రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తా : వైఎస్‌ జగన్‌

24 Mar, 2019 13:48 IST|Sakshi

వ్యవసాయ పండుగ చేస్తాం

చంద్రబాబు పాలనలో రైతులకు మిగిలింది దుఃఖమే 

పాదయాత్రలో రైతుల బాధలు.. కష్టాలు చూశా

రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

పెట్టుబడి సాయం కింద మొత్తం 50 వేలు ఇస్తాం

ఆ‍క్వా రైతులకు యూనిట్‌ కరెంట్‌ రూ.1.50కే అందిస్తాం

రేపల్లె బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, రేపల్లే(గంటూరు జిల్లా) : అధికారంలోకి రాగానే రాష్ట్రంలో వ్యవసాయం పండగ చేస్తామని, ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా రేపల్లేలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రైతన్న బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రైతన్న కన్నీరు పెడితే అరిష్టమని తాను నమ్ముతానని తెలిపారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని  వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేయని మోసం అంటూ ఉండదనీ, ఆయన జిమ్మిక్కులకు మోసపోవద్దని ప్రజలను కోరారు. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోపిదేవి వెంకట రమణారావు ,బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్‌ బాబులను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘గతంలో రెండు పంటలు పండే ఈ ప్రాంతంలో పంటల విరామం ప్రకటించే అధ్వాన్నమైన స్థితి నెలకొంది. సాగుకు నీరు కూడా అందడం లేదు. ఐదేళ్లుగా మరో లిఫ్ట్‌లు ఇవ్వమన్నా పట్టించుకోలేదు. నిజాంపట్నం హార్భర్‌ అభివృద్ధికి నోచుకోలేదు. సరైన రోడ్డు కూడా లేదు. మత్సకారులకు సబ్సిడీ అందడం లేదు. వేట నిషేద సమయంలో సరిగ్గా రూ.4 వేలు కూడా ఇవ్వడం లేదు. ఇదే రేపల్లెలో 18వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆక్వారైతులు పూర్తిగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయానికి దళారులు ఏకమై రైతులను దోచేస్తున్నారు.

రైతన్న ఆకలితో అలమటించడం చూశా..
3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. ఆ యాత్రలో రైతన్న బాధలను విన్నాను. కష్టాలను స్వయంగా చూశాను. నా సుదీర్ఘ పాదయాత్రలో అ‍న్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటించడం చూశా. ఈ ప్రభుత్వంలో రైతుకు మిగిలేది కష్టం.. రైతుకు మిగిలేది నష్టం అన్నట్లుగా తయారైంది. చంద్రబాబు పాలనలో రైతులకు దుఃఖమే మిగిలింది. వ్యవసాయ రుణమాఫీ అంటూ మోసం చేశారు కాబట్టే.. రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు..  ఇప్పుడు వడ్డీలతో కలిసి రూ. లక్షా 50 వేల కోట్లకు చేరాయి. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. ప్రతి గ్రామంలో రైతుల భూములు కొట్టేసేందుకు మాఫియా తయారు చేశారు. భూములు దోచేసేందుకు భూ సేకరణ చట్టాన్ని సవరణ చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క పంటకు కూడా గిట్టు బాటు ధర రాలేదు. రైతన్నలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి దళారీలకు కెప్టెన్‌గా మారి హెరిటేజ్‌ కోసం ధరలను పతనం చేశారు. మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నానే భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో వ్యవసాయం పండగ చేస్తాం. ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు చూస్తాం.

అధికారంలో వచ్చిన తర్వాత పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. ప్రతి ఏడాది మే నెలలోనే రూ.12500 నేరుగా రైతుల చేతుల్లో పెడ్తాం. రైతులు కట్టాల్సిన పంట బీమా పూర్తిగా మేమే కడతాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం. పగటిపూటే 9 గంటలు కరెంట్‌ ఇస్తాం. ఆక్వా రైతులకు రూ.1.50కే కరెంట్‌ ఇస్తాం. పంట వేసే ముందే ఎంతకు కొంటామనేది చెబుతాం. రైతుకు పూర్తిగా అండగా ఉంటాం. ప్రతిమండలంలో కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేస్తాం. సహకార రంగాన్ని పునరుద్దరిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌, టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం. అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రతి రైతు కుటుంబానికి అండగా ఉంటాం. దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ కలగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. చెరువులను పునరుద్దరిస్తాం, జలకళ మళ్లీ తెస్తాం.

రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని..
అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటాను. మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి.  ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని తెలపండి. లక్షాధికారులను చేస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తామని చెప్పిండి. అవ్వా,తాతలకు మూడు వేల ఫించన్‌ ఇస్తామని, రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

మరిన్ని వార్తలు