వ్యాపార ఆరాటం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

3 Oct, 2018 18:40 IST|Sakshi

సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెందిన వ్యక్తుల వ్యాపారాలు బాగుపడటానికి జరుగుతున్న ఆరాటమే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నెల్లిమర్లలోని మొయిదా జంక్షన్‌లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌  ఈ నియోజకవర్గంలో కట్టాలని ప్రజాపతినిధులు నిర్ణయం తీసుకుంటే మంచిదే అనుకున్నామని అన్నారు. కానీ మంత్రుల, ఎంపీల భూములు ముట్టుకోకుండా ప్రజల భూములు అన్యాయంగా లాక్కోవడం న్యాయమా అని ప్రశ్నించారు.  రైతుల భూముల లాక్కోని.. వాళ్ల భూములకు రెట్లు పెంచుకున్నారని మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ వాటా ఇచ్చి మేలు చేస్తామని టెండర్లలో పాల్గొంటే.. వారికి కాంట్రాక్టు ఇస్తే చంద్రబాబుకు లంచాలు రావని టెండర్లను రద్దు చేశారు. రెండోసారి టెండర్లు పిలిచినప్పుడు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వాళ్లు ఎక్కడ వస్తారనే భయంతో నిబంధనలు మార్చిన ఘనత ఈ చంద్రబాబు దిక్కుమాలిన ప్రభుత్వానిది. దేశంలో 130కి పైగా ఎయిర్‌పోర్ట్‌లు ఉంటే అందులో 126 ఎయిర్‌పోర్ట్‌లను ఆ సంస్థే నిర్వహిస్తుందన్నారు. అటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనను పక్కనపెట్టారంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.  ఈ అవినీతిలో గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఇదే జిల్లాకు చెందిన ఆశోక గజపతిరాజు పేరు వినిపిస్తుంది. ఆయన మంత్రిత్వ శాఖలో చంద్రబాబు నాయుడు బరితెగించి అవినీతి చేస్తోంటే నిలదీయాల్సిన మంత్రి ఆయన తాన అంటే తందానా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు వెన్నపోటు పోడిసిన సమయంలో ఆయనకు బాకులా ఈయన పనిచేశారు. నాలుగున్నర ఏళ్లు బీజేపీతో కాపురం చేసిన ఈ మంత్రి క్యాబినేట్‌ మీటింగ్‌లలో కూర్చుంటాడు కానీ రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా గురించి అడగడానికి మాటలు రావు. ఇలాంటి మంత్రి ఈ జిల్లాలో ఉన్నాడంటే ప్రజలు బాధ పడుతున్నార’ని తెలిపారు.

ఊరికి మూడు నాలుగు ఇళ్లు కూడా కట్టించలేదు
ఇంకా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజయనగరం జిల్లాలో 23 వేల ఇళ్లు కట్టిస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా ఊరికి మూడు, నాలుగు ఇళ్లు కట్టించలేదని మండిపడ్డారు. జూట్‌ మిల్లు పేరిట భూములు లీజ్‌కు తీసుకున్నావారు.. నేడు ఆ భూముల తమవేనని అంటు ప్రజలపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. జిల్లాలో 49 గ్రామాలకు చెందిన 8వేల ఎకరాలను స్థీరికరించి, 24,710 ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందజేయాలనే లక్ష్యంతో దివంగత నేత రామతీర్థ సాగర్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. చంపావతిపై బ్యారేజ్‌ కట్టి అక్కడి నుంచి డైవర్షన్‌ కెనాల్‌ తీసుకుని కుమిలి రిజర్వాయర్‌ కెపాసిటి పెంచి ఈ ప్రాజెక్టుకు 220 కోట్లతో పనులు ప్రారంభించారని తెలిపారు. యుద్దప్రతిపాదికన 30 శాతం పనులు పూర్తిచేస్తే.. అయిన చనిపోయిన తర్వాత దానిని పట్టించుకున్నవారు లేరని..నేడు ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగం కోసం నాలుగేన్నరేళ్లు పడుతుందంటే చంద్రబాబు నిర్లక్ష్యం ఏపాటిదో అర్ధమవుతోందని తెలిపారు. 

హుద్‌హుద్‌ బాధితులకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదు
వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘హుద్‌హుద్‌ తుపాన్‌ వచ్చినప్పడు జిల్లాలో12వేల ఇళ్లు ధ్వంసం అయిన ఈ ప్రభుత్వం తిరిగి ఒక ఇళ్లు కూడా కట్టించలేదు. చంద్రబాబు హయాంలో పాలనలో అభివృద్ధి సాగడం లేదు కానీ.. నియోజకవర్గంలోని ఆస్తులను మాత్రం దోచేస్తున్నారు. చంపావతిలో ఇసుకను ప్రోక్లయిన్లు పెట్టి ఇసుకను దోచుకుంటున్నారు. ఇక్కడి ఇసుకను 30వేల రూపాయలకు వైజాగ్‌లో అమ్ముకుంటుంటే చంద్రబాబు ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఇసుక ఎవరికి ఉచితంగా రావడం లేదు. చంద్రబాబు బినామీలకు మాత్రం ఉచితంగా వస్తుంది. అధికారులు, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు.. అవి చిన్నబాబు దగ్గరకు చేరుతున్నాయి. ఆతర్వాత పెదబాబుకు దగ్గరకు కూడా లంచాలు చేరేలా వ్యవస్థ దిగజారిపోయింద’ని మండిపడ్డారు.

హెరిటేజ్‌లో అరలీటర్‌ పాలు 26 రూపాయలు
‘వేరుసెనగ రైతుకు క్వింటాల్‌కు 3వేల అందదు కానీ.. హెరిటేజ్‌లో మాత్రం కేజీ 100 రూపాయలకు అమ్ముతారు. రైతు దగ్గర నుంచి లీటర్‌ పాలు 26 రూపాయలకు కొనుగోలు చేసి.. అందులో నుంచి వెన్న తీసేసి హెరిటేజ్‌లో అరలీటర్‌ 26 రూపాయలకు అమ్ముతున్నారు. తన హెరిటేజ్‌ కోసం రైతన్నల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. తక్కువ ధరకు రైతుల దగ్గర కొనుగోలు చేసి.. వాటిని ప్యాక్‌చేసి అంతకు మూడు నాలుగు రెట్లకు అమ్ముతున్నారు. జిల్లాలోని పూసపాటివేలం మండలం కొవ్వాడలో దళితుల భూముల లాక్కొని ఎమ్మెల్యే బంధువులకు చెందిన అనామక కంపెనీకి భూములు ఇప్పించుకున్నారు. ఆ దళితులు తమ భూముల కోసం హైకోర్టు వెళ్లి స్టే తెచ్చుకున్న కనికరించడం లేద’ని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

వడ్డీలో నాలుగోవంతు కూడా చెల్లించలేదు
ఇంకా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘రైతులకు ఎన్నికల ముందు రుణమాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉంటే రైతుల వడ్డీలో నాలుగోవంతు కూడా మాఫీ కాలేదు. రైతులకు గతంలో సున్న వడ్డీకి రుణాలు వచ్చేవి. నేడు బ్యాంక్‌లు వారినుంచి ముక్కుపిండి వడ్డీ ​లు వసూలు చేసేలా ఈ వ్యవస్థ దిగజారింది. పొదుపు సంఘాల అక్కచెల్లళ్లకు మాఫీ సంగతి పక్కన బెడితే సున్న వడ్డీ కాస్త ఒకటి, రెండు రూపాయల ఆపరాధ రుసుము చెల్లించే పరిస్థితి వచ్చింద’ని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రతి ఇంటికి లక్ష 8 వేలు బాకీపడ్డారు
‘జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఇవ్వకపోతే 2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారు. కానీ అలా జరగలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 54 నెలలు అయినప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఈ లెక్కన చంద్రబాబు ప్రతి ఇంటికి లక్ష 8 వేలు బాకీపడ్డారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని నిరుద్యోగ భృతి పేరిట డ్రామాకు తెరదీశారు. రెండువేల రూపాయలను వెయ్యికు తగ్గించారు. రాష్ట్రంలోని కోటి 70 లక్షల ఇళ్లు పది లక్షలకు వచ్చాయి.. తర్వాత మాత్రం 2 లక్షల పదిహేను వేల మందిని మాత్రమే నిరుద్యోగ భృతికి ఎంపిక చేశారు. వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతికి 21 కోట్ల 50 లక్షల ఖర్చు అవుతుంటే ప్రచార యావతో ఎల్లో మీడియాకు 6 కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. పిల్లల జీవితాలతో స్కామ్‌లు చేస్తున్నారు. ఒక్క విద్యార్థికి ట్రైనింగ్‌ పేరిట 12వేల రూపాయలు దోచుకుంటున్నారు. ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాలు వస్తాయంటే వెన్నుపోటు పోడిచి హోదాను నీరుగార్చారు. రాష్ట్రం విడిపోయినప్పడు లక్ష 42 వేల ఉద్యోగాలు ఉన్నాయని లెక్కలు తెలిస్తే.. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ట్రైనింగ్‌ల పేరిట దోచుకుంటున్నార’ని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఏ ఒక్కరికి ఉద్యోగ భద్రత లేదు
‘చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జూట్‌ మిల్స్‌, స్పిన్నింగ్‌ మిల్స్‌, చక్కెర పరిశ్రమలు ఇలా ప్రతిదీ నష్టాల్లోకి వెళ్లాయి. అందులో కొన్ని మూతపడుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, జేఎన్‌టీయూ లెక్చరర్స్‌, అర్బన్‌ ఏఎన్‌ఎంలు, సెకండ్‌ ఏఎన్‌ఎంలు, మోడల్‌ స్కూల్‌ టీచర్లు, విద్యుత్‌ రంగ కార్మికులు, గోపాల మిత్రల, ఆయూష్‌ ఉద్యోగుల, అంగన్‌వాడీల ఇలా ప్రతి ఒక్కరి ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండా పోయింది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న 85 వేల అక్కచెల్లెళ్లకు అండగా ఉండాల్సిందిపోయి.. జీతాలు ఇవ్వకుండా ఆ పథకాన్ని నీరుగారుస్తున్నారు. నాసిరకం బియ్యం, గుడ్లు సరఫరా చేస్తూ.. వాటికి బిల్లులు చెల్లించకుండా నాటకాలు ఆడుతున్నారు. ఈ పథకాన్ని కూడా తన బినామీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను రేషనలైజ్‌ పేరిట మూసివేస్తున్నారు. 20వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నా భర్తీ చేయరు. పై చదువులకు ఫీజులు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లేదు. రేషన్‌ షాప్‌కు వెళ్తే బియ్యం తప్ప ఏమి ఇవ్వడం లేదు. అందులోనూ కటింగ్‌లు పెడుతున్నారు. జగన్‌ మాట్లాడం వల్ల.. మరో కొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నందుకు కొన్ని షాప్‌ల్లో కొంతైనా రేషన్‌ ఇస్తున్నారు. ఏపీకి వరప్రసాదం అయిన పోలవరం ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. పునాది గోడలు దాటి ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసిన అవినీతి మాత్రమే కనిపిస్తోంది. చివరకు దళితుల భూములు, దేవాలయాల భూముల కూడా వదలడం లేద’ని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

2024వరకు మద్యం లేకుండా చేస్తా
‘నవరత్నాలతో పాటు మరో నాలుగు హామీలు ఇస్తున్నా.. గ్రామల్లో తాగాడానికి మినరల్‌ వాటర్‌ ఉండదు కానీ ఊర్లో నాలుగైదు మందు షాపులు ఉంటాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2024 ఎన్నికల వరకు మందు లేకుండా చేసి ఓట్లు అడుగుతాను. కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో తప్ప మరెక్కడ మందు దొరకకుండా చేస్తాను. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రతి ఏట 75వేల రూపాయలు అందజేస్తాం.  సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టించి వారికి తోడుగా ఉంటాను. సంక్షేమ పథకాలు అందని వారికి 72 గంటల్లో అందేలా చేస్తామ’ని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు