతకాలనే రేపు ఫోర్జరీ చేయవచ్చు. మీ ఆధార్‌ నెంబరు చంద్రబాబుకు తెలుసు. ప్రజల వ్యక్తిగత వివరాలు చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్‌ కంపెనీల కంప్యూటర్లలో దొరుకుతుంటే ఇలాంటి వ్యక్తి సీఎంగా పని చేయడానికి అర్హుడేనా?
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గోప్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత డేటాను తనకు సన్నిహితులైన ఐటీ కంపెనీలకు బదలాయించి దొంగతనానికి పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దొంగ... దొంగ!.. అని తమను తప్పుబడుతూ యాగీ చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మన రాష్ట్ర పోలీసులను చంద్రబాబు వాచ్‌మెన్‌ల కన్నా దారుణంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఒక్క క్షణం కూడా అర్హుడు కాదని ధ్వజమెత్తారు. ప్రజలకు సంబంధించిన ఆధార్, యూఐడీ డేటా ప్రభుత్వం వద్ద ఉంటుందని అలాంటి డేటా ప్రైవేట్‌ కంపెనీల కంప్యూటర్లలో దొరకడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించే యాజమాన్యాలకు చెందిన బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్‌ అనే రెండు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ డేటా బదలాయించారని, సుప్రీంకోర్టు తీర్పునకు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను ఈ రెండు సంస్థలే రూపొందించాయని గుర్తు చేశారు. అలాంటి సంస్థలకు ప్రజల వ్యక్తిగత డేటాను అప్పగించి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారని, అదే రీతిలో దొంగ ఓట్లను కూడా చేరుస్తున్నారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు చంద్రబాబు ఎలాగైతే మాట్లాడారో ఇపుడు డేటా తస్కరణలో చిక్కినప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరులోని ఎస్వీజీఎస్‌ కళాశాల సెంటర్‌ మైదానంలో నిర్వహించిన సమర శంఖారావం సభలో జగన్‌ ప్రసంగిస్తూ చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే....

దొంగఓట్లను తొలగించమంటే వ్యవస్థలను నాశనం చేసినట్లా?
‘‘చంద్రబాబు పాలనలో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఫలానా మంచి పని చేశా కాబట్టి ఓట్లేయండి అని అడిగే పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి లేనే లేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే తనకు ఓట్లు పడతాయన్న నమ్మకం చంద్రబాబుకు లేదు. రాష్ట్రంలో అక్షరాలా 59.16 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయంటే చంద్రబాబు ఏ స్థాయిలో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారో తెలిసిపోతోంది. ఇందుకు వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. ఈ ఓట్లలో 20 లక్షల ఓట్లు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటర్లుగా నమోదైన వారికి. మరో 39 లక్షల పైచిలుకు ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే రెండేసి ప్రాంతాల్లో ఉన్నాయని, ఈ డూప్లికేట్‌ ఓట్లను తొలగించాలని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. దొంగ ఓట్లను ఏరి వేయాలని, తొలగించిన అర్హుల ఓట్లను మళ్లీ చేర్చాలని ఎన్నికల సంఘానికి అర్జీలు దాఖలు చేస్తే వ్యవస్థలను నాశనం చేస్తున్నట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఒకపక్క దొంగ ఓట్లను చేరుస్తూ మరోపక్క తనకు ఓట్లు వేయరని భావించే వారి ఓట్లను తొలగిస్తున్నారు. తానే దొంగతనం చేసి... దొంగ దొంగ దొంగ... అని మిద్దెలెక్కి అరవడం మొదలు పెడతారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగుతోంది. 

మా చిన్నాన్న పేరూ తొలగించారు...
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి పేరు కూడా ఉంది. తాను ఓటరును కాదని, జాబితా నుంచి తొలగించాలని మా చిన్నాన్న అర్జీ పెట్టాడట. తాను ఏమన్నా చెల్లుబాటు అవుతుందని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు తోడుగా ఉన్నాయని, టీవీ–5తోపాటు ఎల్లో మీడియా తోడుగా ఉందని చంద్రబాబు ఆడుతున్నారు. తాను అన్యాయం చేస్తూ ఎదుటి వాళ్లు అన్యాయం చేస్తున్నారని అంటారు. తొలగించిన ఓటర్ల జాబితాలో వైఎస్‌ వివేకానందరెడ్డి పేరు ఉంది కానీ నారా లోకేష్‌ పేరు మాత్రం ఎక్కడా కనిపించదు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ వేల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకూ ఈ కుట్ర విస్తరించి ఉంది. ఓటర్ల కలర్‌ ఫోటోలతో కూడిన ఎన్నికల డేటా కేవలం ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉంటుంది. అలాంటి ఈ డేటా చంద్రబాబుకు సన్నిహితులైన ప్రైవేట్‌ కంపెనీల దగ్గర కూడా దొరుకుతోంది. ఆధార్, యూఐడీ డేటా కూడా ఈ ప్రైవేట్‌ కంపెనీల కంప్యూటర్లలో దొరుకుతోంది. ఇలాంటి డేటా చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించే ప్రైవేట్‌ కంపెనీల దగ్గర దొరుకుతూ ఉందంటే ఇదెంత పెద్ద నేరమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

