ఒక్క అవకాశం ఇవ్వండి 

9 Apr, 2019 17:50 IST|Sakshi
గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బహిరంగ సభకు పోటెత్తిన జనసంద్రంలో ఓ భాగం. పార్టీ గుర్తు ఫ్యాన్‌ను చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

ప్రత్యేక హోదా త్వరగా రావాలని తిరుమల వెంకన్నను కోరుకుంటున్నా

వైఎస్సార్‌ పాలనలో ప్రతి కుటుంబానికి భరోసా ఉండేది

స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారు

పక్కరాష్ట్రం వాళ్లు మద్దతిస్తానంటే విమర్శిస్తున్నారు

మార్పు కోసం ఓటేయ్యండి

తిరుపతి సభలో వైఎస్‌ జగన్‌

నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చేనేత కార్మికులను ఆదుకుంటా. చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 ఇస్తా. 2004లో నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అవకాశం ఇచ్చారు. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నాన్న కంటే గొప్ప పరిపాలన అందిస్తా.

చంద్రబాబు పార్టనర్‌ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో బాబు కానీ, ఆయన కుమారుడు కానీ ప్రచారానికి వెళ్లరు. అలాగే చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం, ఆయన కుమారుడు లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆ పార్టనర్‌ ప్రచారానికి రాడు. వీళ్లవి వేరువేరు పార్టీలా? ఒకే పార్టీనా?

సాక్షి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, కర్నూలు/సాక్షి, తిరుపతి:  వ్యవస్థలో మార్పు కోసం నితీ, నిజాయతీకి పట్టం కట్టాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందించిన పాలన కంటే మరింత గొప్ప పరిపాలన అందిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల దుష్ట పరిపాలనకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాను ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశాను తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. దేవుడిని, ప్రజలను తప్ప ఇంకెవరినీ నమ్ముకోలేదని తేల్చిచెప్పారు. 2014 ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం ఉందని తెలిసినా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదని అన్నారు. ఈరోజు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి, మోదీకి అప్పుడున్న గ్లామర్‌ ఇప్పుడు లేదని తెలిసి తాను ఆయనతో ఎందుకు పొత్తు పెట్టుకుంటానని ప్రశ్నించారు. జగన్‌ మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణం, చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతటా ప్రజలు నిర్ణయించుకున్నట్టే, లోకేశ్‌ను ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే...   

హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా? 
మంగళగిరి సభలో..
ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను దగా చేశాడు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా?  2014 మార్చి 2న రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రణాళికా సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్‌ 31 వరకూ ప్రణాళికా సంఘం అమల్లో ఉంది. జూన్‌లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయండి అని కోరుతూ డిసెంబర్‌ 31 దాకా ప్రణాళికా సంఘానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. 2016 సెప్టెంబర్‌ 8న అర్ధరాత్రి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, ప్యాకేజీ కావాలని చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. లేని ప్యాకేజీ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీ, శాసన మండలిలో రెండుసార్లు తీర్మానం చేశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్రతిఏటా కేవలం రూ.3,500 కోట్లు ఇస్తే చాలంటూ కేంద్రానికి లేఖ రాశాడు. 2017 జనవరి 27న ప్యాకేజీ ఇచ్చిన నాలుగు నెలల తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడాడు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి పదేళ్లు హైదరాబాద్‌పై ఉన్న హక్కును వదిలేసి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా?  రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? రాజధాని నిర్మించకముందే స్విస్‌ చాలెంజ్‌ అంటూ సింగపూర్‌ కంపెనీలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని 1,700 ఎకరాల భూములను రియల్‌ ఎస్టేట్‌కు ఇచ్చింది చంద్రబాబు కాదా? ఆత్మగౌరవమంటూ మాట్లాడే పార్టనర్, ఎల్లో మీడియా చంద్రబాబు దుర్మార్గాన్ని ఎందుకు ప్రశ్నించరు.   

కుంభకోణాలన్నీ ఇక్కడే..: కుంభకోణాలన్నీ మంగళరిలోనే చోటు చేసుకున్నాయి. హాయ్‌ల్యాండ్‌ కుంభకోణం,  సదావర్తి భూముల భూకుంభకోణం ఒక్కడే జరిగాయి.  రైతులు భూములు ఇవ్వనందుకు అరటి తోటలను తగలబెట్టించింది ఇక్కడే.  చంద్రబాబు అక్రమ నివాసం ఇక్కడే. చేనేత కార్మికులను వంచించింది కూడా ఇక్కడే. రిషితేశ్వరిని చంపింది ఇక్కడే. స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నది ఇక్కడే. ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్‌లు ఇవ్వలేదు కానీ ఇదే భూమిని చంద్రబాబు తనకు కావాల్సిన కంపెనీలకు లంచాలకు అమ్ముకున్నది ఇక్కడే.  చంద్రబాబు, నారా లోకేశ్‌ ఏ రోజూ మంగళగిరిలో తిరిగిన దాఖలాలు లేవు. ఆర్కేకు ఓటేస్తే మీ ఆస్తులను రక్షిస్తాడు. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు.  ఆర్కేకు ఓటేసి గెలిపిస్తే నా కేబినెట్లో మంత్రిగా ఉంటాడు. ఎల్లో మీడియా చానళ్లలో మైకులు పట్టుకుని ప్రచారం చేసినంత మాత్రాన చంద్రబాబు చేసిన మోసాలు, వంచనలు, అరాచకాలు మంచి పనులు అయిపోతాయా?   

ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000..: ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ ఒక్కో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచుతోంది. చంద్రబాబు పంచుతున్న డబ్బులకు మోసపోవద్దు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చేనేత కార్మికులను ఆదుకుంటా. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 ఇస్తా. ఆ డబ్బు కోసం మీరు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. 2004లో నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అవకాశం ఇచ్చారు. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నాన్న కంటే గొప్ప పరిపాలన అందిస్తా. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా నుంచి ఇవ్వబోయే మొట్టమొదటి ఎమ్మెల్సీ పదవిని చేనేత కార్మికుడికే ఇస్తాను. చేనేత కార్మికులకు సముచిత స్థానం కల్పిస్తా.  

గత తొమ్మిదేళ్లుగా నన్ను చూస్తున్నారు. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోనే ఉన్నాను. ఏ పేదవాడికి ఏ అవసరం వచ్చినా ఈ జగన్‌ అక్కడున్నాడు. నాయకుడంటే ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగురవేసుకుని మా నాయకుడని చెప్పుకునేలా ఉండాలి. ఆ గుణాలు ప్రస్తుత పాలకులకు లేవు. అందుకే మార్పు కోసం ఓటెయ్యండి.

‘హోదా’కు అద్దె నేతలు మద్దతిచ్చారా?
తిరుపతి సభలో..
రాష్ట్రానికి జీవనాడిలాంటి ప్రత్యేక హోదా సత్వరం వచ్చేలా తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోరుతున్నా. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం, అవినీతి, అబద్ధం, అన్యాయం, అధర్మం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బూచిగా చూపిస్తూ ఎల్లో మీడియా అసత్య ప్రచారానికి దిగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పూర్తిగా మద్దతిస్తానని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం మద్దతిస్తానంటే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ, చంద్రబాబుకు కేసీఆర్‌ అంటే ఇష్టం లేక విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు చాలామంది అద్దె నేతలను తీసుకొచ్చాడు. వారిలో ఒక్కరైనా ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారా? హోదా విషయంలో ఏపీకి తోడుగా ఉంటామని ఒక్క నేతతోనైనా చెప్పించగలిగారా?   


