హోదాను ఖూనీ చేసి కొంగ జపమా?

25 Apr, 2018 01:29 IST|Sakshi
కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన సభకు భారీ ఎత్తున హాజరైన జనసందోహంలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

గన్నవరం సభలో చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు

ఒక్క పూట దీక్షకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టారు 

ఐదుకోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు

మా ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగారు

మీ ఎంపీలందరితోనూ రాజీనామా చేయించి అందరూ కలసి

దీక్ష చేసుంటే దేశం మొత్తం మనవైపు చూసేది కాదా?  

నాలుగేళ్లుగా కంట తడి పెట్టని డ్వాక్రా అక్క చెల్లెమ్మలున్నారా? 

ముఖ్యమంత్రి కళ్లెదుటే మట్టి, ఇసుక దోపిడీ.. 

పైన బాబు.. కింద జన్మభూమి కమిటీలు.. 

మనందరి ప్రభుత్వం రాగానే డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణం

మొత్తం నాలుగు విడతల్లో వారి చేతికిస్తాం 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు 45 ఏళ్లకే పింఛన్‌ 

అవ్వాతాతలకు రూ.2 వేలు పింఛన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను నాలుగేళ్లుగా దగ్గరుండి మరీ ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఈ పెద్దమనిషి ఇప్పుడు కొంగ జపం చేస్తున్నాడు.. దొంగ దీక్ష చేస్తున్నాడు. ఈ దీక్షకు రూ.30 కోట్లు ఖర్చట. రైతు రుణాలన్నీ మాఫీ చేశానని చెప్పుకుంటున్న ఈయన్ను ఏమనాలి? మోసగాడు అనాలా? 420 అనాలా?’ అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 144వ రోజు మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా పైనుంచి కింది దాకా అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
కొంగ జపం.. దొంగ దీక్ష 
ప్రత్యేక హోదా రాకుండా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు కొంగజపం, దొంగ దీక్ష చేస్తున్నాడు. హోదా ఉన్నప్పుడే పరిశ్రమలు ఆదాయం పన్ను రాయితీ పొందుతాయి. ఎవరైనా హాస్పిటల్, హోటల్‌ కట్టాలనుకుంటే హోదా ఉంటే ఆదాయం పన్ను, ఎకైజ్‌ డ్యూటీ కింద జీఎస్‌టీ కట్టాల్సిన పనిలేదని ఆలోచిస్తారు. అందుకే అందరూ ఏది పెట్టాలన్నా ముందుకొస్తారు. వాళ్లంతా ముందుకొచ్చినప్పుడు మన పిల్లలకు మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే అవకాశం మెరుగవుతుంది. అది తెలిసి కూడా చంద్రబాబు దగ్గరుండి ప్రత్యేక హోదాను ఖూనీ చేయించారు.

ఇవ్వాళ ఎన్నికలు వస్తున్నాయని ఈ పెద్దమనిషి డ్రామాలు అడుతున్నాడు. విశాఖపట్నంలో సమ్మిట్‌ అంటాడు. మూడుసార్లు ఆయన పెట్టిన సమ్మిట్లను చూసి రూ.20 లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేశాయట. 40 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయని ఈ పెద్దమనిషి ఊదర కొడుతున్నాడు. 40 లక్షల ఉద్యోగాలు మీకెక్కడైనా కనిపించాయా? ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయన్నాడు. ఇవాళ ప్లేటు మార్చి దొంగ దీక్ష చేశాడు. ఆ నిరాహార దీక్ష చేసింది ఎన్నిగంటలో తెలుసా? ఒక పూటంట. ఇవాళ ప్రతి పేదవాడు తినడానికి డబ్బులు లేక రెండుపూటల్లో ఒక్కపూటే తింటున్నాడనే సంగతి ఈ పెద్దమనిషికి తెలియడం లేదు. ఉద్యోగాలు వస్తేనే కడుపు నిండుతుందన్న సంగతీ తెలియడం లేదు. కానీ ఒక్క పూట దీక్షకు రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చుపెడతాడు. ఇవన్నీ మీరు గమనించాలి.  
 
చంద్రబాబు నకిలీ బుల్లెట్‌ 
చంద్రబాబు వైఖరి చూస్తే నాకు ఒక కథ గుర్తుకు వస్తోంది. ఒక సిపాయి తుపాకీ చేతపట్టి యుద్ధరంగంలోకి పోయాడు. యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. తుపాకి గురిపెట్టి పేల్చాడు. కానీ తుపాకీ నుంచి గుండు బయటకు రాలేదు. అది నకిలీ బుల్లెట్‌ కాబట్టి బయటకు రాలేదు. యుద్ధం జరిగేటప్పుడు బుల్లెట్‌ బయటకు రాకపోతే యుద్ధంలో ఏమి జరుగుతుంది? చంద్రబాబు కూడా అచ్చం ఇలానే చేశాడు. పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున తన పార్టీకి చెందిన ఎంపీలందరితో రాజీనామా చేయించి, ఆమరణ దీక్ష చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఇలాంటి ఆయన ఇవాళ మైకు పుచ్చుకొని 25 మంది ఎంపీలను ఇవ్వండి.. ప్రత్యేక హోదా ఈసారి తెస్తానూ అంటాడు. అయ్యా చంద్రబాబూ.. 20 మంది ఎంపీలతో నీవు ఏమి అఘోరించావు అని నిలదీయండి. ఆరోజు ఎన్టీ రామారావును ఎలా వెన్నుపోటు పొడిచాడో ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలనూ వెన్నుపోటు పొడిచాడు. 
 
ఇసుకాసురులను చూస్తున్నాం.. 
‘‘తీక్షణంగా ఉన్న ఎండలను కూడా ఏమాత్రం లెక్కజేయకుండా వేలాది మంది నాతో అడుగులో అడుగులేశారు. బాధలు చెబుతూ, అర్జీలిస్తూనే.. మేమంతా నీ వెంటే ఉన్నామన్నా అని నాతో కలివచ్చారు. ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు రైతన్నలు కలిశారు. నీరు–చెట్టు పేరుతో ఏ విధంగా దోచుకుంటున్నారో చూడండని రోడ్డుకు కేవలం 150 అడుగుల దూరంలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లారు.  అప్పుడు వాళ్లు ‘పురాణాల్లో బకాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు పేర్లు విన్నామన్నా.. కానీ ఈ నాలుగేళ్ల చంద్రబాబు హయాంలో మాత్రం ఇసుకాసురులు, మట్టాసురుల పేర్లూ వింటున్నామన్నా’ అని చెప్పారు. నిజంగా ఇది బాధాకరం.

ఈ ప్రాంతానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ఆయన ఇంటి ముందే, ఆయన సమక్షంలోనే ఇసుక దోపిడీ జరుగుతోంది. కృష్ణానదికి అటు వైపున.. ఉండవల్లి, వెంకటాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం.. కృష్ణానదికి ఇటువైపున చూస్తే.. కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు ఇసుక రీచ్‌లలో చంద్రబాబు కళ్లెదుటే వేల సంఖ్యలో ఇసుక లారీలు తరలిపోతున్నాయి. లక్షల టన్నుల ఇసుకను తీసుకెళ్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే ఇంత దోపిడీ ఉంటే.. ఇక రాష్ట్రంలో పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఇలాంటి పాలన కెప్పుడూ చూడలేదని రైతన్నలు అంటున్నారు. 
 
చెరువులనూ దోచేస్తున్నారు.. 
‘ఇసుకతో ఆగకుండా మా చెరువుల మీద పడ్డారన్నా.. మట్టితో డబ్బులు సంపాదించే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నా.. మా ఖర్మేంటంటే ఇలాంటి కలియుగం చంద్రబాబు హయాంలోనే మొదలైనట్టుగా ఉందన్నా..’ అని రైతులు చెప్పారు. పూడిక తొలగింపు పేరుతో తూముల లెవల్‌ కన్నా దిగువకు అడ్డగోలుగా 50 అడుగుల వరకూ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తవ్వేస్తుంటే పొలాలకు నీళ్లెలా వస్తాయన్నా అని రైతులు బాధపడ్డారు. వీళ్లసలు మనుషులేనా అని ఆ రైతన్నలు ఆగ్రహంతో ప్రశ్నించారు.

నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు.. ఇసుక నుంచి మట్టి, మద్యం, బొగ్గు కొనుగోళ్లు, కరెంట్‌ కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు.. చివరకు గుడి భూముల వరకూ దేన్ని వదిలిపెట్ట లేదు. పైన ఆయన తింటూ.. గ్రామాల్లోనేమో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకోమని పందికొక్కులను నియమించాడు. పెన్షన్లు, రేషన్‌కార్డు, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా పాలన ఉందని ప్రజలు చెబుతుంటే చాలా బాధనిపించింది.  
 
హెరిటేజ్‌ కోసం కృష్ణవేణి డెయిరీ మూత 
రైతన్నలు వ్యవసాయం మీదనే బాగుపడలేరని, పాడి రైతులకు మేలు చేయాలని నాన్నగారు 2008లో కృష్ణవేణి పేరుతో కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సమితిని ఏర్పాటు చేశారని రైతన్నలు చెప్పారు. జిల్లాలో 17 మండలాల్లో పాలు సేకరించి, ఆ పాలను ప్రభుత్వ రంగంలో ఉన్న విజయ డెయిరీకి పోసేలా చేశారని చెప్పారు. ఆ మహానేత హయాంలో పాల రేటు లీటరుకు రూ.23 నుంచి రూ.50 వరకూ పోయిందని తెలిపారు. కానీ చంద్రబాబు వచ్చాక రూ.4 కోట్లు బకాయిలు పడ్డాయని, దీంతో 2016 జూన్‌లో సొసైటీ మూతపడిందన్నా అని కంటతడి పెట్టారు.

ఇవాళ మళ్లీ ప్రైవేటు డెయిరీ చేతుల్లోకి వెళ్లిపోయామన్నా అని వాపోయారు. హెరిటేజ్‌ లాభాల కోసం చంద్రబాబు రైతుల కడుపుకొడుతున్నాడని ఆ రైతన్నలు అన్నారు. రూ.87612 కోట్ల రైతు రుణాలన్నీ బేషరుతుగా మాఫీ కావాలంటే, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. అప్పుడు ఏ టీవీ ఆన్‌ చేసినా, ఏ గోడ చూసినా ఇవే ప్రకటనలు. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికొచ్చిందా? రాలేదు. కానీ బ్యాంకులు పంపే వేలం నోటీసులు మాత్రం ఇంటికొస్తున్నాయి. రైతుల రుణాలన్నీ మాఫీ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబును మోసగాడు అనాలా? 420 అనాలా?  
 
ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? 
డెల్టా ప్రాంతాన్ని తీసుకుంటే వరి తర్వాత పండించే పంట మినుము. ఈ పంటకే కాదు.. ఈ నాలుగేళ్లలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? తలమాడు తెగులు సోకడం వల్ల మినుము దిగుబడి కూడా తగ్గింది. ప్రతిపక్ష నేతగా నేనొచ్చి ఆ పంటల పరిస్థితిని చూశాను. ఆ పంటలకు నీళ్లందని దుస్థితి కనిపించింది. ఎందుకు నీళ్లందడం లేదని, ఏలూరు కాలువ ఎందుకు సాగడం లేదని అడిగాను. పులిచింతల ప్రాజెక్టు పూర్తయినా, ఆ దివంగత మహానేత రాజశేఖరరెడ్డిగారికి మంచి పేరు వస్తుందని చంద్రబాబుకు అన్పించింది.

అందుకే తెలంగాణకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద ఇవ్వాల్సిన రూ.150 కోట్లు పెండింగ్‌ పెట్టాడు. దీంతో నాలుగేళ్లుగా 45 టీఎంసీల నీళ్లు పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేయాల్సిన దాన్ని దగ్గరుండి తగ్గించాడు. ఏలూరు కాల్వకు నీళ్లు రాకుండా చేసిన ఘనత చంద్రబాబుది కాదా? ఈయన గారి పాలనలో దిగుబడి తగ్గినా మినుములకు రేటు రాని పరిస్థితి. మినుములకు రూ.5,400 మద్దతు ధర అయితే, మార్కెట్లో రూ.4,200కు అడిగే నాథుడు లేడు. వరి మద్దతు ధర రూ.1,550 అయితే రూ.1,200 కూడా గిట్టని పరిస్థితి. నాన్నగారి పాలనలో డీఏపీ బస్తా రూ.480 ఉండుదని, మార్కెట్లో వరి అమ్మాలనుకుంటే రూ.1,100 వచ్చేదన్నా అని రైతన్నలు నాన్నగారి పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ రోజు డీఏపీ బస్తా ధర రూ.1,038 ఉందని, వరి ధాన్యం అమ్మాలనుకుంటే రూ.1200 కూడా గిట్టడం లేదని రైతులు బావురుమంటున్నారు.  
 