నిస్సిగ్గుగా బుకాయింపు....
ప్రజలకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన డేటా ప్రైవేట్‌ వ్యక్తులు, కంపెనీల ఆధీనంలో ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అలాంటిది చంద్రబాబు ప్రైవేట్‌ కంపెనీల దగ్గర ఈ డేటా దొరుకుతూ ఉందంటే వీళ్లు ఏ స్థాయిలో వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారో, నాశనం చేస్తున్నారో చెప్పటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా? అని అడుగుతున్నా. ఈరోజు ఒక దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఒక రాక్షసుడు ఇవాళ మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఒక నేరగాడు పరిపాలిస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొని ఉంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నారు. ఓవైపు చేయకూడని పనులు చేస్తూ మరోవైపు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. 

అంతా కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..
మనమంతా కలసి ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబును  ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా మోస్తూనే ఉంది. చంద్రబాబు ఏం చేసినా ఈనాడుకు మాత్రం తప్పుగా అనిపించదు. ఆంధ్రజ్యోతికి తప్పుగా అనిపించదు. టీవీ –5కి తప్పుగా అనిపించదు. ఇలాంటి సున్నితమైన, ప్రజలకు సంబంధించిన డేటా చంద్రబాబు ప్రైవేటు కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తే మామూలుగా అయితే గొడవ చేయాలి, గోల చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి ఈ పత్రికలు, మీడియా ముందుండాలి. కానీ చంద్రబాబునాయుడినే వారు భుజాన పెట్టుకుని మోస్తూ ఉంటారు. 

బాబు చేసింది తీవ్రమేన నేరమే..
చంద్రబాబు ఇప్పుడు చేసిన నేరం చాలా తీవ్రమైనది. మీ బ్యాంకు ఖాతా నెంబరు, మీ చెక్కుబుక్కు నెంబరు చంద్రబాబుకు తెలుసు. మీ సంతకాలనే రేపు ఫోర్జరీ చేయవచ్చు. మీ ఆధార్‌ నెంబరు చంద్రబాబుకు తెలుసు. ఇలాంటి సున్నితమైన వివరాలు చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్‌ కంపెనీల కంప్యూటర్లలో దొరుకుతుంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పని చేయడానికి అర్హుడేనా? అని మీ అందరి తరపునా అడుగుతున్నా. సాధారణంగా ఇలాంటి నేరాలు చేసేవారిని దొంగ అని అంటాం. మీకు తెలియకుండా మీ బ్యాంకు ఖాతా వివరాలు ఇతరుల దగ్గర ఉన్నాయంటే ఆ వ్యక్తిని మనం దొంగ అంటాం. కానీ ఈరోజు మన ఖర్మ ఏంటంటే ఈ వ్యక్తిని మనం ముఖ్యమంత్రి అంటున్నాం. ఆయన కుమారుడిని ఐటీ మంత్రి అని అంటూ ఉన్నాం. 

ప్రజల డేటా ప్రైవేట్‌ కంపెనీలకా?
బదలాయించ కూడని ఈ డేటాను ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇచ్చావు? అని మీ అందరి తరపున చంద్రబాబును అడుగుతున్నా. బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ఈ రెండూ ప్రైవేటు కంపెనీలే. ఈ రెండు కంపెనీల వాళ్లే టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను కూడా రూపొందించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన గోప్యమైన డేటా ఈ రెండు కంపెనీల దగ్గర ఎలా ఉంది? అని మీ అందరి తరపునా చంద్రబాబును అడుగుతున్నా. ఈ కంపెనీలు ఎవరివి? ఎవరు పెట్టించినవి? ఆ కంపెనీల యజమానులకు చంద్రబాబుకు, లోకేష్‌ కు ఉన్న సంబంధాలేమిటి? అని మీ అందరి తరపున నిలదీస్తున్నా. ఈ కంపెనీల యాజమాన్యాలు వందల సార్లు సీఎంను కలిశాయి. ఈ కంపెనీల యాజమాన్యాలతో చంద్రబాబు, లోకేష్‌ దిగిన ఫోటోలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి? రాష్ట్ర పౌరుల వ్యక్తిగత డేటాతో ఈ కంపెనీలకు ఏం సంబంధం ఉంది? వాటికి ఈ డేటాను ఎవరు ఇచ్చారు? ఎందుకు బదలాయించారు? అని అడుగుతున్నా. చట్ట విరుద్ధంగా ఈ డేటా ఆ కంపెనీల దగ్గర ఎందుకు ఉంది? అని ప్రశ్నిస్తున్నా.

డేటా చౌర్యానికి శిక్ష విధించవద్దా?
ఈ డేటాను దొంగతనం చేయడం నేరం కాదా? ఈ నేరం చేసిన కంపెనీలకు, చేయించిన చంద్రబాబుకు శిక్ష పడాల్సిన పని లేదా? అని అడుగుతున్నా. ఈ కంపెనీలు చేస్తున్నది అన్యాయమని గుర్తించిన తెలంగాణ పోలీసులు దాడులు చేస్తే.. ఆ కంపెనీల యాజమాన్యాలు చంద్రబాబుకు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపించాయి. మెసేజ్‌ అందిన క్షణాల్లోనే చంద్రబాబు ఏపీ పోలీసులను అక్కడికి పంపించారు. తను చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, డేటా బయటకు రాకుండా మన రాష్ట్ర పోలీసులను చంద్రబాబు వాచ్‌మెన్‌ల కన్నా దారుణంగా వాడుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండదగ్గ వ్యక్తేనా? పోలీసులకు గౌరవం ఇవ్వాల్సింది పోయి వారిని రౌడీ మూకల మాదిరిగా వాడుకునే కార్యక్రమం చేస్తున్న ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి అర్హుడు కాదు. 

టీడీపీ యాప్‌తో ఆ నాలుగు డేటాల అనుసంధానం
ఆధార్, ఫోటో ఎలక్టోరల్‌ డేటా, పల్స్‌ సర్వే డేటా, బ్యాంకు ఖాతాల డేటాలను టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేశారు. టీడీపీ యాప్‌లో రిజిస్టర్డ్‌ అయి ఉన్న టీడీపీ నేతలకు ఆ డేటాను పంపి ఆయా గ్రామాల్లో ఈ ఓటర్లు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? ఎవరికి అనుకూలం? అని సర్వేలు చేస్తూ వ్యతిరేకుల ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేయడం లాంటి చర్యలకు దిగుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి? అని చంద్రబాబును అడిగితే జవాబు చెప్పడు కానీ సెల్‌ఫోనే నేనే కనిపెట్టా, హైదరాబాద్‌ను నేనే కట్టా అని అంటాడు. డేటా గురించి నాకు నేర్పుతారా? అంటాడు. డేటా అనేది ఆయన సొత్తు అన్నట్లుగా మాట్లాడతాడు. డేటాను దొంగతనం చేస్తూ పట్టుబడిన చంద్రబాబు ప్రజలకు కనీసం క్షమాపణ చెబుతామన్న ఆలోచన కూడా రాదు. దొంగ దొంగ.. అని అరుస్తూ ఇతరులపై నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అర్హులను ఓటర్లుగా చేర్చడంతోపాటు దొంగ ఓట్లను తొలగించాలని మనం ఈసీని కోరుతుంటే మనం అడిగేది తప్పు అని చంద్రబాబు అంటున్నారు. 

ఈనాడు పత్రిక చూసినపుడు ఆశ్చర్యం కలిగింది..
ఈరోజు ఈనాడు పత్రిక చూసినపుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు ఎవరు తప్పు చేశారు? ఎవరిని అంటున్నారు? అని ఆశ్చర్యం అనిపించింది. అందుకు కారణం ఏమిటంటే ఆ ప్రైవేటు కంపెనీలు చంద్రబాబుకు సన్నిహితమైనవి కావడమే. చట్ట విరుద్ధంగా ఈ డేటాను ప్రభుత్వం ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఇది నేరం. తప్పు చేసి పట్టుబడిన చంద్రబాబు తాను క్షమాపణ చెప్పాల్సింది పోయి మనదే తప్పు అంటూ  మాట్లాడుతున్నాడు. మనదే తప్పనట్లుగా చంద్రబాబు బురద జల్లడానికి కారణం ఉంది. వీటిపై ఎంక్వయిరీ జరగ కూడదు, దొంగ ఓట్లు అలాగే కొనసాగాలి అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలకు చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు , టీవీ 5 లాంటి ఎల్లో మీడియా వంత పాడుతోందంటే అసలు వీళ్లంతా కూడా మనుషులేనా? అని మీ అందరి తరపున ప్రశ్నిస్తున్నా.

ఓటుకు కోట్లులో చిక్కినప్పుడు కూడా ఇలాగే..
ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినపుడు కూడా చంద్రబాబు ఇలాగే మాట్లాడారు. సెక్షన్‌ 8 అంటాడు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ అంటాడు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్రా కంపెనీలపై దాడులు చేయడం ఏమిటని ఈ పెద్దమనిషి ప్రశ్నిస్తాడు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికి పోయి ఆ వివరాలు టీవీల్లో ప్రసారం అయ్యేటప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే మాట్లాడారు. మళ్లీ ఇవాళ దొంగతనం చేస్తూ పట్టుబడినపుడు కూడా మళ్లీ అవే మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి సిగ్గుమాలిన మనిషి చంద్రబాబు. 
 
తనకు ఓట్లేయరనుకుంటే చంపిస్తాడేమో!
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరైనా తనకు ఓటు వేయని మనుషులను కూడా చంద్రబాబు చంపిస్తారేమో! గ్రామాలను కూడా తగల బెట్టిస్తారేమో! ఈ పెద్దమనిషి పాలన చూస్తూంటే పూర్వకాలంలో బకాసురుడి పాలన, నరకాసురుడి పాలనకు సంబంధిన కథలు గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో నారాసురుడి పాలనను చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో వ్యవస్థ ఎంతగా దిగజారి పోయిందంటే... తన పార్టీ వారు కాదనుకున్న వారికి మొదట రేషన్‌ కార్డులు తీసేశాడు. తన పార్టీ వాళ్లు కాదనుకుంటే పింఛన్లు కూడా కత్తిరిస్తూ ఉన్నారు. తన పార్టీ వారు కాదనుకుంటే నిరుపేదలు కట్టుకుంటున్న ఇళ్లకు చివరకు డబ్బులివ్వకుండా ఆపేస్తున్నారు. తన పార్టీ వారు కాదనుకుంటే వెబ్‌ల్యాండ్‌ పేరుతో ప్రతి ఒక్కరి భూములకు ఎసరు పెట్టే కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. తన పార్టీ వారికి గ్రామాలను దోచుకునేందుకు లైసెన్సులు ఇచ్చేశాడు. జన్మభూమి కమిటీలని పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనుగోలు చేశాడు. వారితో రాజీనామా చేయించడు, అనర్హత వేటు వేయడు. వారిని ఎన్నికల్లో తన పార్టీ గుర్తుపై పోటీ చేయించే ధైర్యం చేయడు. వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశాడు. 

మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది...    
ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులైన ప్రతి బూత్‌ కమిటీ సభ్యునికీ ముందుగా రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రతిపక్షంలో ఉన్న 9 ఏళ్లలో మీరంతా నాకు అండగా నిలిచారు. అధికారంలో ఉన్న వారు మిమ్మల్ని ఎన్ని కష్టాలు, బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరెంత నష్ట పోయారో కూడా నాకు బాగా తెలుసు. 13 జిల్లాల్లో మన ప్రతి కార్యకర్తా ఎన్ని కష్టాలు పడ్డారో... ఎన్ని అవమానాలను సహించారో కూడా తెలుసు. కొందరు లాఠీ దెబ్బలు తిన్నారు. మరి కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నారు. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని నేను చూశా. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది. రేపు దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ బాగోగులను నేను చూసుకుంటానని మాట ఇస్తున్నా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు అండగా ఉండి పైకి తీసుకొచ్చుకుంటా అని హామీ ఇస్తున్నా. ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడికీ ఇదే చెబుతున్నా. మీమీద పెట్టిన అక్రమ కేసులు, దొంగ కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తేస్తామని హామీ ఇస్తున్నా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంక్షేమ పథకం ప్రజలందరికీ అందాలి. ఆ సంక్షేమ పథకాలను పేదవాడికి అందించేటపుడు కులాన్ని చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు. చివరకు ఏ పార్టీ వారు? అనేది కూడా చూడకూడదని మీ అందరికీ చెబుతున్నా. మీరే ముందుండి ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలా చేస్తానని చెబుతున్నా. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన హయాంలో రావాలి. అలాంటి పాలనకు దిక్సూచిగా మీరే నిలబడతారని హామీ ఇస్తున్నా‘‘

మరిన్ని వార్తలు