అబద్ధాల పునాదులపై చంద్రబాబు పాలన

20 Mar, 2018 02:09 IST|Sakshi
పెదనందిపాడులో జరిగిన సభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం. ప్రసంగిస్తున్న జగన్‌

పెదనందిపాడు సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు

తన స్వార్థం కోసం హోదాను తాకట్టు పెట్టారు

ఎన్నికలొస్తున్నాయని మళ్లీ మొసలి కన్నీరు 

పూటకో మాటతో ప్రజలను మోసం చేస్తున్నారు

ప్రతి విషయంలోనూ మోసం.. దగా..

రాష్ట్రంలో ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు

ప్రత్తిపాడు నియోజకవర్గం రైతులకు అన్నీ ఇక్కట్లే 

అప్పాపురం చానల్‌కు చంద్ర గ్రహణం

మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో అందరినీ ఆదుకుంటాం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అబద్ధాలు, అన్యాయం, అధర్మం అనే పునాదులపై రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, యువత.. ఎవరినీ వదలకుండా అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఈ పెద్దమనిషి పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 115వ రోజు సోమవారం గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదని, సాక్షాత్తు చంద్రబాబే దళారులకు నాయకత్వం వహిస్తూ రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ప్రత్యేక హోదాపై మొసలి కన్నీరు 
‘‘చంద్రబాబు చేసిన అన్నింటికంటే పెద్ద ఘోరం ఏంటో తెలుసా? కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా హక్కును తాకట్టు పెట్టడం. చేయాల్సిందంతా చేసి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. 2016 సెప్టెంబర్‌ 8న అరుణ్‌ జైట్లీ.. మేం ప్యాకేజీ ఇస్తాం అని చెప్పినప్పుడు ఇదే పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రి పదవుల నుంచి ఎందుకు వైదొలగలేదు? ఈ ప్రకటన చేసినందుకు చంద్రబాబు నాయుడు అరుణ్‌ జైట్లీని పొగిడారు. ఢీల్లీకి వెళ్లి శాలువా కప్పి సన్మానించి వచ్చారు. ఇటీవల అరుణ్‌ జైట్లీ మళ్లీ అదే ప్రకటన చేస్తే.. ఈ విషయం ఇప్పుడే కొత్తగా తెలిసిందన్నట్లు మొసలి కన్నీరు కారుస్తూ ప్లేట్‌ ఫిరాయిస్తాడు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని కేంద్రంలో ఉన్న తన మంత్రి పదవులను ఉపసంహరించుకొన్నాడు. ప్రతి విషయంలోనూ మోసం.. దగా.  

ప్రత్తిపాడు నియోజకవర్గంలో సంకట పరిస్థితి
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉంటే కరువు ఉంటుంది. లేకపోతే వరద వస్తుంది. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా జలాలు వచ్చే కాలువలు ఆధునికీకరించకపోవడం వల్ల చివరి ఆయకట్టు భూములకు నీళ్లందని పరిస్థితుల్లో కరువుతో పంటలు ఎండిపోతాయి. మరో వైపున డ్రెయిన్లు ఆధునికీకరించకపోవడం వల్ల వరదలొచ్చి పంట పొలాలు ముంపునకు గురవుతాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు చానల్, అప్పాపురం చానల్‌ వస్తే, నాగార్జున సాగర్‌ నుంచి పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ వస్తుంది. ఈ కాలువల కింద బతుకుతున్న రైతన్నల బాధలు వింటుంటే బాధనిపిస్తోంది. గుంటూరు చానల్‌ కింద దాదాపు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆధునికీకరణ పనులు వట్టిచెరుకూరు వద్దనే ఆగిపోవడంతో ఈ ఆయకట్టుకు నీరందడం లేదు. ఆక్కడ ఒక లిఫ్ట్‌ పెడితే చివరి భూముల దాకా నీళ్లందించగలుగతామని రైతన్నలు నాలుగేళ్లుగా పాలకుల్ని గట్టిగా అడుగుతూ వినతి పత్రాలు ఇస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. ఈ కాలువను యామర్రు నుంచి పర్చూరు వరకు పొడిగించాలని, దీని వల్ల దాదాపుగా 35 వేల ఎకరాలకు సాగునీరు అదనంగా అందుతుందనే డిమాండ్‌ను కూడా పట్టించుకోవడం లేదు. 

పొలాలు మునిగిపోతున్నా పట్టించుకోరు..
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పాపురం చానల్‌కు దాదాపు రూ.65 కోట్లు మంజూరు చేశారు. పనులు కూడా మొదలు పెట్టారు. ఆ నేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నాగార్జున సాగర్‌ కెనాల్‌ నుంచి పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌ను తుర్లపాడు నుంచి పొడిగించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. నాన్నగారి హయాంలోనే రూ.300 కోట్లతో ఈ పనులు చేపట్టాలని భావించారు. రూ.3 కోట్లతో సర్వే పూర్తి చేశారు. రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. ఈ కాలువే గనుక పూర్తయితే పెదనందిపాడు, ప్రత్తిపాడు, కాకుమాను, పర్చూరు, చిలకలూరిపేట రూరల్‌ పరిధిలో దాదాపుగా 30 వేల ఎకరాలకు సాగునీరందివచ్చని తెలిసి కూడా  పట్టించుకునే  పరిస్థితి లేదు. మరోవైపు పొలాలు ముంపునకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని రైతన్నలు చెబుతున్నారు. నల్లమడ డ్రెయిన్‌ ఆధునికీకరించే కార్యక్రమంలో దాదాపు 115 కిలోమీటర్లకు సంబంధించి 80 కిలోమీటర్ల పనులు నాన్నగారి హయాంలో పూర్తి చేశారని రైతులు నాతో చెప్పారు. మిగిలిపోయిన 35 కిలోమీటర్ల పనులు ఈ ప్రభుత్వం చేయని కారణంగా పొలాలు మునకకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

తాగునీటికీ కటకటే  
ఇదే నియోజకవర్గంలో దాదాపు 98 గ్రామాలు ఉన్నాయి. 80 శాతం గ్రామాల్లో తాగునీటికి అల్లాడుతున్న పరిస్థితి. గ్రామాల్లోని చెరువులను విపరీతంగా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నారు. పక్కనే కొమ్మూరు గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామం నుంచి ఇక్కడకు వచ్చేటప్పుడు ఆ గ్రామ ప్రజలు, అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి ‘అన్నా.. మా గ్రామంలోని చెరువులో విచ్చలవిడిగా చెరువును లోతుగా తవ్వేశారన్నా.. లోతుగా తవ్వడంతో మంచి నీరు పోయి ఉప్పు నీరు ఉబికి వచ్చేస్తుందన్నా.. తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో ఉన్నామన్నా.. నీళ్ల క్యాను కొనాలంటే రూ.20 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోందన్నా.. డ్రమ్ము నీరు కొనాలంటే రూ.100 అవుతుందన్నా’ అని చెప్పారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అమరావతి వద్ద కృష్ణా నది నుంచి కేవలం రూ.100 కోట్లతో పైపులైను ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందించవచ్చని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పడి ఉన్నా.. ఆలోచించని పరిస్థితి. 

రైతన్నల పరిస్థితి దారుణం
రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నాలుగేళ్లలో కనీసం ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? వరికి రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉత్పత్తి ఖర్చు క్వింటాకు దాదాపు రూ.1900. కనీస మద్దతు ధర చూస్తే క్వింటా రూ.1550. రైతన్నలు ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మాలనుకుంటే రూ.1400 కూడా రావడం లేదని రైతన్నలు వాపోతున్నారు. పత్తి ఉత్పత్తి ఖర్చు దాదాపు రూ.5,200 అవుతుంది. కనీస మద్దతు ధర దాదాపు రూ.4,320. రైతన్న మార్కెట్‌లో అమ్ముకోవాలంటే మాత్రం రూ.3,100కు కూడా కొనే నాధుడు లేడు. మిర్చి పంట ఉత్పత్తికి క్వింటాకు దాదాపుగా ఏడెనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది. మద్దతు ధర మాత్రం కరువు. రైతన్నలు మిర్చి యార్డులో ధర్నాలు.. నేనొచ్చి నిరాహార దీక్షలు చేసే పరిస్థితి చూశాం.  ఇవాళ మిర్చిని రూ.6 వేలకు కూడా కొనుగోలు చేసే నాథుడు లేడు. మినుములు ఉత్పత్తి ఖర్చు దాదాపు రూ.5,600 అయితే, కనీస మద్దతు ధర రూ.5,400. రైతు అమ్ముకోవాలంటే రూ.4 వేలకు కూడా అడిగే నాథుడు లేడు. పెసలు ఉత్పత్తి ఖర్చు దాదాపు రూ.5,800 అయితే, కనీస మద్దతు ధర రూ. 5,575. రూ.4 వేలకు కూడా అమ్ముకేలేని పరిస్థితి. మొక్కజొన్న ఉత్పత్తి ఖర్చు సుమారు రూ.1700 అయితే కనీస మద్దతు ధర రూ.1425. రూ.1150కి కూడా కొనే నాథుడు లేడు. శనగ పంట ఉత్పత్తి ఖర్చు రూ. 5,200 అయితే కనీస మద్దతు ధర రూ. 4,400. రూ.3 వేలకు కూడా కొనే నాథుడు కరువైన పరిస్థితి. కంది క్వింటా ఉత్పత్తి వ్యయం రూ.5,600 అయితే కనీస మద్దతు ధర రూ.5,450. మార్కెట్‌లో రూ.4 వేలకు కూడా కొనే పరిస్థితి లేదు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. చంద్రబాబే దళారీలకు నాయకుడు కావడంతో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ తర్వాత నీట్‌గా ప్యాకేజ్‌ చేసి రైతన్నల దగ్గర నుంచి కొన్న రేటుకన్నా.. మూడింతలు, నాలుగింతలు ఎక్కువ ధరకు ప్రజలకు అమ్ముతారు. 

ఒకటా.. రెండా.. ఎన్నెన్నో మోసాలు
– బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇవాళ బ్యాంకుల వారు పంపిస్తున్న నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి.
– రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. ఇవాళ రుణ మాఫీ కార్యక్రమం అప్పులపై అయిన వడ్డీకి కూడా సరిపోవడం లేదు. 
– రైతన్నలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు ప్రభుత్వాలే వడ్డీ కట్టేవి. ఈ పెద్ద మనిషి ఆ డబ్బు కట్టక పోవడంతో ఇవాళ బ్యాంకులు రైతులకు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు. 
– పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్ని మాఫీ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. 
– జాబు రావాలంటే బాబు రావాలన్నాడు.. లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇవాళ ఉపాధి లేదు. ఉద్యోగం లేదు. 47 నెలలైంది. ఈ లెక్కన నెలకు రూ.2 వేలు చొప్పన రూ.94 వేలు బాకీ పడ్డారు. ఈ డబ్బులు ఎప్పుడిస్తారని చంద్రబాబును అడగండి. 
– దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ పెట్రోలు, డీజల్‌ ధరలు రాష్ట్రంలో భగ్గుమంటున్నాయి. లీటరుకు ఆరేడు రూపాయలు ఎక్కువగా బాదుతున్నారు. 
– అధికారంలోకి వస్తూనే బెల్టుషాపులు తీసేస్తానని చెప్పాడు. ఇవాళ గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలియదు కానీ మందు షాపు లేని గ్రామం ఏదైనా ఉందా? ఈయన గారి హైటెక్‌ పాలనలో ఫోన్‌ కొడితే మందు బాటిల్‌ ఇంటికి తీసుకొస్తున్నారు. 
– తానొస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పి.. ఇవాళ్టికి మూడు సార్లు పెంచారు. నాడు రూ.50, రూ.100 వచ్చిన బిల్లులు ఇవాళ రూ.500 నుంచి రూ. 2వేల వరకు వస్తున్నాయి. ఆర్టీసీ చార్జీలు కూడా పెంచేశారు. 
– మట్టి మొదలు.. మద్యం, కాంట్రాక్టులు, బొగ్గు కొనుగోళ్లు, కరెంటు కొనుగోళ్లు, అమరావతి భూములు.. చివరకు గుడి భూముల వరకు ఏదీ వదలడు. పైనేమో ఆయన తింటాడు.. కిందేమో జన్మభూమి కమిటీల పేరుతో పందికొక్కులకొదిలేస్తాడు. పెన్షన్‌లు కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా.. తుదకు మరుగుదొడ్డి మంజూరు చేయాలన్నా వీరికి లంచాలివ్వాల్సిన పరిస్థితి.  

మన ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం..
మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కడితే.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని ఇళ్లు కట్టి దేశంతో పోటీ పడ్డాడు. ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు చెప్పాడు. ఈ నాలుగేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టించాడా? మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా. నాన్న హయాంలో 13 జిల్లాల్లో కలిపి 24 లక్షల వరకు ఇళ్లు కట్టించారు. నాన్నగారి హయాం కంటే ఒక లక్ష ఎక్కువగా ఇళ్లు కట్టిస్తాం. ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. అవసరమైతే బ్యాంకుల వారితో మాట్లాడి ఆ ఇల్లు తాకట్టు పెట్టుకుని వడ్డీ లేని రుణం ఇచ్చేలా చూస్తాం. ప్రతి అవ్వా తాతకు పెన్షన్‌ రూ.2 వేలు చేస్తాం. 60 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పెన్షన్‌ వయస్సు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకుంటాం. ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి నాయకుడు కావాలో మీరు ఆలోచించండి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఇది జగన్‌ ఒక్కడి వల్ల సాధ్యం కాదు. మీ అందరి తోడు కావాలి. మీ ఆశీర్వాదం కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు