చరిత్రాత్మకం..

7 Jun, 2018 01:59 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

తప్పులను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు మాపై బురదజల్లుతున్నారు

ఉప ఎన్నికల్లో మాపై పోటీ పెడితే అదృష్టంగా భావిస్తాం

ఎందుకంటే టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు

మా అభ్యర్థులపై పోటీ పెట్టడమంటే హోదాకు వ్యతిరేకమనే కదా అర్థం వచ్చేది!

25 మంది ఎంపీలూ ఒకేసారి రాజీనామాలు చేసుంటే దేశమంతా చర్చ జరిగేది కాదా? 

కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేది కాదా?

ఆ పరిస్థితిని చంద్రబాబు చేజేతులారా నాశనం చేశారని మండిపడ్డ జగన్‌   

ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో త్యాగాలు చేసిన చరిత్ర మాది. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించకుండా హోదా ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. మీ తప్పునూ, మీ ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాపై అభాండాలు వేయడం సిగ్గుచేటు. మా నిబద్ధతను ప్రజలు హర్షిస్తున్నారు. మీ నిర్వాకాన్ని గర్హిస్తున్నారు. 
– వైఎస్‌ జగన్‌ 

ప్రజాసంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన కోసం పధ్నాలుగు నెలల ముందుగానే తమ పదవులను వదులుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలకు సెల్యూట్‌ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, యువతకు ఉద్యోగాల కోసం చిత్తశుద్ధితో తమ ఎంపీలు పదవులను త్యాగం చేశారని ఆయన కొనియాడారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో బుధవారం 182వ రోజు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ నడిపల్లి కోట వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ తమ పార్టీ ఎంపీలు ఐదుగురు అంకిత భావంతో పోరాడుతూ.. చిత్తశుద్ధితో పదవులకు రాజీనామాలు చేస్తే శహభాష్‌ అనాల్సింది పోయి చంద్రబాబు వక్రీకరణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

‘ప్రత్యేక హోదాకు చంద్రబాబు అనుకూలమనుకోవాలా? వ్యతిరేకమనుకోవాలా?
ప్రత్యేక హోదా కోసం మా ఎంపీల రాజీనామాల ఫలితంగా ఉప ఎన్నికలొస్తే మేం ఎదుర్కొంటాం. ఒక మహత్తర లక్ష్యం కోసం రాజీనామాలు చేసిన వారిపై బుద్ధి ఉన్నవాడు ఎవడైనా అభ్యర్థులను పోటీ పెడతాడా? మా అభ్యర్థులపై పోటీ పెట్టారంటే దానర్థమేంటి? పోటీ పెట్టిన వారు ప్రత్యేక హోదాకు అనుకూలమనుకోవాలా? వ్యతిరేకం అనుకోవాలా? ఇది కామన్‌సెన్స్‌కు సంబంధించిన విషయం. నిజంగా చంద్రబాబు నిస్సిగ్గుగా అభ్యర్థులను పోటీ పెడితే అది మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఆయన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు కాబట్టి. ఒక లక్ష్యం కోసం, ఒక అంశాన్ని, ఒక ఆకాంక్షను చాటి చెప్పడం కోసం, దేశం మొత్తం ఈ అంశాన్ని చర్చనీయాంశం చేయడం కోసం చిత్తశుద్ధితో మా ఎంపీలు రాజీనామాలు చేసే స్థాయికి వెళ్లడం హర్షించదగ్గ విషయం. ఆ అంకిత భావం చూపినందుకు ఆ ఐదుగురు ఎంపీలకు నేను సెల్యూట్‌ చేస్తున్నాను. 

ఇది చరిత్రలో నిలిచిపోయే అంశం
మా పార్టీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందడం అన్నది కొత్త విషయమేం కాదు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు ఇచ్చాక ఓ రోజు అటుఇటుగా ఆమోదం పొందాల్సిందే. అన్నింటి కన్నా ప్రధానమైన అంశం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ప్రత్యేక హోదాపై పోరాటం మరుగున పడకుండా, సమసిపోకుండా ఈ చర్య ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఐదుగురు ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశారనేది చరిత్రలో నిలిచిపోయే అంశం. ప్రత్యేక హోదా లేదని, ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం అటూ ఇటూ ఆడుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా తీవ్రమైన అంశం. దీని కోసం ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాల ఆమోదం కోసం సిద్ధంగా ఉండటం నిలబడి పోయే అంశం. ఈ రాజీనామాలు ఎందుకు చేశారు.. అని దేశం మొత్తం మీద చర్చ జరుగుతోంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేకపోయారా..! అలాంటి పరిస్థితుల మధ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామాలు చేశారు.. అని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు హోదా కోసం రాజీనామాలు చేసి, నిరాహారదీక్షకు కూర్చుని ఉంటే ఈ చర్చ ఇంకా విస్తృత స్థాయిలో జరిగి ఉండేది. 

చంద్రబాబు చేజేతులారా నాశనం చేశారు
ఒక రాష్ట్రంలో ఉండే అన్ని స్థానాలు 25కు 25 ఎంపీ పదవులు ఒకేసారి ఖాళీ అవడం అనేది సాధారణ సందర్భాల్లో జరగదు. అలాంటిది అందరూ రాజీనామాలు చేసి ఉంటే ఒక ప్రత్యేక సందర్భం అనేది ఏర్పడి ఉండేది. అది కుదిపేసే ఘటనగా ఉండేది. దేశం మొత్తం హల్‌చల్‌ అయ్యేది. కేంద్రం కూడా దిగొచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది. అయితే ఆ పరిస్థితిని చంద్రబాబు చేతులారా నాశనం చేశారు. కానీ మన ఖర్మేంటంటే.. స్వార్థ రాజకీయాలు మెండుగా ఉన్నాయి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద ఏవో కేసులొస్తాయని, ఆ కేసులొచ్చినప్పుడు ఆయన తరఫున పార్లమెంటులో గొడవ చేయడానికి తన ఎంపీలు ఉండాలని భావించారు. టీడీపీ ఎంపీలు కనుక రాజీనామా చేస్తే ఆ పరిస్థితి ఉండదనే భయానికి లోనైన చంద్రబాబు తన ఎంపీలను రాజీనామా చేయకుండా కట్టడి చేశారు. అందువల్ల ఈ రోజు చర్చ ఐదుగురి ఎంపీల రాజీనామాల వరకే పరిమితమైంది. 

చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ లేకపోవడం మన ఖర్మ
ప్రత్యేక హోదా సాధన అనేది ఓ యుద్ధం లాంటిది. ఇక్కడ, నాకు ఓ కథ గుర్తుకొస్తోంది. యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పుడు యుద్ధరంగంలో పోరాడుతున్న ఓ సిపాయి తుపాకీతో కాలిస్తే అందులోంచి ఐదు గుళ్లు మాత్రమే బయటకొచ్చాయి. మిగతా గుళ్లు బయటకు రావు. అప్పుడా సిపాయి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ అనే సిపాయి ప్రత్యేక హోదా సాధించాలని యుద్ధం చేస్తూ ఉంటే.. ఆయన కాల్చిన తుపాకీ నుంచి కేవలం ఐదే ఐదు గుళ్లు బయటకొచ్చాయి. మిగిలిన గుళ్లు ఎందుకు రాలేదంటే అవి నకిలీవి కనుక. అవి చంద్రబాబుకు సంబంధించిన ఎంపీలు కనుక. ఆ నకిలీ గుళ్లు బయటకు రాలేదు కనుకే ప్రత్యేక హోదా సాధనలో ఆంధ్రప్రదేశ్‌ అనే సిపాయికి ఒక అడుగు వెనక్కు పడింది. అన్నింటికన్నా బాధ కలిగించే అంశం ఏంటంటే.. మా ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చుని ఉంటే కేంద్రం దిగొచ్చేది, ప్రత్యేక హోదా ఇచ్చేది. ఈ విషయంలో తాను తప్పు చేశానని చంద్రబాబుకూ తెలుసు. దానిని కప్పి పుచ్చుకునేందుకు ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. సిగ్గు లేకుండా ఎదుటి వారిపై బురద జల్లే కార్యక్రమం దగ్గరుండి చేస్తున్నారు. ఇంత కన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎప్పుడూ ఉండదేమో! రాజకీయాల్లో ఇవాళ నిజాయితీ కావాలి. చిత్తశుద్ధి ఉండాలి. ఈ రెండూ ఉన్నప్పుడే ఏమైనా సాధించగలుగుతాం. ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే చంద్రబాబుకు ఈ రెండు గుణాలు లేకపోవడమే. మన ఖర్మ. 

