ఆరుగాలం శ్రమించిన రైతులు నష్టపోవడమేమిటి?

10 Nov, 2017 03:08 IST|Sakshi

నిన్న రాత్రి బస చేసిన ఉరుటూరు నుంచి 12.2 కిలో మీటర్ల దూరంలోని యర్రగుంట్ల శిబిరానికి చేరుకోవడంతో నేటి నా పాదయాత్ర రాత్రి 9.33 గంటలకు ముగిసింది. ఉదయం 8.45కల్లా నడక ప్రారంభించాను. యాత్ర మొత్తం ఎక్కడా విరామం లేకుండా తండోపతండాలుగా వచ్చిన జనసందోహాల నడుమ సాగింది. అవ్వా, తాతలను, రైతులను, కూలీలను, ఉద్యోగులను, విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ వెళ్లాను. కర్నూలు జిల్లా సంజామల నుంచి నన్ను చూసి పోదామని ఓ పెద్దమ్మ వచ్చింది. ఆమె పేరు అనంతమ్మ. ‘ఈ దుష్టపాలన ఎంతోకాలం ఉండదు బాబూ’ అని చెబుతూ పార్టీ ఫండు కోసమని 50వేలు విరాళమిచ్చింది. ఆమె అభిమానం నా గుండెను తాకింది. 

ఏమివ్వగలనామెకు నేను?... రాజన్న రాజ్యం కోసం పోరాడటం తప్ప. వై. కొండూరు సమీపంలో బుడ్డశనగ రైతులు వారి బాధను చెప్పుకున్నారు. మార్కెట్లో పదివేల దాకా ధర పలుకుతోందని గంపెడాశ పెట్టుకున్నారు. కానీ పంట చేతికి రాగానే ధర ఐదువేలకు పడిపోయింది. ఖర్చుల లెక్క కూడా రాలేదు. మినుము పంట చేతికి రాక ముందు క్వింటాల్‌కి పదమూడు వేలవరకూ ఉన్న ధర, పంట రైతుల చేతికి రాగానే నాలుగువేలకి దిగి వచ్చింది. ధనియాల రైతులదీ అదే కథ. యర్రగుంట్ల శివారు ప్రాంతంలో ఒక పసుపు రైతు తన గోడు వెళ్లబుచ్చుకున్నాడు. తనకి రుణమాఫీ కాలేదు. అయిన కాస్త రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదని బాధ పడ్డాడు. అప్పు చేసి పంట వేసి, ఆరుగాలం శ్రమించిన రైతులు ఇలా నష్టపోవడమేమిటి?... ఎంత దౌర్భాగ్యం. అందుకే నేను మొదటి నుంచీ ధరల స్థిరీకరణ నిధిపై పట్టుదలగా ఉన్నాను.  

ఈ సారి ప్రజలకిచ్చిన నవరత్నాల హామీల్లో కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా చెప్పాను. ఆ విషయాన్ని రైతులనే అడిగాను. నేను ప్రకటించిన నవరత్నాల గురించి విన్నారా? అని. విన్నాం, చాలా బాగున్నాయి అన్నారు. ఒక్క నిమిషం తర్వాత ‘రైతు భరోసా నిధి ఇంకొంచెం పెరిగితే బాగుంటుందన్నా’ అని ఒక రైతు అన్నాడు. మిగతా రైతులూ అతనితో గొంతు కలిపారు. సరే, ఆలోచిద్దామని చెప్పాను. ఈ సాయంత్రం యర్రగుంట్లలో జరిగిన సభకు భారీగా జనం వచ్చారు. ఈ సభలో కూడా ఇదే అంశాన్ని మరోసారి చెప్పాను. మన పరిపాలన వచ్చాక పంటకైన ఖర్చునూ, రైతు శ్రమ విలువనూ లెక్కకట్టి, దాని మీద లాభం వేసి ముందుగానే గిట్టుబాటు ధరను నిర్ణయిస్తామని. అంతకు ఒక్కపైసా కూడా తగ్గకుండా చూసేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పాను.  

ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు కలిశారు. హృదయవిదారకమైన కథ వారిది. అనుమతుల్లేకుండానే ఆ కాలేజీ అడ్మిషన్లు ఇస్తావుంటే ప్రభుత్వం కళ్లు మూసుకుంది. పైగా ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆ అడ్మిషన్లను రికగ్నైజ్‌ చేసింది. కాలేజీ యాజమాన్యం విద్యార్థుల దగ్గర నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఎంసీఐ ఆ సీట్లను రద్దు చేస్తే, విద్యార్థులను ఆదుకునే అవకాశం ఉండి కూడా ప్రభుత్వం చేతులెత్తేసింది. కానీ విచిత్రమేమిటంటే నంద్యాల ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేశాడు. విద్యార్థులందరికీ న్యాయం చేశామని విద్యార్థులను, వాళ్ల తల్లిదండ్రులను నమ్మించి వాళ్లతో సన్మానం చేయించుకున్నాడు. మైనారిటీ ఓట్ల కోసమే ఆ పెద్ద మనిషి ఇంతటి మోసానికి పాల్పడ్డాడు. 

ఎన్నికలు అయిపోయాక ఆ బిడ్డల్ని రోడ్డు మీద పడేశాడు. గతంలో ఇటువంటి సమస్య కర్ణాటక, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా హృదయం ప్రదర్శించి కేంద్రంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాయి. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఈ సమస్యను పట్టించుకోకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు నన్ను కలిసి కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ విషయంలో నేను తీసుకున్న వైఖరిని అభినందించారు. రాయలసీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఎన్నో ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తోన్న ఉద్యోగులు నన్ను కలిసి, తమకు న్యాయం చెయ్యమని అడిగారు. మన ప్రభుత్వం వచ్చాక రెగ్యులరైజ్‌ చేస్తానని వారికి హమీ ఇచ్చాను.  

కమలాపురం నియోజకవర్గం పరిధిని దాటి ఈ రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశించాను. నాన్నగారు ఉండి ఉంటే ఈ ప్రాంతం ఎలా ఉండేదో అని ఒకసారి ఆలోచించాను. బ్రాహ్మణి స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తయి పదివేల మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది. గొప్ప పర్యాటక కేంద్రంగా గండికోట విలసిల్లేది. మైలవరం డ్యామ్‌ ఆధునీకరణ పూర్తయి ఉండేది. మరిప్పుడో? వీటిపై ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎన్నికల ముందు, ఆ తరువాత కూడా మీరు హామీలిచ్చారు. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా? 

4వ రోజు ప్రజాసంకల్పయాత్ర డైరీ
గురువారం09–11–2017
యర్రగుంట్ల, వైఎస్సార్‌ జిల్లా

 

మరిన్ని వార్తలు