ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం

5 Feb, 2018 01:45 IST|Sakshi
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దేవరపాళెంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

     మనందరి ప్రభుత్వం రాగానే ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు 

     ఆత్మీయ సమ్మేళనంలో పునరుద్ఘాటించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  

     పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రత్యేక గుర్తింపునిస్తాం 

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్య వైశ్యుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఇది వరకే చెప్పాను.. ఇప్పటికీ ఇదే మాటకు కట్టుబడి ఉన్నాను. ఆర్య వైశ్యులందరికీ అండదండగా ఉంటాం. పేదరికం ఏ కులానికో, మతానికో పరిమితం కాదు. ఆర్యవైశ్యుల్లోనూ పేదవాళ్లున్నారు. వాళ్లందరినీ ఆదుకుంటాం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 79వ రోజు ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని దేవరపాలెంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మబలిదానం చేసిన పొట్టి శ్రీరాములును పాలకులు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పన్నుల పేరుతో దాడులు జరుగుతున్నాయని, అవమానాలు ఎదురవుతున్నాయని ఆర్యవైశ్యులు ఈ సందర్భంగా జగన్‌ దృష్టికి తెచ్చారు. వారి ఆవేదన విన్న జననేత ఏమన్నారంటే.. 

అన్ని కులాల్లోనూ పేదరికం 
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చెప్పాను. ఇచ్చిన ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. కచ్చితంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ఆర్యవైశ్యులకు అండగా నిలబడతాం. జీఎస్‌టీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయని ఆర్యవైశ్యులు నాకు చెప్పారు. ఆర్యవైశ్యులను అవమానించడం, అనుమానించడం మొదలు పెడితే దేశం ముందడుగు వేయదు. ఇది పాలించే వాళ్లకు అర్థం కావాలి. టర్నోవర్‌ ఎంత ఉంటుందని ఆలోచన చేసి చెప్పమనాలి. వాళ్లు చెప్పింది నమ్మాలి. కానీ వాళ్లు చెప్పింది నమ్మకుండా వాళ్లపై దాడులు చేస్తూ, వేధిస్తుంటే.. అసలు మనం మనదేశంలోనే ఉన్నామా? అన్న అనుమానం కలుగుతోంది. నాన్నగారి హయాంలో ఆర్యవైశ్యులకు మంచి జరిగింది.

ఏ విధమైన ఇబ్బందులు, దాడులు ఉండేవి కావు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే దాడులు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఈ డాడులు జరుగుతుండటం బాధాకరం. నాన్నగారిచ్చిన జీవో వల్లే వాసవీ మాతా దేవాలయాలు నడుపుకునే స్వేచ్ఛ వచ్చిందని ఆర్యవైశ్యులు చెప్పారు. సత్రాలు కూడా నడుపుకునే స్వేచ్ఛ ఇస్తూ జీవో ఇచ్చినా, కొన్ని కారణాల వల్ల అమలు కాలేదని.. ఇప్పుడవన్నీ మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. సత్రాలను ఆర్యవైశ్యులకు అప్పగించి నడిపించడంతో పాటు, పేదలకు మేలు జరుగుతుందని వారు చెబుతున్న మాటలకు పూర్తి మద్దతు ఇస్తున్నా. ఇలాంటి మంచి పనులకు ముందుంటానని భరోసా ఇస్తున్నా. ఆర్యవైశ్యుల్లోనూ పేదరికం ఉంది. ఇలా పేదరికంలో ఉన్న వాళ్ల కోసమే నవరత్నాలు ప్రకటించాం. ప్రతీ ఒక్క పేదకూ ఇవి వర్తించేలా రూపొందించాం’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.    

పొట్టి శ్రీరాములుకు ప్రత్యేక గుర్తింపు
‘‘ఆర్యవైశ్యులకు గొప్ప చారిత్రక, రాజకీయ నేపథ్యం ఉంది. ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చిన గాంధీజీ ఈ దేశానికే స్ఫూర్తిదాయకం. దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం మరువలేనిది. ఇదే జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగోళ్లంతా ఒక రాష్ట్రంగా ఏర్పడేందుకు ఉద్యమించి, దేశాన్నే కదలించారు. ప్రాణాలను కూడా అర్పించిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు. అయితే... అలాంటి గొప్ప త్యాగం చేసిన వ్యక్తిని రాష్ట్రావతరణ రోజే పట్టించుకోకపోవడం బాధేస్తోంది. కనీసం ఆయన్ను తలుచుకునే పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పెద్దలు లేకపోవడం విచారకరం. అందుకే రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవంబర్‌ ఒకటవ తేదీన పొట్టి శ్రీరాములు గౌరవార్థం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతాం’’.  

మరిన్ని వార్తలు