ఉప ఎన్నికలు రావని ఎలా అనుకుంటారు?
(ఉప ఎన్నికలు రావనే ఎంపీలు రాజీనామాలు చేశారని టీడీపీ నేతలు చేసిన విమర్శలను మీడియా వైఎస్‌ జగన్‌ వద్ద ప్రస్తావించగా..) ఎన్నికలకు పధ్నాలుగు నెలలు ముందు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావని ఎవరైనా ఎలా అనుకుంటారు? మీరే చెప్పండి? స్పీకర్‌తో నువ్వు (చంద్రబాబు) మాట్లాడి ఉంటే తప్ప. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఎస్పీవై రెడ్డిని ఆ మరుసటి రోజే చంద్రబాబు కండువా కప్పి తన పార్టీలోకి చేర్చుకున్నారు. మొన్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకూ టీడీపీ కండువా కప్పాడు. మళ్లీ నిన్న సిగ్గు లేకుండా కర్నూలుకు పోయాడు. బుట్టా రేణుక పక్కనే ఉంటుంది. ఎస్పీవై కూడా పక్కనే ఉంటాడు. అరకు ఎంపీ గీతను కూడా పార్టీలో చేర్చుకున్నారు. మా పార్టీ ఎంపీలు ముగ్గుర్ని చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటే ఇంత వరకూ అనర్హతకు గురికాలేదు. ప్రతి పార్లమెంటు సమావేశాల్లోనూ మేం అరుస్తూనే ఉన్నాం. సంతలో పశువులను కొన్నట్లు మా ఎంపీలను చంద్రబాబునాయుడు కొంటే ఎందుకు అనర్హులుగా చేయడం లేదని అడుగుతూనే ఉన్నాం. 

ఆ 23 మందిని అనర్హులను చేసి ఎన్నికలు పెట్టాలని ఎన్ని సార్లు అడిగామో తెలీదా?
ఉప ఎన్నికలు అని ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు.. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు, 30 కోట్లు పెట్టి కొన్నారు. వారి మాటేంటి? ఇంకా ఓ అడుగు ముందుకేసి వారిలో నలుగురిని అనూహ్యంగా మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నారు. న్యాయంగా అయితే వారంతా అనర్హులు కావాలి. అనర్హులుగా చేయించడమన్నది చంద్రబాబు చేతిలో ఒక్క రోజు పనే. తన చేతిలో ఉన్న స్పీకర్‌తో వారందరినీ అనర్హులను చేయండి ఉప ఎన్నికలకు పోదాం.. ఇక్కడి వ్యవహారం కనుక దీనిని ఎవరూ ఆపలేరు కదా? నీకు (చంద్రబాబుకు) సిగ్గూ.. శరమూ ఉన్నాయా? మా వాళ్లను అనర్హులుగా చేసి ఎన్నికలు పెట్టండి.. పెట్టండి.. అని ఎన్నిసార్లు మేం చంద్రబాబును అడిగామో తెలీదా! వారిని అనర్హులుగా చేసి ఎన్నికల్లో పోటీ చేయించి మళ్లీ గెలిపించే సత్తా ఆయనకు లేదు కనుకే ఆయన ఇంత వరకు ఆ పని చేయలేదు. ఇన్ని అక్రమాలు చేసిన చంద్రబాబు నిస్సిగ్గుగా మళ్లీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. తాను చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రాజీనామాలు చేసిన వారిపై బురదజల్లే పని చేస్తున్నారు. న్యాయంగా ఎవరూ రాజకీయాలు చేయకపోతే.. రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు ఛీ.. అనిపిస్తుంది. 

అనుకూలమైన మీడియాలో ప్రచారం  
చంద్రబాబు తన వద్ద ఉన్న నాలుగు అనుకూలమైన చానెళ్లు, నాలుగు అనుకూలమైన పత్రికలను మేనేజ్‌ చేసుకుంటూ తానేం చెబితే దానిని ప్రచారం చేయించుకుంటారు. మా ఎంపీలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేస్తే వక్రీకరించే అధ్వానమైన పరిస్థితి మరెక్కడైనా ఉంటుందా? మేం మంచి చేసినప్పుడు శహబాష్‌ అనండి.. ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చినట్లవుతుంది. కానీ చేసిన మంచి పనిని వక్రీకరిస్తే ఇక రాజకీయాల్లో విలువలే ఉండవు. (మీడియాను ఉద్దేశించి..) మీరూ మీడియాలో ఉన్నారు. నిజంగా రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందో తెలిసిన వాళ్లు. మా ఎంపీలు చేసిన మంచి పనికి శహబాష్‌ అనడం మీకూ చేతగాకపోతే ఇక ఎప్పుడండీ రాజకీయాలు బాగుపడతాయి!’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు