పెద్దమనిషి తీరుతో రాష్ట్రానికి చేటు

13 Mar, 2018 01:43 IST|Sakshi
బాపట్ల బహిరంగ సభకు హాజరైన అశేషజనవాహినిలో ఓ భాగం.. ప్రసంగిస్తున్న వైఎస్‌ జగన్‌

హోదా పోరు క్లైమాక్స్‌లో నాటకం రక్తికట్టిస్తున్నారు

విలన్‌ విభాగంలో ఆయనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు  

చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైస్‌ జగన్‌ ధ్వజం 

- చంద్రబాబు ఈ నాలుగేళ్లలో గట్టిగా పోరాడి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. నాలుగేళ్లుగా ఈయన డ్రామాలు ఆడడం మనందరం చూశాం. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్నారు. మొన్న ఆస్కార్‌ అవార్డులు పొందిన వారి ఫొటోలు పేపర్లో చూశాను. అందులో చంద్రబాబు బొమ్మ కనిపించలేదేమిటా.. అని ఆశ్చర్యపోయాను. అవార్డులు ఇచ్చే వాళ్లు విదేశాల్లో ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో మన చంద్రబాబు ఆడే డ్రామాలు చూసి ఉండరేమో అనుకున్నా. ఒకవేళ వారు చూసి ఉంటే ఉత్తమ విలన్‌ అవార్డు ఎవరికి వచ్చేదో తెలుసా? (జనం నుంచి చంద్రబాబు, చంద్రబాబు అని కేకలు).  
- అంకెలు, సంఖ్యలు పెంచి రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని తప్పుడు లెక్కలు చూపించడం వాస్తవం కాదా? ఈ లెక్కలు చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? నిన్నటి బడ్జెట్‌లో ఈ ఫిగర్స్‌ తారా స్థాయికి చేరాయి. రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉందని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఇంత ఆదాయం ఉంటే ప్రత్యేక హోదా ఇస్తారా?  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘ప్రత్యేక హోదాను నీరుగార్చే నాటకాన్ని చంద్రబాబు ఈ మధ్య కాలంలో రక్తికట్టించా రు. కేంద్ర మంత్రులను ఉపసంహరించడంతో కొద్దో గొప్పో జ్ఞానోదయం అయ్యిందనుకున్నాం. కానీ, ఎన్‌డీఏలోనే ఉంటారట. కన్వీనర్‌గా కొనసాగుతారట. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వరట. ఎంపీలు రాజీనామా చేయరట. హోదా కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటుంటే ఈ పెద్దమనిషి ఇలా మాట్లాడటం ధర్మమా? నిజాయితీ, చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ఈ వ్యక్తిని ఏమనాలి?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం 110వ రోజు గుంటూరు జిల్లా బాపట్ల గడియారం స్తంభం సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మార్చి 21న అవిశ్వాసం పెడుతున్నామని, రాష్ట్ర ఎంపీలు 25 మంది ఒక్కటిగా నిలబడి పోరాడితే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఈ తరహా పోరాటం చేసినా కేంద్రం దిగిరాక పోతే పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు ఏప్రిల్‌ 6న 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి వాళ్ల ముఖాన కొడితే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. పోరాటానికి ముందుకు రాకుండా నాటకాలు ఆడుతున్న చంద్రబాబుకు విలన్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. బాబు నాలుగేళ్ల పాలనలో మనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు.  

అబద్ధాలు చెప్పే నేత కావాలా? 
‘‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీరందరూ చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలని ఆలోచించండి. మోసం చేసేవాడు, అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా? చంద్రబాబును పొరపాటున క్షమిస్తే.. ఇదే వ్యక్తి రేపు ప్రతి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా ప్రతి ఇంటికి బెంజికారు ఇస్తానంటారు. అవీ నమ్మరని తెలిసి ప్రతి ఇంటికి మనిషిని పం పించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనకం డి. రూ.5 వేలు అడగండి. ఆడబ్బంతా మన దే. మన జేబుల్లో నుంచి దోచిన సొమ్మే. (జనం పెద్ద ఎత్తున కేకలు వేశారు) కానీ ఓటు వేసే సమయంలో మాత్రం మనస్సాక్షి ప్రకా రం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాశాఖాతంలో కలపండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మా రాలి. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలు రాకపోతే మార్పు అన్నది రాదు. ఇది ఒక్క జగన్‌ వల్ల అయ్యే పని కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని జగన్‌ కోరారు.   

మరిన్ని వార్తలు