రైతన్నల అభ్యున్నతే లక్ష్యం

16 May, 2018 03:01 IST|Sakshi
దెందులూరు జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

అన్నదాతల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ మినహాయింపు

ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌  

అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ 

అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా

దళారీ వ్యవస్థకు చంద్రబాబే నాయకుడు 

అందుకే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు 

పోలవరం త్వరగా పూర్తి చేయాలన్న శ్రద్ధ లేదని మండిపాటు 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మనందరి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలోని రైతుల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అన్నదాతల అభ్యున్నతే తమ లక్ష్యం అన్నారు. తన పాదయాత్రలో అనేక మంది రైతులు ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ను తీసేయాలని విజ్ఞప్తి చేశారని, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి కూడా ఇదే విషయం తన దృష్టికి తేవడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 162వ రోజు మంగళవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా దెందులూరు వద్ద రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. పలువురు రైతుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. వారి సందేహాలను నివృత్తి చేశారు.  ఈ సమ్మేళనంలో జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 

ఆయిల్‌ పామ్‌ రైతుల పరిస్థితి దారుణం 
‘‘రైతుల పంట రుణాలు రూ.87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పారు. ఆయన మాఫీ పథకం కనీసం రుణాలపై వడ్డీకి కూడా సరిపోవడం లేదు.  రైతులు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు రాకుండా చేశారు.  నాలుగేళ్లుగా ఏ పంట తీసుకున్నా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఈ జిల్లాలో ఎక్కువగా పండే మొక్క జొన్నకు రూ.1,420 కనీస మద్దతు ధర ఉంటే ఇవాళ మార్కెట్‌లో రూ.1,100 కూడా రాని పరిస్థితి ఉంది.  ఇక్కడ ఎక్కువగా పండే ఆయిల్‌ పామ్‌ను పొరుగు రాష్ట్రం తెలంగాణకు తీసుకెళ్లి అమ్మితే రూ.1,000 ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. అక్కడ రికవరీ 18.4 శాతం ఉంటే ఇక్కడ 16.4 శాతంగా ఉంది. అక్కడికీ ఇక్కడికీ ఎందుకు ఇంత తేడా? ఇక్కడ చంద్రబాబే దళారీ వ్యవస్థను పూర్తిగా ప్రభావితం (మేనేజ్‌) చేస్తున్నాడు. ఆయన హెరిటేజ్‌ సంస్థకు లాభాలు రావడం కోసం రైతులకు అన్యాయం చేస్తున్నారు.

పోలవరంపై పోజులు తప్ప ప్రగతి ఏదీ? 
తెలంగాణలో లిఫ్టుల మీద లిఫ్టు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అటువైపున శ్రీశైలం వద్ద, ఇటు వైపు గోదావరిపై ఎడాపెడా పంపులు పెట్టి తోడుకుంటున్నా అడిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే.. ప్రజాప్రతినిధుల కొనుగోలుకు ఓటుకు కోట్లు ఇస్తూ.. ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన బాబు.. కేసుల భయంతో తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు. నాలుగేళ్లుగా పోలవరం పనులు జరుగుతున్న తీరు దారుణంగా ఉంది. ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు రూపు రేఖలు లేవు. రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రతి సోమవారం పోలవారం అంటూ డ్రామాలాడుతూ పోలవరం వద్దకు వెళ్లి తానేదో చెమటోడ్చి కష్టపడుతున్నట్లు పోజు ఇస్తాడు. 53 శాతం పనులు పూర్తయ్యాయని చంద్రబాబు చెబుతాడు. ఆ 53 శాతం పనుల్లో 70 శాతం మేర దివంగత వైఎస్‌ హయాంలోనే పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాలువల పనులు అప్పట్లోనే ఎక్కువగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టును తానే కడతానని చెప్పి రాష్ట్ర జాబితాలోకి తీసుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నాడు’’ అని జగన్‌ అన్నారు.

రైతన్నల కోసం ఇంకా ఇలా చేస్తాం..
- వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తాం.   
- ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా పంట రుణాలు ఇప్పిస్తాం.   
- మే నెలలోనే ప్రతీ రైతు కుటుంబానికి రూ.12,500 అందిస్తాం.    
- రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.  
- పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర కల్పిస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.   
- రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం.    
- పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.   
- పాడి ఆవులను సబ్సిడీపై అందిస్తాం. మూతపడ్డ సహకార డెయిరీలను పునరుద్ధరిస్తాం. వీటికి పాలు పోసిన రైతన్నలకు ప్రతీ లీటరుకు రూ.4 సబ్సిడీగా ఇస్తాం.   
- అనుకోకుండా ఏ రైతు అయినా ఈ లోకాన్ని వీడితే అప్పుల వాళ్లు అతని కుటుంబంపై పడి పీడించకుండా ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. రూ.5 లక్షలు ఆ కుటుంబానికి వారంలోగా అందజేసి తోడుగా ఉంటాం. ఈ సొమ్మును ఆ కుటుంబ ఆస్తిగా పరిగణిస్తాం.

పోలవరం ప్రాజెక్టు కోసం భూములు పోగొట్టుకున్న వారికి చంద్రబాబు కట్టిస్తున్న ఇళ్లు పిచ్చుకగూళ్ల మాదిరి ఉన్నాయట. హైదరాబాద్‌లో చంద్రబాబు కొత్తగా కట్టుకున్న కొత్త ఇంటి బాత్‌ రూం సైజు అంత కూడా లేవని నిర్వాసితులు నాకు ఫొటో చూపించి బాధపడ్డారు.

>
మరిన్ని వార్తలు