బాబు వస్తే గవర్నమెంటు స్కూళ్లుండవ్‌: వైఎస్‌ జగన్‌

3 Apr, 2019 19:52 IST|Sakshi

సాక్షి, మైలవరం : మైలవరంలో దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం టీడీపీ హయాంలో బాగా పెరిగిపోయాయని వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసగించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఇదే మైలవరం నియోజకవర్గం నుంచి తన సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశానని గుర్తు చేశారు. ఇక్కడి పోలీసులు టీడీపీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు.

 స్థానిక డీఎస్పీ నాగేశ్వరరావు వైఎస్సార్‌సీపీ బహిరంగ సభలకు ఆటంకాలు కల్పిస్తున్నారని, సభ సజావుగా సాగకుండా ఉండేందుకు లారీలను రోడ్డుకు అడ్డంపెట్టి ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఇసుకను ఇక్కడి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఏవిధంగా దోచుకుంటున్నాడో ప్రజలు ఒక్కసారి గమనించాలన్నారు. ప్రభుత్వమేమో ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటుంది..కానీ లారీ ఇసుక మార్కెట్‌లో రూ.40 వేలకు అమ్ముతున్నారు.. ఇసుక మీకు ఉచితంగా ఇస్తున్నారా అని ప్రజల్ని ప్రశ్నించారు. 

పుష్కరాల ఘాట్లు ఏమయ్యాయ్‌
ఇదే నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల సమయంలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్లు, రోడ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనుమతి లేని కంకర క్వారీలు నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మైలవరంలో టీడీపీ నాయకులు మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవినేని ఉమ జలవనరుల శాఖా మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడి పంట పొలాలకు నీటి సౌకర్యం కల్పించలేని అసమర్ధుడన్నారు.

చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు ఏ మాత్రం నీళ్లు తీసుకురాగలిగాడని ప్రశ్నించారు. బుడమేరుపై తారకరామ ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు.  పోలవరం కుడి కాలువ పొడవు 174 కిలోమీటర్లు.. వైఎస్‌ హయాంలో 145 కిలోమీటర్లు పూర్తి చేశారు. చంద్రబాబు కేవలం రెండు కిలోమీటర్లు కాలువ తవ్వి అంతా మేమే పూర్తి చేశామని డబ్బా కొట్టుకుంటున్నాడు.. ఇలాంటి నాయకుల్ని ఏమనాలని ప్రశ్నించారు. మైలవరంలో ప్రజలు తాగునీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి ఉందన్నారు.

మామిడి రైతుకు దక్కని గిట్టుబాటు ధర
మామిడి రైతులకు బంగినపల్లి టన్ను రూ.35 వేల ధర ఉంటే కానీ గిట్టుబాటు కానీ పరిస్థితి ఉందని, కానీ ప్రస్తుతం టన్నుకు రూ.8 వేలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని అన్నారు. బాబు హయాంలో పంటలకు మద్ధతు ధర లభించే పరిస్థితి లేదన్నారు.

బాబు వస్తే గవర్నమెంటు స్కూళ్లుండవ్‌!
పొరపాటున మళ్లీ గనక బాబు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లు ఉండవన్నారు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ స్కూళ్లు అకారణంగా మూసేశారని ఆరోపించారు. స్కూళ్లలో టీచర్లను భర్తీ చేయరు..విద్యార్థులకు పుస్తకాలు అందించరు..మధ్యాహ్నా భోజన బిల్లులు సకాలంలో చెల్లించరు..బాబు పాలన ఈవిధంగా ఉందని ఎద్దేవా చేశారు. బాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు మూసేసి నారాయణ స్కూళ్లు తెరుస్తారని ఆరోపించారు. నారాయణ స్కూళ్లల్లో సంవత్సరానికి ఎల్‌కేజీ చదవాలంటే ప్రస్తుతం రూ.25 వేలు అవుతోందని, పొరపాటున బాబొస్తే ఫీజు లక్ష రూపాయలకు చేరుతుందని చెప్పారు. ఇంజనీరింగ్‌ చదవాలన్నా ప్రస్తుతం రూ.లక్ష అవుతోందని, బాబొస్తే గనక ఈసారి రూ.5 లక్షలకు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

చార్జీలు బాదుడే బాదుడు..
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఎలా పెంచాడో అందరికీ తెలుసునని, ఇంటిపన్నులు, కుళాయి పన్నులు, పెట్రోలు, డీజీల్‌ రేట్లు ఎలా పెరిగాయో అందరూ చూశారు..మళ్లీ గనక బాబొస్తే ఇక వీరబాదుడేనని వ్యాఖ్యానించారు.  బాబు అధికారంలోకి రాకముందు 46 లక్షల పెన్షన్‌ కార్డులు ఉండేవని, అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పెన్షన్‌ కార్డులు తొలగించాడని ఆరోపించారు. చంద్రబాబు భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని, ఆయన గనక మళ్లీ అధికారంలోకి వస్తే పేదల భూములకు రక్షణ ఉండదని అన్నారు.

గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను ఏర్పాటు చేశారని, ఊర్లో పేదలకు ఏమి ఇవ్వాలన్నా కూడా వారు మీది ఏపార్టీ అని అడుగుతారని అన్నారు. మీరు ఏ సినిమా, టీవీ, పత్రిక చూడాలో కూడా వారే నిర్ణయిస్తారని చెప్పారు. చంద్రబాబు ప్రధాన పాత్రలో ఈ నడుమ మహానాయకుడనే ఒక సినిమా వచ్చింది.. చాలా బాగుందట..అందరూ చూడాలట.. కానీ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మాత్రం చూడకూడదట.. పరిస్థితి ఇది.. మీరు ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదో వారే నిర్ణయిస్తారు.. ఒకసారి గమనించాలని కోరారు.

బాబు వస్తే ఉచిత విద్యుత్‌ ఉండదు

పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌కు బాబు మంగళం పాడతారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రూ.1000 పైన ఖర్చు అయ్యే ప్రతి జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. గ్రామానికి 10 ఇళ్లు కూడా బాబు హయాంలో నిర్మించలేదని తెలిపారు. జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తే గానీ పనులు కావటం లేదన్నారు.

బాబు గతాన్ని ఒక్కసారి పరిశీలించండి..

1994 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి రావడానికి సంపూర్ణ  మద్యనిషేదం, కిలో 2 రూపాయలకే బియ్యం పథకాలు పెట్టింది.. అధికారంలోకి రాగానే చంద్రబాబు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు.. కిలో బియ్యాన్ని 2 నుంచి ఐదున్నర రూపాయలకు పెంచాడు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు. మాట తప్పడం చంద్రబాబు నైజమని ప్రజలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలని కోరారు. బాబు  గనక పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే తనను వ్యతిరేకించే ఎవ్వరినీ బతకనీయడని ఆరోపించారు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు నచ్చిన పోలీసులను పెట్టుకుని, సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను ఏపీలోకి రానీయకుండా జీవోలు జారీ చేశాడని చెప్పారు.

మనుషుల్ని చంపించి వాళ్ల బంధువులే చంపారని చిత్రీకరిస్తాడని, టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ అరాచకాలను చూయించవని వెల్లడించారు. బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారని కొలీజియానికి చంద్రబాబు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో నెరవేర్చకపోతే రాజీనామా చేసే పరిస్థితికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. 20 రోజులుగా చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ9, టీవీ5 ఛానళ్లు రోజుకొక పుకారు పుట్టించి చర్చ జరుపుతున్నాయని అన్నారు. 

డబ్బుల మూటలతో వస్తారు.. జాగ్రత్త
ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రతిగ్రామానికి డబ్బుల మూటలతో వస్తారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల మహిళల రుణాలన్నీ నాలుగు దఫాల్లో పూర్తిగా చెల్లిస్తామన్నారు. అలాగే సున్నావడ్డీకే మళ్లీ రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది మే నెలలో రూ.12,500 పెట్టుబడి సహాయం అందిస్తామని వెల్లడించారు.

45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చెల్లిస్తామన్నారు.  పిల్లలను బడులకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15వేలు అందిస్తామని చెప్పారు. అవ్వా, తాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. మైలవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌, విజయవాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్‌లను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు