అలా జరిగితే టీడీపీకి డిపాజిట్లు రావు: వైఎస్‌ జగన్‌

4 Apr, 2019 19:58 IST|Sakshi

సాక్షి, హిందూపురం: అనంతపురం జిల్లాలో ఎప్పుడు జరగని విధంగా రెండు పార్లమెంట్‌ స్థానాలు బీసీలకే ఇవ్వడం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చజరగకుండా ఎల్లో మీడియా పక్కదారి పట్టిస్తోందని అన్నారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ రాకతో హిందూపురం జనసంద్రంగా మారింది. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘35 ఏళ్ల పాటు హిందూపురంలో టీడీపీకి ఓట్లు పడిన కూడా ఇక్కడి సమస్యలు తీర్చింది మాత్రం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే. హిందూపురం ప్రజలకు తాగునీరు అందించడం కోసం నాన్న గారి హయంలో 650 కోట్లు ఖర్చు చేశారు. నేడు హిందూపురం ప్రజలకు తాగునీరు అందుతుంది అంటే అది వైఎస్సార్‌ కృషి వల్లనే. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి తాగునీరు అందించడానికి వేసిన పైపులైన్ల పనులను పూర్తి చేయలేని అసమర్ధ పాలన టీడీపీది. హంద్రినీవా జలాల నుంచి 99 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి పనులు చేపట్టిన వైఎస్సార్‌ అప్పట్లోనే 90 శాతం పనులు పూర్తిచేశారు. మిగిలిన 10 శాతం  పనులు కూడా పూర్తి చేయలేని పాలన నేడు మనం చూస్తున్నాం. 

హిందూపురంకు చేసిందేమీ లేదు..
కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద ఇండస్ట్రీయల్‌ హబ్‌ పేరిట బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి ఒక షో చేశారు. వేల ఉద్యోగాలు వస్తాయంటూ శంకుస్థాపనలు చేశారు. కానీ ఒక్క పరిశ్రమైనా వచ్చిందా?. చివరకు ఆ భూముల్లో లే అవుట్‌ వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఇదే నియోజవకవర్గంలో ఉన్న నిజాం షుగర​ ప్యాక్టరీ అమ్మేసిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా?. 32 మంది డాక్టర్లు పనిచేయాల్సిన 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం పదిమంది కూడా పనిచేయడం లేదు. ఇదే ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులు ఉండాల్సింది కేవలం ఒక్కరే ఉన్నారు. 

హిందూపురానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ వచ్చినట్టు బోర్డులు వేశారు, పూజలు చేశారు. ఆ తర్వాత కాలేజ్‌ రాలేదు.. దాన్ని పట్టించుకున్నవారే లేకుండా పోయారు. చంద్రబాబు హామీ ఇచ్చిన ఉర్దు కళాశాల మీకేమైనా కనబడిందా?. రైతన్నలకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. మొదటి రకం చింతపండును 10వేల రూపాయలకు కూడా అమ్ముకోలేని స్థితిలో రైతన్న ఉన్నాడు. హిందూపురంను టీడీపీ నాయకులు అవసరానికి ఏవిధంగా వాడుకుని వదిలివేస్తున్నారో ఆలోచన చేయండి. 

చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందంటే..
చంద్రబాబు పాలనలో రైతన్నలను మోసం చేశారు. డ్వాక్రా సంఘాల అక్కాచెల్లమ్మలను మోసం చేశారు. చదువుకున్న పిల్లలను మోసం చేశారు. 60 నెలల పాలించమని ఓటేస్తే.. 57 నెలల పాటు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, ఎన్నికలకు మూడు నెలల ముందు కొత్త సినిమా చూపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. ఎన్నికల వారం రోజులు ముందు మీకు చెక్కులు వేస్తామని అంటున్న టీడీపీ నాయకులు.. ఈ ఐదేళ్లపాటు గాడిదల కాశారా?. 2014 ఎన్నికల్లో 650 పేజీల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ.. ప్రతి కులానికి ఒక్కో పేజీ కేటాయించింది. అందులో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి కులాన్ని మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసింది. ఇప్పడు ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందోనని వెతికితే.. కనీసం టీడీపీ వెబ్‌సైట్‌లో కూడా కనిపించడం లేదంటే వీళ్లు ప్రజలను ఎంత దారుణంగా మోసం చేశారో మీరు ఆలోచన చేయండి.

ఎల్లో మీడియా పుకార్లు సృష్టిస్తోంది..
ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. మనం యుధ్దం చేస్తుంది చంద్రబాబు నాయుడు ఒక్కడితోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా.  గత ఇరవై రోజులుగా చంద్రబాబు నాయుడు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఎల్లో మీడియా ఒక్క అబద్దం చెప్పి అది నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు పాలనపై చర్చ జరగకుండా చూస్తున్నారు. ప్రతి రోజు పుకారు సృష్టిస్తారు.. కట్టుకథలు అల్లుతారు. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తారు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే కనీసం డిపాజిట్లు కూడా రావు.

చివరి కుట్రగా డబ్బుల మూటలు పంపుతారు..
పోలింగ్‌కు ఇంకో వారం రోజులు మాత్రమే ఉన్నందున చివరి కుట్రగా చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. వారం రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఎంత పెద్ద  చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.  

గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. రాజన్న పాలనలో మాదిరి మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే అది జగనన్నతోనే సాధ్యం అని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని రైతన్నను అడగండి. రుణమాఫీ కనీసం వడ్డీలకైనా వచ్చిందా అని రైతన్నను అడగండి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. పింఛన్‌ మూడు వేలకు పెంచుకుంటూ పొతారని ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి. నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పిండి. నవరత్నాలను ప్రతి ఇంటి వద్దకు తీసుకువస్తామని హామీ ఇస్తున్నా. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్‌ను,  ఎంపీ అభ్యర్థి మాధవ్‌ను ఆశీర్వదించండి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని దీవించమ’ని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

>
మరిన్ని వార్తలు