ఏపీలో లక్షల్లో నకిలీ ఓట్లు : వైఎస్‌ జగన్‌

4 Feb, 2019 12:50 IST|Sakshi

ప్రస్తుతం 59.18 లక్షల నకిలీ ఓట్లు

20 లక్షల ఓట్లు తెలంగాణ, ఏపీలో డబుల్‌ నమోదు

రకరకాల సర్వేల పేరుతో ఓట్ల తొలగింపు

4 లక్షల మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారు

ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ధిక్కరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

పోలీసుశాఖలోనూ దుర్వినియోగం.. తన సామాజిక వర్గానికి కీలక పోస్టులు

డీజీపీ, ఐజీ, డీఐజీలను బదిలీ చేస్తేనే.. ఏపీలో సజావుగా ఎన్నికలు

ఢిల్లీలో స్పష్టం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నకిలీ ఓట్లు, టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో లక్షల్లో నకిలీ ఓట్లను సృష్టించారని, ప్రస్తుతం 59.18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు రకరకాల సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావులను వెంటనే బదిలీ చేయాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం వైఎస్‌ జగన్‌ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాను కలిసి అధికార తెలుగుదేశం పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా ధిక్కరిస్తుందో ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల ప్రక్రియను ఓ ప్రహసనంగా మార్చారు. ఓటర్ల లిస్టును ఎలా తారుమారు చేస్తున్నారో ఈసీకి వివరించాం. సెప్టెంబర్‌ 2018 నాటికి 52 లక్షల 67వేల నకిలీ ఓట్లు చేర్చారు. ప్రస్తుతం నకిలీ ఓట్ల సంఖ్య 59.18 లక్షలకు చేరింది. మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓట్లలో 59 లక్షల మంది నకిలీ ఓటర్లున్నారు. దాదాపు 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఏపీ, తెలంగాణలో డబుల్‌గా నమోదయ్యాయి. ప్రజా సాధికార సర్వే, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) డేటాబేస్‌, పరిష్కార వేదిక, పిరియాడిక్‌ సర్వేల పేరుతో వివరాలు తెలుసుకుని ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఈ తొలిగింపు ప్రక్రియకు ఒక యాప్‌ను కూడా క్రియేట్‌ చేశారు. ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ కార్డులను లింక్‌ చేస్తూ ఓట్లను తొలగిస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. నిబంధనలకు విరుద్దంగా టీడీపీ తన అధికారిక వెబ్‌సైట్లలో ఫొటోలతో కూడిన మొత్తం ఓటర్‌లిస్ట్‌ను ఉంచింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చే అధికారిక ఓటర్‌ జాబితాలో కూడా ఓటర్ల ఫొటోలు ఉండవు. కానీ టీడీపీ మాత్రం అనైతికంగా ఫొటోలతో సహా ఓటరు జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టి ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి భంగం కలిగిస్తోంది.

చంద్రబాబు నాయడు పోలీస్‌ వ్యవస్థను ఎంతలా దుర్వినియోగం చేస్తున్నాడంటే.. 37 మందిలో సొంత సామాజిక వర్గానికి చెందిన 35 మందికి సీఐ నుంచి డీఎస్పీగా ప్రమోషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా డీఐజీ లా అండ్‌ ఆర్డర్‌ పోస్ట్‌ క్రియేట్‌ చేసి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌ రావును నియమించారు. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కీలక పోస్టుల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ విషయాలన్నిటిని ఎన్నికల కమిషన్‌కు వివరించాం. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వరరావు... డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావును బదిలీ చేయాలని ఈసీని కోరాం. చంద్రాబాబు నాలుగున్నరేళ్ల పాలన అవినీతిని కూడా వివరించాం. ఇలా పోగు చేసిన రూ.4వేల కోట్లుకు పైగా డబ్బును ఇప్పటికే నియోజకవర్గాలకు చేర్చారు. ఆ డబ్బును పోలీసుల ద్వారానే పంచాలని చూస్తున్నారు. మేం చేసిన ఈ ఆరోపణలన్నింటి ఆధారాలను ఈసీకి సమర్పించాం. ఇదే విషయంపై కేంద్రహోంశాఖకు, రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మేం చంద్రబాబు అవినీతిపై పోరాటం చేస్తున్నాం. 

ట్యాంపరింగ్‌తోనే గెలిచారా?
ఈవీఎంలతో ఏదో జరిగిపోతుందని చంద్రబాబు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కటే అడుగుతున్నా.. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్లతో మాపై గెలిచాడు. అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపర్‌ జరిగాయా? మేం అలా అనుకోవాలా? మొన్న నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా మూడింట్లో బీజేపీ ఓడిపోయింది. నిజంగా ట్యాంపరింగ్‌ అవకాశం ఉంటే అక్కడ బీజేపీ అధికారం చేజిక్కించుకోక పోవునా? ఎలాగు ఓడిపోతాం కదా అనీ చంద్రబాబు లాజిక్‌ లేకుండా మాట్లాడుతున్నారు’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. సీఈసీని కలిసిన వారిలో ఆయన వెంట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్‌లతో పాటు ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌ పార్టీ సీనియర్‌ నేతలు ఉన్నారు.

మరిన్ని వార్తలు