నాయకుడు ఎలా ఉండాలంటే..: కుట్రలు ఈ రెండు రోజుల్లో తారస్థాయికి చేరుతాయి. దొంగ వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తారు. విజయసాయిరెడ్డి మాట్లాడకపోయినా మాట్లాడినట్లు చూపించారు. చాణక్య సర్వే అన్నారు. వారేమో మాకు సంబంధం లేదంటారు. గర్భిణిపై దాడి చేశారట. బుద్ధి ఉన్నోడు ఎవడైనా గర్భిణిపై దాడి చేస్తాడా? నేను తిరుపతికి చెప్పులు వేసుకొచ్చానని చంద్రబాబు పార్టనర్‌ అసత్య ప్రచారం చేశాడు. నేను 3,500 మెట్లు కాలినడకన వెళ్తే, ఆ పార్టనర్‌ బూట్లు వేసుకొని కొండపైకి వెళ్లాడు. గత తొమ్మిదేళ్లుగా నన్ను చూస్తున్నారు. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోనే ఉన్నాను. ఏ పేదవాడికి ఏ అవసరం వచ్చినా ఈ జగన్‌ అక్కడున్నాడు. నాయకుడంటే ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగురవేసుకుని మా నాయకుడని చెప్పుకునేలా ఉండాలి. ఆ గుణాలు ప్రస్తుత పాలకులకు లేవు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికీ భరోసా ఉండేది. చంద్రబాబు హయాంలో మోసం, దగా తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. హామీల విషయంలో మోసం చేశాడు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతాం. మరో 36 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల రోజు నాటికి కుట్రలు, కుతంత్రాలు తారస్థాయికి చేరుతాయి. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికీ చెప్పండి. వైఎస్సార్‌సీపీని గెలిపించుకుని, సంక్షేమ పాలన తెచ్చుకుందామని ప్రతి ఒక్కరికీ చెప్పండి. 

మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా. కేంద్రంలో ప్రధానమంత్రిగా ఎవరైనా కానివ్వండి, రాష్ట్రంలో మాత్రం మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడని మర్చిపోవద్దు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలి కాబట్టి కేంద్రంలో ఎవరైనా ఫర్వాలేదనే నినాదం తీసుకున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా.

జగన్‌ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు అని ఎవరైనా చెబుతారు. చంద్రబాబు ఇల్లు ఎక్కడ అని అడిగితే హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కట్టుకున్నాడని అంటారు. రాష్ట్రంలో సొంత ఇంటిలో ఉంటోంది ఎవరు? అద్దె ఇంటిలో ఉంటోంది ఎవరు?

3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులు, పేదల కష్టాలు, బాధలను చూశా. వారి ఆవేదన విన్నాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ప్రతి ఇంటికీ నవరత్నాలను చేరుస్తా. ఐదేళ్ల దుష్ట పరిపాలనకు ముగింపు పలికే సమయం వచ్చేసింది.

మాపై ఇంత దుష్ప్రచారమా? 
కర్నూలు సభలో..
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నుతున్నాడో ప్రజలకు తెలుసు. కుట్రలో భాగంగా మనపై దుష్ప్రచారం చేస్తున్నాడు. ప్రతి మైనారిటీ సోదరుడికీ చెబుతున్నా. వైఎస్సార్‌సీపీ పుట్టినప్పటి నుంచి నేటి వరకూ జగన్‌ అనే వ్యక్తి ఒక్కడిగానే వచ్చాడు తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. జగన్‌ దేవుడిని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడు. అంతే తప్ప ఇంకెవరినీ నమ్ముకోలేదు. 2014 ఎన్నికలకు ముందే దేశమంతటా నరేంద్ర మోదీ ప్రభంజనం ఉందని తెలిసినా కూడా మనం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. ఈరోజు మన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి, మోదీకి అప్పుడు ఉన్న గ్లామర్‌ ఇప్పుడు లేదని తెలిసి నేను ఆయనతో పొత్తు పెట్టుకుంటానా? 

నేను ఈ అడుగులు వేయకపోతే..: చదువులు పూర్తి చేసుకున్న మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు రాక ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. వారికి న్యాయం జరగాలంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలి. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎవరికీ తెలియదు. మోదీ కావొచ్చు, రాహుల్‌గాంధీ కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు. ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, మాకు అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే మనం వారికి మద్దతు ఇస్తామని ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. నేను ఈ అడుగులు వేయకపోతే మనకు ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. రాష్ట్రానికి హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుంది. రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి, దాన్ని ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. నీతికి, నిజాయతీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.   

దుర్యోధనుడు ఏం చేసినా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపించింది. అధికార మదంతో దుర్యోధనుడు చేసిన ప్రతి పనినీ పొగిడిన వారిని దుష్ట చతుష్టయం అంటాం. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ ఓడిపోతున్నా, నిజాన్ని దాచిపెట్టి గెలుస్తున్నాడని జర్మన్‌ రేడియోలో ప్రచారం చేసేవాడు ఆయన మంత్రి గోబెల్స్‌. దుష్ట చతుష్టయాన్ని చూసినా, హిట్లర్‌ కొలువులోని మంత్రి గోబెల్స్‌ పేరు విన్నా మన రాష్ట్రంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, టీవీ9లు గుర్తొస్తాయి. చంద్రబాబు చేసిన మోసాలకు ఓటమి ఖాయమని తేలినా ప్రజలను నమ్మించడానికి బాకా ఊదుతున్న గోబెల్స్‌ కుట్రలను ప్రతి ఒక్కరూ గమనించాలి.


