పోలీస్‌ బాసుల పచ్చచొక్కాలు విప్పుతాం : జగన్‌

25 Mar, 2019 13:04 IST|Sakshi

హోంగార్డులకు మెరుగైన జీతాలు అందజేస్తాం

పోలీసులకు వారానికి ఓ సెలవిస్తాం

పుట్‌పాత్‌ వ్యాపారులకు వడ్డీలేకుండా రూ.10 వేల రుణం..

ఆదోని బహిరంగ సభలో ఉద్యోగులపై వైఎస్‌ జగన్‌ వరాల జల్లు

సాక్షి, కర్నూలు(ఆదోని) : అధికారంలోకి రాగానే పోలీస్‌ బాసులకు చంద్రబాబు నాయుడు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఫుట్‌పాత్‌ వ్యాపారస్తులకు ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కిందిస్థాయి ఉద్యోగులు, హోంగార్డులకు మెరుగైన జీతాలతో పాటు.. వారానికో సెలవు ఇస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసం అంటూ ఉండదనీ, ఆయన జిమ్మిక్కులకు మోసపోవద్దని ప్రజలను కోరారు. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాయి ప్రసాద్‌రెడ్డి , కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

ఆదోని సమస్యలను విస్మరించారు..
‘ఆదోని నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. నాలుగు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి. ఐదేళ్లుగా నీళ్లు అడుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకర్‌ను దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కట్టించారు. ఇక్కడ తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఉంది. నాన్నగారి హయాంలో బైపాస్‌ రోడ్డు గురించి మూడు బిట్‌లు పూర్తి చేస్తే చంద్రబాబు మిగిలిన ఒక్క బిట్‌ను పట్టించుకోలేదు. ఆదోని రెవిన్యూ డివిజన్‌లో ఒక్క డిగ్రీ కాలేజ్‌ లేదు. ఉన్న ఎయిడెడ్‌ కాలేజీలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు చదువులు ఎండమావులుగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉండాల్సిన డాక్టర్లు 14 మంది. కానీ ఐదుగురు డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. లోలేవల్‌ కెనాల్‌ కింద భూములకు సాగునీరు అందడం లేదు. ఈ కెనాల్‌ పనులను ఆధునీకరించలేదు. మైనార్టీల సమస్యలను పరిష్కరించలేదు. వారికి ప్రార్థన స్థలాలు ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మిస్తే.. రెండు జిల్లాలోని 659 గ్రామాలకు తాగు నీటి దాహం తీర్చవచ్చు. ఐదేళ్లుగా ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్‌ను పట్టించుకోని చంద్రబాబు.. ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు.

చంద్రబాబు ప్రతి అడుగులో కనిపించేది వంచన, మోసం. సొంతమామకె వెన్నుపోటు పొడిచిన ఆయన.. ప్రజలను మోసం చేయడా? ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలేక.. రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు.  రైతుల దగ్గరేమో కేజీ రూ. 1 కూడా కొనరు. కానీ హెరిటేజ్‌లో మాత్రం కేజీ రూ. 23కు అమ్ముతున్నారు. దీన్నిబట్టి దళారీల వ్యవస్థ ఏ స్థాయికి పోయిందో చెప్పనవసరం లేదు. దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన వ్యక్తే వారితో జత కట్టారు. టమాట, పత్తి పరిస్థితి కూడా ఇదే. ఇటువంటి దారుణమైన స్థితి.. రాష్ట్రంలో ఉంది. ఇంతటి దారుణ పాలనలో నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను చూశాను. అతి దగ్గర నుంచి మీ బాధలు విన్నాను. మీ అందరితో మమేకమయ్యాను కాబట్టి .. మీ అందరికి నేనున్నాను.. అని హామీ ఇస్తున్నాను.

పుట్‌పాత్‌ వ్యాపారులకు రూ.10 వేల రుణం..
రాష్ట్రంలో 80 శాతం మందికి తెల్లకార్డులే ఉన్నాయి. అంటే అంతమంది దిగువ మద్యతరగతి కుటుంబాలు, పేదలనే అర్థం. ఖచ్చితమైన ఆదాయం లేక ఎలా బతుకాలో తెలియక జీవనం సాగిస్తున్నారు. వీరిని ఎలా బాగుపర్చాలనే ఆలోచనతోనే నా పాదయాత్ర సాగింది. కొందరి కష్టాలను చూసినప్పుడు గుండె తరక్కుపోయింది. పుట్‌పాత్‌లపై సరుకులు అమ్మకుంటున్న పరిస్థితులు.. తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్ముకోవడం చూశాను. రోడ్డు పక్కనే బండి.. ఆ బండిలో ఓ టీ షాప్‌.. ఆ టీ షాప్‌లో ఓ అక్క.. కాఫీ, దోసేలు అమ్ముకోవడం చూశాను. వీరంతా పెట్టుబడి కోసం రూ. 4 నుంచి రూ. 5 వడ్డీలకు అప్పులు తెచ్చుకొని బతుకుతున్న పరిస్థితులను తెలుసుకున్నాను. ఒక రోజు జ్వరం వచ్చి పడుకుంటే ఇళ్లు గడవని పరిస్థితి. రోడ్డు పక్కన పనిచేసుకుంటున్న చిరు వ్యాపారులందరికి చెబుతున్నా.. కులవృత్తి చేసుకున్నా సరే.. నాయి బ్రాహ్మణలైనా సరే.. చెప్పులు కుట్టుకునే వారైనా సరే.. మీ సమస్యలు కనిపిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకుంటే తీరుతాయని తెలిసినా.. చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. త్వరలోనే మీ కష్టాలు తీరుతాయని నేను భరోసా ఇస్తున్నాను. అధికారంలోకి రాగానే మీ అందరికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వాళ్లందరికి 10 వేల రూపాయిలు.. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. ఏ రోజు అవసరమైతే.. ఆ రోజు కార్డు చూపించి డబ్బులు తీసుకునేలా చేస్తాం. అధిక వడ్డీలకు తీసుకొని ఇబ్బంది పడుతున్న మీ అందరికి అండగా ఉంటాం.

అందుకే నవరత్నాలు.. 
పేదవాడి కష్టాలు, రైతుల సమస్యలు, పిల్లలను చదివించలేని పరిస్థితిని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను పాదయాత్రలో స్వయంగా చూశాను. వారందరికి మేలు చేసేలా.. నవరత్నాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇస్తున్నా. 27 శాతం ఐఆర్‌ ప్రకటిస్తాం. సకాలంలో పీర్సీ కూడా అమలు చేస్తాం. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి సర్వీసులను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేస్తాం. సమాన పనికి సమాన వేతం కావాలని కోరిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డిమాండ్‌ నెరవేరుస్తాం. ప్రతి జిల్లాలోను ప్రభుత్వ పెన్షనర్లుకు ఓ సెల్‌ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునేలా చేస్తాం. పోలీస్‌ బాసులకు.. చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలను విప్పుతాం. కిందస్థాయిలో పనిచేస్తున్న హోంగార్డులకు మెరుగైన జీతాలు ఇస్తాం. పోలీసులకు వారానికి ఓ సెలవు ఇస్తాం. దానికోసం పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉద్యోగస్థులందరికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. అంగన్‌వాడీ, ఆశవర్కర్లు, మధ్యాహ్నభోజన పథకంలో పనిచేస్తున్న అక్కాచెల్లమ్మలకు అందరికి చెబుతున్నా.. అందరికి అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను.

మీ మనవడు ఇస్తాడని చెప్పండి..
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు