బాబుకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు

11 Mar, 2018 01:01 IST|Sakshi
ప్రకాశం జిల్లా చీరాలలో శనివారం జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నాలుగేళ్లుగా మోసాలు, అబద్ధాలు, డ్రామాలు 

ప్రత్యేక హోదా విషయంలో మళ్లీ నాటకం 

చీరాల సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు  

ప్రఖ్యాత సినిమాలు, నటులకు ఆస్కార్‌ అవార్డు ఇస్తుంటారు. అది చూసినప్పుడల్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాళ్లకు కనబడలేదా అనిపిస్తుంది. బహుశా ఆ కమిటీ సభ్యులందరూ విదేశాల్లో ఉంటారు కాబట్టి మన రాష్ట్రంలో సాగుతున్న నాటకాలు కనబడలేదేమో. నాలుగేళ్లుగా మోసాలు, అబద్ధాలు, డ్రామాలు, అవినీతి, అప్రజాస్వామిక విధానాలతో పాలన సాగిస్తున్న చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు.  

మొన్న మీరంతా చూసే ఉంటారు. అసెంబ్లీలో బీజేపీ నేతలు బాబును పొగడటం, బాబు బీజేపీ నేతలను కొనియాడటం. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలంటారు.. ఒకరి నొకరు పొగుడుకుంటారు. ఈయనేమో కేంద్ర ప్రభుత్వంలో ఉంటారట. బీజేపీ వాళ్లు అడగరట. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకీ తూతూ మంత్రపు వ్యవహారాలు? 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరట.. పోనీ, మేము అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇవ్వడానికి ముందుకు రారట.. హోదా కోసం నాలుగేళ్లుగా మనం పోరాటం చేస్తుంటే ఈ పెద్దమనిషి వెకిలిగా మాట్లాడారు. ఎట్టకేలకు ప్రజల సెంటిమెంట్‌ బలంగా ఉందని ప్లేటు మార్చా రు కానీ చిత్తశుద్ధితో పోరాటం చేసేందుకు మాత్రం ముందుకు రారు. మంత్రులను మాత్రమే ఉపసంహరించుకుని, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కన్వీనర్‌గా కొనసాగుతారట. మళ్లీ మోసం.. ఈ పెద్దమనిషిని ఏమనా లి?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 108వ రోజు ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్లుగా డ్రామాలాడి ప్రజలను మోసం చేసిందికాక ఇంకా అదే మోసాలను కొనసాగిస్తున్న బాబు కు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు 
‘‘చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఏకైక మార్గం ప్రత్యేక హోదా ఒక్కటే. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ఏపీకి హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షి గా హామీ ఇచ్చారు. కానీ ఈ పెద్దమనిషి దాన్నీ తాకట్టు పెట్టారు. హోదా ఉంటేనే పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేక రాయితీలు వస్తాయి. అప్పుడే పరిశ్రమలు వస్తాయి. ఇన్‌కం ట్యాక్స్, జీఎస్టీ, కరెంటు రాయితీలుంటాయి. అవి ఉన్నప్పుడే ఎవరైనా వచ్చి పరిశ్రమలో, హోటళ్లో, ఆస్పత్రులో,  పెడతారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రయోజనాలున్నాయి కాబట్టే ఎన్నికలకు ముందు బాబు హోదా కావాలన్నాడు. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు నాడు వెంకయ్యనాయుడు పార్లమెంట్‌లో పరిశ్రమలు కట్టడానికే మూడు, నాలుగేళ్లు పడుతుంది కనుక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలన్నారు. ఇదే పెద్ద మనిషి బాబు తిరుపతిలో నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన సభలో 15 ఏళ్లపాటు హోదా కావాలన్నారు. హోదా వస్తే ఉద్యోగాలు వస్తా యని ఎన్నికలప్పుడు అందరూ ఊదరగొట్టా రు. హోదా ఇస్తామని ఆవేళ మోదీ కూడా అన్నారు. దానికి ఆశపడి గొప్పగా ఓట్లు వేశాం. కానీ ఇవాళ బాబు వైఖరి చూస్తే నాకొకటి గుర్తుకు వస్తోంది. భారతదేశం నుంచి బ్రిటిష్‌ వాళ్లను వెళ్లగొట్టేందుకు మనం నాడు గట్టిగా స్వాతంత్య్ర పోరాటం చేశాం. పోరాటం చివరి దశలో బ్రిటిష్‌ వాళ్లు.. స్వాతంత్య్ర పోరాటం చేసింది మీరు (భారతీయులు) కాదు, మేము చేసిన పోరాటం వల్లే మీకు స్వాతంత్య్రం ఇస్తున్నామంటే మనమందరం ఏమంటాం? ఇవాళ చంద్రబాబు తీరు కూడా అలాగే ఉంది.  

హోదా కోసం పోరాడరట.. 
నాలుగేళ్లుగా పూటకో మాట మాట్లాడిన ఈ పెద్ద మనిషి ప్రత్యేక హోదాపై ప్రజల సెంటిమెంట్‌ బలంగా ఉందని ప్లేట్‌ మార్చాడు.  అయితే నిజాయితీగా పోరాటం చేస్తు న్నారా అంటే అనుమానమే. గతంలోనే అరుణŠ జైట్లీ హోదా ఇవ్వలేమని చెప్పారు. అదే మాట ఆయన ఇటీవల మళ్లీ చెబితే.. జైట్లీ అలా మాట్లాడడం అన్యాయం, తన మంత్రులను రాజీనామా చేయిస్తున్నానని బాబు చెప్పారు. ఇదే రాజీనామాలు రెండేళ్ల క్రితం చేసి ఉంటే ఇప్పటికే  హోదా వచ్చేది. 2014 మార్చి 2న అప్పటి కేంద్రం కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి ప్రత్యేక హోదా కోసం ప్లానింగ్‌ కమిషన్‌కు పంపించారు. ఆ తర్వాత సీఎం అయిన చంద్రబాబు ఏడు నెలల పాటు ఆ తీర్మానం అక్కడే పడిఉన్నా పట్టించుకోలేదు. కేంద్రంతో కలసి అధికారాన్ని పంచుకున్నారు. హోదా అంశాన్ని నీరుగార్చేందుకు రకరకాల జిమ్మిక్కులు చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు, ధర్నాలు, బంద్‌లు చేస్తే పట్టుబట్టి ఆర్టీసీ బస్సులు తిప్పారు. ప్రత్యేక హోదా కోసం నేను 8 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఇదే పెద్దమనిషి నరేంద్ర మోదీ వస్తున్నారంటూ  తెల్లవారుజామున దీక్షను భగ్నం చేయించి పోరాటాన్ని నీరు గార్చారు. ఇలాంటి పెద్దమనిషి ఇవాళ మళ్లీ మోసం చేస్తున్నారు.  రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒక తాటిపై నిలబడి అవిశ్వాసం పెడితే కేంద్రం దిగిరాదా? అప్పటికీ దిగిరాకపోతే 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే మొత్తం దేశం మనవైపు చూస్తుంది. కేంద్రం దిగి వస్తుంది. అలా చేయడానికీ చంద్రబాబు ముందుకు రారట. అవిశ్వాసం ఆయన పెట్టరట. మేము పెడితే మద్దతివ్వరట. 

ఇలాంటి నాయకుడు అవసరమా? 
నాలుగేళ్లుగా ఈ పెద్దమనిషి పాలన చూశారు. ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని మళ్లీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తాడు. పొరపాటున బాబును క్షమిస్తే.. రేపు పొద్దున పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతాడు. ఒక్కొక్కరికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తామంటాడు. మీరు నమ్మరని తెలిసి ప్రతి ఇంటికి మనిíషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబులో నుంచి దోచిన డబ్బే. కానీ ఓటు వేసే సమయంలో మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పే వారిని, మోసాలు చేసే వారిని బంగాళాఖాతంలో కలిపేయండి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ తీసుకురావాలి. ఇది నా ఒక్కడితో సాధ్యం కాదు. మీ అందరి తోడు కావాలి. మీ అందరి ఆశీర్వాదం కావాలి’’ అని జగన్‌ కోరారు.  

మరిన్ని వార్తలు