లోకేశ్‌ ఎమ్మెల్యే అయితే రైతులకు కష్టాలే 
మంగళగిరి నియోజకవర్గంలో లోకల్‌ హీరో ఆళ్ల రామకృష్ణారెడ్డి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన గురించి మీకు తెలుసు. తన పొలంలో తానే నాట్లు వేస్తాడు, పంటలు పండిస్తాడు. చాలా సామాన్యంగా ఉంటాడు. రైతులకు కష్టమొస్తే న్యాయం కోసం కోర్టులకు వెళ్తాడు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసినా ఆయన చెక్కు చెదరలేదు. ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. టీడీపీ నుంచి బరిలో ఉన్న నారా లోకేశ్‌ ఇక్కడి నేల మీద కాలు కూడా పెట్టని వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే అయితే చుట్టుపక్కల రైతులకు ఎలాంటి రక్షణ ఉండదు. ఇప్పటికే గద్దల్లా వచ్చి వాలుతున్నారు. ఇష్టానుసారంగా పేదల భూములను ఆక్రమిస్తున్నారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకున్నట్టే ఆయన కుమారుడు లోకేశ్‌ను ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలి.  


వైఎస్‌ జగన్‌ హామీలు 
- ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసే విధంగా కమిషన్‌ను తీసుకొస్తాం. ఆ కమిషన్‌ నేరుగా సీఎంకు రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం. 
ఫీజులు తగ్గించడమే కాదు.. స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పించే విధంగా నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌ ద్వారా నేనే సమీక్షిస్తా.  
నెలకు రూ.40 వేల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000  దాటితే చాలు వాళ్లందరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం 
పరిధిలోకి తీసుకొస్తాం.  
ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తాం. వాహనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ వచ్చేలా చేస్తాం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీలకు 50% రిజర్వేషన్‌ కల్పిస్తాం. 
ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందజేస్తాం.  
మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.. ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం. 
​​​​​​​- పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం.    
​​​​​​​- పంటల సాగుకు పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్నకు రూ.12,500 అందజేస్తాం. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాం.  
​​​​​​​- రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాం. 
​​​​​​​- అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుతాం.
​​​​​​​- ఇల్లు లేని పేదల కోసం ఐదేళ్లలో అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం.
​​​​​​​- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పోస్టుల భర్తీకి ప్రతిఏటా జనవరి 1న క్యాలెండర్‌ విడుదల చేస్తాం.  
​​​​​​​- ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తాం. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం.  
​​​​​​​- ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, నెలకు రూ.5 వేలు వేతనమిస్తాం. 
​​​​​​​- ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు అందజేస్తాం. వడ్డీ లేని రుణం రూ.10 వేలిస్తాం.  
​​​​​​​- జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ మూడేళ్ల పాటు ఇస్తాం. వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.  
​​​​​​​- సొంత ఆటో, సొంత ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం.  
​​​​​​​- చిన్నచిన్న దుకాణాలు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు, రజకులకు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు అందజేస్తాం.  
​​​​​​​- అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు తెలంగాణలో కంటే రూ.1,000 ఎక్కువ జీతం చెల్లిస్తాం.
​​​​​​​- ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేల మంది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తాం.  
​​​​​​​- సంఘమిత్ర, వీవోఏలు, వెలుగు యానిమేటర్లకు జీతం రూ.10 వేలు ఇస్తాం.  
​​​​​​​- మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తాం.  
​​​​​​​- పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం. ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. 
​​​​​​​- ప్రభుత్వమిచ్చే ఫ్లాట్లకు పేదలు తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణం మాఫీ చేస్తాం.
​​​​​​​- తొలి బడ్జెట్‌లోనే రూ.1,100 కోట్లు  కేటాయించి 13 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం.   
​​​​​​​- మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకం.
​​​​​​​- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం. 
​​​​​​​- చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేస్తాం.  

మరిన్ని వార్తలు