వైఎస్‌ జగన్‌ రికార్డు మెజారిటీ

24 May, 2019 05:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు వైఎస్‌ జగన్, ఆయన మాతృమూర్తి విజయమ్మ రాజీమాలు చేశారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలంటూ వారి తీర్పునే కోరారు. 2011 ఉప ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్, టీడీపీలు తమ తరపున సీనియర్లు డీఎల్‌ రవీంద్రారెడ్డి, ఎంవి మైసూరారెడ్డిలను బరిలోకి దింపాయి. అయితే అక్కడి ప్రజలు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి 5,45,672 మెజారిటీ ఇచ్చారు. భారత పార్లమెంటు ఎన్నికల చరిత్రలో అప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడో అత్యధిక మెజారిటీ రికార్డును వైఎస్‌ జగన్‌ సొంతం చేసుకున్నారు. (2004 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్‌ నియోజకవర్గంనుంచి సీపీఎం అభ్యర్థి అనిల్‌ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో నెగ్గి అప్పటి వరకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నారు. 1991 ఉప ఎన్నికల్లో అప్పటికే ప్రధాని పదవిలో ఉన్న పీవీ నరసింహారావు కాంగ్రెస్‌నుంచి పోటీచేసి 5,80,035 మెజారిటీ సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. చిన్నాచితకా పార్టీలు నామమాత్రపు పోటీ ఇచ్చాయి.) అనంతరం 2014 జనరల్‌ ఎన్నికల్లో గుజరాత్‌లోని వదోదర లోక్‌సభ స్థానం నుంచి అప్పటి గుజరాత్‌ సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 5,70,128 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. 2014లో మహరాష్ట్రలోని బీడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్‌ ముండే 6,92,245 ఓట్ల మెజారిటీ సాధించి ఆమె లోక్‌ సభ ఎన్నికల చరిత్రలో మొదటి స్థానాన్ని పొందారు. మిగిలిన వారంతా ప్రధాన పార్టీలనుంచి పోటీ చేయగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగి అనూహ్య విజయాన్ని సాధించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో తొలిహిట్‌... 
- 2014 జనరల్‌ ఎన్నికల్లో పులివెందులనుంచి తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మొదటి హిట్టే దిమ్మతిరిగేలా కొట్టారు. 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇది కూడా సీమాంధ్రలో రికార్డే. విజయమ్మ తరువాత ఇంత మెజారిటీ ఎవరూ సాధించలేదు. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాలలో ప్రతిపక్షనేతగా పులివెందులనుంచే బరిలోకి దిగి 90, 110 ఓట్ల మెజారిటీ సాధించారు.         2011 ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి వైఎస్‌ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆ మెజారిటీని ఆ తరువాత ఏపీలో ఎవ్వరూ దాటలేకపోయారు.  
 
చంద్రబాబుకూ తప్పని ఓటమి... 
1978నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు 1983 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1978లో చంద్రగిరి స్థానంనుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జనతా పార్టీ అభ్యర్థిపై నెగ్గిన ఆయన 1983లో టీడీపీ చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆయన టీడీపీలో చేరి, తనకు ఓటమిని చవిచూపిన తన సొంత గ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గంనుంచి కుప్పంకు మారారు. అప్పటినుంచి జరిగిన ఎన్నికల్లో  గెలుపొందుతున్నారు. 1978లో చంద్రగిరిలో 2,494 ఓట్ల స్వల్ప మెజారిటీతో నెగ్గిన ఆయన 1999లో కుప్పంనుంచి తన ఎన్నికల కెరీర్‌లో అత్యధికంగా 65,678 ఓట్ల మెజారిటీ సాధించారు.

ఎన్టీయార్‌ అరుదైన ముద్ర.. 
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎన్నికల కురుక్షేత్రంలో ప్రయోగాలకు తెరతీశారు. మొదటిసారి 1983లో గుడివాడ, తిరుపతి; 1985లో గుడివాడ, హిందూపూర్, నల్లగొండ; 1989లో హిందూపూర్, కల్వకుర్తి; 1994లో హిందూపూర్, టెక్కలి నుంచి పోటీ చేశారు. కల్వకుర్తిలో ఓటమిచెందిన ఆయన మిగిలిన అన్ని స్థానాల్లోనూ గెలిచారు. ఆయన నెగ్గిన అన్నిచోట్లతో పోలిస్తే  1994లో హిందూపూర్‌లో అత్యధికంగా 60,050 ఓట్లు, అత్యల్పంగా 1985లో గుడివాడనుంచి 7,597 ఓట్ల మెజారిటీ సాధించారు.   

మరిన్ని వార్తలు