22వ రోజు పాదయాత్ర డైరీ

1 Dec, 2017 01:58 IST|Sakshi

30–11–2017, గురువారం
బిల్లేకల్, కర్నూలు జిల్లా

ప్రజల కష్టాలు తీర్చాలన్న నా సంకల్పం బలపడుతోంది

ఈ రోజు కారుమంచి గ్రామంలోకి ప్రవేశించగానే గొల్ల నాగమ్మ, ఆమె కుటుంబ సభ్యులు నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. డెభ్బై ఐదేళ్ల వయసులో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆమె తన సొంత స్థలంలో నాన్నగారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నేను ఆమె కుటుంబానికే చెందిన ఒక చిన్న పాపతో నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశాను. ఈ పాదయాత్రలో ఆవిష్కరించిన నాన్నగారి మొట్టమొదటి విగ్రహం ఇదే. నాన్నగారిపై ప్రజల గుండెల్లో ఉన్న ప్రేమాభిమానాలు గ్రామగ్రామానా వ్యక్తమవుతున్నాయి.    

ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న నాగమ్మ కుటుంబానికి నాన్నగారి హయాంలో వ్యవసాయ పరంగా, గృహ నిర్మాణపరంగా, పలు సంక్షేమ పథకాల లబ్ధి జరగడంతో సంతోషంగా జీవిస్తూ.. దివంగత నేతను తమ గుండెల్లో ప్రతిష్టించుకున్నారు. ‘మా కుటుంబానికి దేవుడు రాజశేఖరరెడ్డి. ఆయన చేసిన మేలు నా ప్రాణం ఉన్నంత వరకూ మరిచిపోలేను’.. అని నాగమ్మ ఎంతో ఉద్విగ్నంగా చెప్పింది. ఆ కుటుంబం చూపిన ప్రేమను చూసి చలించిపోయాను. ఒక నాయకుణ్ణి ప్రజలు దేవుడిలా ఆరాధించడం మామూలు విషయం కాదు. ప్రజల కష్టాలను తీర్చి, వాళ్ల కన్నీళ్లను తుడిస్తే.. ఆ నాయకుణ్ణి తమ గుండెల్లో ఏ విధంగా పెట్టుకుంటారో నాన్నగారిపై ప్రజలు చూపించే ప్రేమను చూసినప్పుడల్లా అర్థమవుతోంది. ఇటువంటి ప్రేమను చూసినప్పుడల్లా ప్రజల కష్టాలు తీర్చాలన్న నా సంకల్పం మరింత బలపడుతోంది.   

కారుమంచి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు వచ్చి కలిశారు. ఆ స్కూల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేనందున బహిరంగ ప్రదేశాన్నే వాడాల్సిరావడం వారికి నరకయాతనగా మారింది. తాగే నీళ్లలో పురుగులు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనంలో కూడా పురుగుల బాధ తప్పడం లేదు. స్కూల్‌ మొత్తం కంప చెట్లు పెరిగి, తరగతి గదుల్లోకి పాములు వస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న తరగతి గది గోడ ఇటీవల కూలిపోవడంతో ఒక విద్యార్థికి గాయం కూడా అయ్యిందట. స్కూల్‌కి వెళ్లాలంటేనే భయమేస్తోందని వాళ్లు నాతో చెప్పారు. స్కూల్‌ ఇంతటి దారుణ స్థితిలో ఉండటంతో స్కూలు హాజరు సగానికి సగం పడిపోయింది. తర్వాత గ్రామమైన కైరుప్పలలో కూడా విద్యార్థినులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.  

ఒక పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ అంటూ గొప్పగా నినాదాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడే మరుగుదొడ్ల మంజూరు విషయంలో కూడా రాజకీయం చేస్తోంది. ఆఖరికి స్కూళ్లల్లో విద్యార్థినుల మరుగుదొడ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వారిని ఎంతో ఆవేదనకు గురి చేస్తోంది. ఇది ఎంత అనాగరికం? మనం అసలు సభ్యసమాజంలో ఉన్నామా? పేద పిల్లలు చదువుకోవడానికి మౌలిక వసతులను కూడా కల్పించకపోతే భావితరాలు మనల్ని క్షమించవు.  

వెంగళాయదొడ్డికి చెందిన కురువ రామాంజనేయులు కలిశాడు. పది సంవత్సరాల తన కుమారుడికి బ్లడ్‌ కేన్సర్‌ వచ్చిందని, మన రాష్ట్రంలో సదుపాయాలు లేక చెన్నైలో వైద్యం చేయిస్తున్నానని, దాదాపు రూ. 3 లక్షలు ఖర్చయిందని చెప్పాడు. ఒక నిరుపేదకు ఈ పరిస్థితి వస్తే ఎంత కష్టం! కొడుక్కి వైద్యం చేయించలేక, చేయించకపోతే నిండా పదేళ్లు కూడా లేని తన బిడ్డకు ఎక్కడ నూరేళ్లు నిండుతాయోనని భయపడుతూ దినదిన గండంగా బతకడం ఎంత నరకం? అందుకే ఎంత ఖరీదైన వైద్యమైనా ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు ఉచితంగా చేయించాలనే బలీయమైన కోరిక నాలో నాటుకుపోయింది.  

చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదొక ప్రశ్న.. స్వచ్ఛ భారత్‌ అని గొప్పలు చెప్పుకుంటూ ఫొటోలకు పోజులిచ్చే మీరు అత్యంత మౌలికమూ, అతి ప్రధానమూ అయిన పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని విస్మరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?.. ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను దిగజారుస్తూ, మూసివేత దిశగా వాటిని నడిపించడం ఎవరి ప్రయోజనాల కోసం?.. పేద పిల్లల చదువులతో, వారి భవిష్యత్తుతో చెలగాటమాడటం ఎవరి లాభాల కోసం?


ఆస్పరి మండలం కారుమంచిలో వైఎస్‌ జగన్‌ను పలకరిస్తున్న వృద్ధురాలు

మరిన్ని వార్తలు