అప్పుడే లేదు.. ఇప్పుడు పొత్తేంటి?: వైఎస్‌ జగన్‌

9 Apr, 2019 15:04 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ‘పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్‌ ఒక్కడిగానే వచ్చాడు.. ఎవరితోనూ పొత్తు పొట్టుకోలేదు. జగన్‌ దేవుడిని, ప్రజలను తప్ప ఎవరిని నమ్ముకోలేదు. 2014 ఎన్నికల్లో దేశం మొత్తం మోదీ ప్రభంజనం ఉందని తెలిసినా కూడా మనం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. అలాంటి ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి.. మోదీకి ఉన్న గ్లామర్‌ తగ్గిందని తెలిసి కూడా నేను ఎలా పొత్తు పెట్టుకుంటాను?. రాష్ట్ర విభజన సమయంలో మనకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని  పిల్లలకు న్యాయం చేయాలంటే ప్రత్యేక హోదా సాధించి తీరాలి. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, ఆస్పత్రులు వస్తాయి. ప్రతి జిల్లా హైదరాబాద్‌ అవుతుంది. కేంద్రంలో ఎవరు ప్రధాని అవుతారో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రధాని ఎవరైనా కానివ్వండి ప్రత్యేక హోదాకు సంతకం పెట్టినా తరువాతే నేను మద్దతిస్తాను. మోదీ అయినా, రాహుల్‌ అయినా హోదా ఇచ్చే వారికి మద్దతిస్తామ’ ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కర్నూలులో జరిగిన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌, కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌లను గెలించమని వైఎస్‌ జగన్‌ కోరారు.

చంద్రబాబు కుట్రలకు చివరి గడియలు..
ఇంకా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘3,648 కి.మీ నా పాదయాత్రలో మీ కష్టాలు చూశా.. మీ బాధలు విన్నా. రైతన్నలు పడుతున్న ఆవేదన చూశాను.. పేద ప్రజల గుండె చప్పుడు విన్నాను. మీ అందరికి నేనున్నాననే భరోసా ఇస్తున్నాను. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రతి ఇంటికి నవరత్నాలు తీసుకువస్తాం. చంద్రబాబు పాలనలో పేద పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ప్రలోభాలకు మీరు మోసపోవద్దు. చంద్రబాబు కుట్రలకు చివరి గడియాలు వచ్చాయి. చంద్రబాబు ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. రెండు రోజులు ఓపిక పట్టమని చెప్పండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అమ్మ ఒడి కింద అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఎంత పెద్ద  చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పింఛన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. చంద్రబాబుకు ఐదేళ్ల సమయం ఇచ్చాం కానీ.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. 

మీ మనువడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి..
గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల మహిళలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. రాజన్న పాలనలో మాదిరి మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే అది జగనన్నతోనే సాధ్యం అని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ ఐదేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని రైతన్నను అడగండి. రుణమాఫీ కనీసం వడ్డీలకైనా సరిపోయిందా రైతన్నను అడగండి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తామని చెప్పండి. మీ మనువడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి. పింఛన్‌ మూడు వేలకు పెంచుకుంటూ పొతారని ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి.

నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పిండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు రావాలి అంటే జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. మీ మనువడు ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్‌ మూడు వేలకు పెంచుతారని ప్రతి అవ్వకు, తాతకు చెప్పండి. టీడీపీ ప్రభుత్వం గ్రామానికి కనీసం పది ఇళ్లు కూడా కటించలేదు. టౌన్‌లలో ఇళ్లు కట్టించి అధిక రేటుకు పేదవారికి అమ్ముతున్నారు. ఆ ఫ్లాట్లకు 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు.  లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే.. ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా?. చంద్రబాబు ఇచ్చిన ఫ్లాటులను తీసుకున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 3లక్షల రూపాయలను మాఫీ చేస్తాం.రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత రావాలి. రాజకీయ నాయకులు చెప్పిన పని చేయకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ కూళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది.

నిరుద్యోగులకు వైఎస్‌ జగన్‌ భరోసా..
ప్రతి నిరుద్యోగికి లక్ష ఇరవై వేల రూపాయలు చంద్రబాబు ఎగ్గోట్టారని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా గ్రామ సెక్రటేరియట్‌ పేరిట ప్రతి గ్రామంలో చదువుకున్న 10 మందికి అక్కడే ఉద్యోగం ఇస్తాం. ప్రభుత్వ పథకాలకు, నవ రత్నాలకు సంబంధించి ఏ పని అయినా 72 గంటల్లో పూర్తి చేసేలా గ్రామ సచివాలయం పనిచేస్తుంది. గ్రామ సెక్రటేరియట్‌కు అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇస్తాం. వారికి గౌరవ వేతనం కింద 5000వేల రూపాయలు అందజేస్తాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యతలను వారే చూస్తారు. ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. నవరత్నాలకు చెందిన ప్రతి పథకాన్ని గ్రామ వాలంటీర్‌ డోర్‌ డెలివరీ చేస్తామని చెప్పండి. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెస్తాం. గవర్నమెంట్‌ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తామ’ని తెలిపారు.


 

>
మరిన్ని వార్తలు