అవి ఎప్పటికీ మర్చిపోలేను..

31 Mar, 2019 13:34 IST|Sakshi

ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు విన్నా

108 రాక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఆవేదన చూశా

ప్రతి పేదవాడికి నేనున్నాననే భరోసా ఇస్తున్నా

అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి నవరత్నాలను చేరుస్తా

గూడూరు బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, గూడూరు (నెల్లూరు జిల్లా) : ‘పాదయాత్రలో ప్రజలు నాతో చెపుకున్న బాధలు, నేను చూసిన వారి కష్టాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వరప్రసాద్‌, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. ప్రభుత్వ సాయం అందక ఇబ్బంది పడుతున్నా.. ప్రతి పేదవాడికి చెబుతున్నా.. మీ అందరికీ నేనన్నానే భరోసా ఇస్తున్నా. నిమ్మరైతుల ఆవేదనను నేను విన్నాను.. గిట్టుబాటు ధరలేక రైతులు పడ్డ కష్టాలు చూశాను. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నేను విన్నాను. ఈ జిల్లాలోనే జరిగిన అలాంటి సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సకాలంలో 108 రాక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆవేదన విన్నా.. పక్షపాతం వచ్చి ఆరోగ్య శ్రీ అందక వీల్‌చైర్‌లో వచ్చి నాతో చెప్పుకున్న బాధితుల పరిస్థితిని ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలను చదివించడం కోసం కూలీ పనులకు వెళ్తున్న అక్కాచెల్లెమ్మల బాధలు విన్నా. విభజన చట్టంలో దుగరాజుపట్నం పోర్టు నిర్మించాలని ఉన్నా.. కృష్ణ పట్నం పోర్ట్‌ చాలంటూ చెప్పడానికి చంద్రబాబు ఎవరన్నా? అని మీరు ప్రశ్నించిన మాటలు మర్చిపోను. రెండు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఎదురు చూసిన నిరుద్యోగులను చూశాను. కండలేరు నుంచి రూ.63 కోట్లతో నీళ్లిచ్చిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దే. ఆ పథకం కూడా సరిగ్గా నడపలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ప్రజలు చెప్పారు. గూడూరు-1, గూడూరు-2లను కలిపే ఫ్లై ఓవర్‌ నిర్మాణం అంగుళం కూడా కదల్లేదు. ఇలా మీ కష్టాన్ని చూశా.. మీ బాధలను విన్నా.. మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను.. మీ అందరికి నేనున్నానని భరోసా ఇస్తున్నాను. చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోని మోసం మోసం తప్పా మరొకటి కనిపించలేదు. రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ప్రతిరోజు ఒక మోసం.. ఒక కుట్ర. మరో 12 రోజుల్లో ఎన్నికల్లో జరుగబోతున్నాయి. ఈ కుట్రలు మరింత ఉదృతంగా తయారవుతాయి. రోజుకో డ్రామా చంద్రబాబు చూపిస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

రాజన్న రాజ్యాన్ని జగనన్నా పాలనలో చూస్తామని..
మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ 9 అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి.  ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పిండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ ఇస్తామని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

మరిన్ని వార్తలు