ఇలాంటి నాయకుడు అవసరమా? 
జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ప్రతి ఇంటికీ ఉద్యోగమో.. ఉపాధో చూపుతానన్నాడు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి 48 నెలలు. ఈ లెక్కన ప్రతీ ఇంటికీ రూ.96 వేలు బకాయి పడ్డాడా? లేదా? చంద్రబాబు కనిపిస్తే ఈ డబ్బులు ఎప్పుడిస్తావని అడగండి. ప్రతీ పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు అన్నాడు. నాలుగేళ్ళయింది.. ఒక్క ఇల్లన్నా కట్టించాడా? కానీ ఎన్నికలు దగ్గరకొచ్చాయి కదా.. అదిగో సంవత్సరంలో పది లక్షల ఇళ్లు కట్టిస్తానంటాడు. మళ్లీ చెవిలో పువ్వు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ కులాన్ని, వర్గాన్ని దారుణంగా మోసం చేశాడు. 2014లో ఆయన ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రజలు వెంటపడి తరుముతారని మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో కన్పించకుండా చేశాడు.

ఇలాంటి వారిని క్షమిస్తే రేపు ఏం చేస్తాడో తెలుసా? పెద్ద పెద్ద మోసాలు చేస్తాడు. ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటాడు. దానికీ నమ్మరని తెలిసి.. ప్రతీ ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతాడు. తీసుకోండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అదంతా మన డబ్బే. మన జేబుల్లోంచి దోచేసిందే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి. అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే విశ్వసనీయత అనే పదానికి అర్థమొస్తుంది.

మనప్రభుత్వం రాగానే... ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు బ్యాంకు రుణం ఎంత ఉంటుంటో ఆ మొత్తాన్ని నాలుగు విడతల్లో మీ చేతికే ఇస్తాం. బ్యాంకులకు వడ్డీ చెల్లించి సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. అవ్వాతాతల పింఛన్‌ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. రూ.2 వేలు పింఛన్‌ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అక్కలందరికీ 45 ఏళ్లకే రూ.2 వేలు పింఛన్‌ ఇస్తాం. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి. దీవించండి’’ అని జగన్‌ కోరారు.   

చెరువులను బాగు పరచాలంటే మూడడుగులు తవ్వితే పర్వాలేదు.. షిల్ట్‌ తీస్తున్నారులే అనుకోవచ్చు. కానీ పూడిక తీయాలని నామకరణం చేసి, దానికి నీరు–చెట్టు అని పేరుపెట్టి ఏకంగా 50 అడుగుల వరకూ తవ్వేస్తే నీళ్లందక రైతులు అగచాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రే దగ్గరుండి ఇలా దోచుకోవడం సబబేనా?  
 
ఎన్నికలప్పుడు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడా? లేదా? అప్పుడు టీవీల్లో కనిపించిందేమిటి? మంగళసూత్రం ఒకడొచ్చి లాక్కెళతాడు. వెంటనే ఓ చెయ్యి వస్తుంది. ఇలా పట్టుకుని బాబు వస్తున్నాడు అంటుంది. ఇలా అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి. ఒక్క రూపాయి అయినా అక్కచెల్లెమ్మల అప్పు మాఫీ అయిందా? బ్యాంకుల నుంచి వేలం నోటీసులు వస్తున్నాయా? లేదా?  
 
కేంద్ర ప్రభుత్వం దిగిరావాలన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఐదుగురు లోక్‌ సభ స్థానాలకు రాజీనామాలు చేసి వాళ్ల మొఖాన కొట్టి ఆమరణ దీక్ష చేశారు. అదేరోజు టీడీపీ ఎంపీలందరూ కూడా రాజీనామాలు చేసి.. మొత్తం 25కు 25 మంది ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే దేశం మొత్తం మన గురించి మాట్లాడేది కాదా? కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేది కాదా? 

మరిన్ని వార్తలు