జాబు కావాలంటే బాబు పోవాలి: వైఎస్‌ జగన్‌

20 Mar, 2019 12:03 IST|Sakshi

జనసంద్రంగా మారిన టంగుటూరు

జగన్‌ సీఎం అనే నినాదాలతో మా​ర్మోగిన సభా ప్రాంగణం

సాక్షి, కొండెపి(ప్రకాశం) : ‘జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మరీ బాబు వచ్చాడు జాబు వచ్చిందా? ఇప్పుడు జాబు కావాలంటే బాబు పోవాలి’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా  భారీగా తరలివచ్చిన ప్రజలకు వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే

ఒంగోలు ఎయిర్‌పోర్ట్‌ కనిపించిందా?
‘ఐదేళ్లు చంద్రబాబు పాలన చూశారు. మరో 20 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మీ అందరి గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించమని కోరుతున్నా. అధికారంలోకి రాక ముందే కాదు.. వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో స్వయంగా చంద్రబాబు ఈ జిల్లాకు ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయింది.. దొనకొండలో పారిశ్రామిక నగరం, చీమకుర్తిలో మైనింగ్‌ యునివర్సీటీ.. ఒంగోలులో ఎయిర్‌పోర్ట్‌.. కనిగిరిలో జాతీయ పెట్టుబడుల ఉత్తత్తుల జోన్‌, ఫుడ్‌ పార్క్‌, వినుగొండ ప్రాజెక్ట్‌ పూర్తి.. ఒంగోలు స్మార్ట్‌ సిటీ, ఉద్యానవన యూనివర్సిటీ.. ట్రిపుల్‌ ఐటీలన్నారు.. ఇవన్నీ మీకు కనిపించాయా? అని అడుగుతున్నా?

ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి చేశారా? ఇవన్నీ ఏం చేయకపోగా.. ఈ ఐదేళ్లలో చేసేంది ఏమిటంటే.. బాబు వచ్చాడు.. వెలిగొండ ప్రాజెక్ట్‌ మూలన పడింది. రుణాల మాఫీలేదు. వడ్డీ లేని రుణాలు లేవు. సాగు నీరు.. తాగు నీరు లేదు. బాబు వచ్చాడు.. ఆయనతో పాటు కరువు వచ్చింది. గిట్టుబాటు ధరలు లేవు. హెరిటేజ్‌ కోసం రాష్ట్ర రైతులను అమ్మేశాడు. పొగాకు ప్రతి ఏడాది ధర తగ్గుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద జగన్‌ వచ్చి ధర్నా చేస్తే తప్పా ధర పెరగని పరిస్థితి. బాబు వచ్చాడు.. ఫీజులు పెంచాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేశాడు. ఆస్తుల అమ్ముకుంటే కానీ చదువుకోలేని పరిస్థితి. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ కాలేదు. అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు.. ఎన్నికల ముందు మరోసారి పసుపు కుంకుమతో కొత్త సినిమా తీశాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలి. రైతు పశుగ్రాసం లేక పశువులను అమ్ముతున్నారు. కిడ్నీ రోగుల పరిస్థితి ఆగమ్య గోచరం అయింది. ఉపాధి అవకాశాలను చంద్రబాబు సర్వనాశం చేశాడు. మోసం చేసేవారు మీకు నాయకులుగా కావాలా? అని అడుగుతున్నా. ఐదేళ్లు అన్యాయం చేశారు. మోసం చేశారు. 

అన్న ముఖ్యమంత్రి అయితే...  
వచ్చే 20 రోజుల్లో బాబు చెప్పని అబద్ధం ఉండదు. చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బుల పంపిస్తారు. ఆ డబ్బులు ఇంటెలిజెన్స్‌, పోలీస్‌ అధికారులే పంచుతారు. ఓటును కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి.  

  •  ఎన్నికల నాటి వరకూ పొదుపు సంఘాల మహిళలకు ఎంత అప్పు ఉంటే అంత సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే ఇస్తాడని చెప్పండి.  
  •  సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే ఆ రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందామని, లక్షాధికారులం అవుదామని చెప్పండి.  
  •  45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద ప్రతి ఏటా రూ.75,000 నాలుగు దఫాల్లో ఇస్తాడని చెప్పండి.  
  •  పెట్టుబడి సాయం ప్రతి రైతన్నకు ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 ఇస్తాడని చెప్పండి. పెన్షన్‌ను రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి.

బాబుకు ఎల్లో మీడియా తానతందాన  
మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. చంద్రబాబుకు తానతందాన అనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన టీవీ చానళ్లన్నిటితోనూ..  వీళ్లంతా కలిసి ఎన్నికల దాకా ప్రజలకు రోజుకొక సినిమా చూపిస్తారు. ధర్మానికి అధర్మానికి జరగుతున్న ఎన్నికలివి. గుండెలపై చేయివేసుకొని ఆలోచించమని కోరుతున్నా. కొండెపి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ మాదాసి వెంకయ్య, ఒంగోలు ఎంపీ అభ్యర్థి  మాగుంట శ్రీనివాసుల రెడ్డిలకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు