41వ రోజు పాదయాత్ర డైరీ

22 Dec, 2017 01:34 IST|Sakshi

41వ రోజు
21–12–2017, గురువారం
బొగ్గలపల్లి, అనంతపురం జిల్లా.

ప్రజల కన్నీళ్లు తుడవగలిగినప్పుడే నాకు నిజమైన జన్మదిన వేడుక

టెంట్‌లోంచి బయటకు రాగానే నా బర్త్‌ డే అని బెలూన్‌లతో స్వాగత తోరణాలు, కేక్‌లు, స్వీట్లు తీసుకుని సహచరులు వచ్చారు. వికలాంగులు సైతం కేక్‌ తీసుకొచ్చారు. అడుగడుగునా అక్క చెల్లెమ్మలు, చిన్న పిల్లలు వచ్చి నా చేతికి పువ్వులిచ్చి ‘అన్నా.. హ్యాపీ బర్త్‌ డే’ అంటూ విషెస్‌ చెబుతుంటే ఎంత సంతోషం అనిపించిందో! నాపై ఇంత అభిమానం చూపుతున్న వీరందరికీ ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? దేవుని దయతో రేపు అధికారంలోకి వచ్చాక వారి కష్టాలు పంచుకుని, వారికి మేలు చేసి, వాళ్ల కన్నీళ్లు తుడవగలిగినప్పుడే నాకు నిజమైన సంతోషం. అప్పుడే నాకు నిజమైన జన్మదిన వేడుక.. అని మనసులో అనుకున్నాను. ఎన్ని ఇబ్బందులున్నా ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన సహచరులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.  
ప్రజల ఆనందాన్ని చూస్తూ అడుగులు వేస్తూ ముందుకు కదులుతుంటే అంతలో 70 ఏళ్లున్న ఓ అవ్వ వచ్చింది. పేరు నారాయణమ్మ. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకఆమెకు పింఛన్, రేషన్‌ ఆపేశారట. అదేంటని అడిగితే ‘మీరు వైఎస్సార్‌సీపీ వాళ్లు’ అని అన్నారట. వెంటనే ఆ అవ్వ ‘మీ పింఛనూ వద్దు, మీ రేషనూ వద్దు. మాకూ అభిమానం ఉంది. ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్‌ కుటుంబంతోనే ఉంటాం’ అని చెప్పిందట. చంద్రబాబు గారిని మళ్లీ అడుగుతున్నా.. ‘సంక్షేమ పథకాలను అర్హత చూసి ఇస్తారా? లేక పార్టీ సభ్యత్వం చూసి ఇస్తారా..?’ దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. నిజంగా ఆ అవ్వ పరిస్థితి చూస్తుంటే మనసుకు చాలా బాధ అనిపించింది.

ఇంతలో నరసింహులు అనే వ్యక్తి కలిశారు. అతనిది గోపేపల్లి ఎస్సీ కాలనీ అట. వాళ్ల తమ్ముడు.. పల్లె రఘునాథరెడ్డి (మాజీ మంత్రి) కాలేజీలో 2010లో పీజీలో చేరాడట. అప్పట్లో తమ వద్ద డబ్బులు లేవని వీరు చెబితే ల్యాబ్‌ ఫీజు ఎనిమిది వేల రూపాయలు కడితే చాలు అన్నారట. 2012లో చదువు పూర్తయింది. ఇప్పుడు సర్టిఫికెట్లు అడిగితే రూ.50 వేలు ఫీజు కడితేనే ఇస్తాం అన్నారట. కట్టలేను స్వామీ.. అని కాళ్ల మీద పడి వేడుకున్నారట. 2014 ఎన్నికలప్పుడు కూడా రఘునాథరెడ్డి వీళ్ల ఊరికి వచ్చి రూ.50 వేలు ఫీజు మాఫీ చేసి సర్టిఫికెట్లు ఇస్తానని ప్రకటించారట. కానీ, ఇప్పటి దాకా ఇవ్వలేదు. ఐదు సంవత్సరాలుగా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఆ అబ్బాయి ఉద్యోగానికి ఎలా వెళ్లాలి? ఎలా బతకాలి? మొన్నటి వరకూ మంత్రిగా, చీఫ్‌ విప్‌గా ఉంటూ.. కీలకంగా ఉన్న వ్యక్తులే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఏమనుకోవాలి?

తర్వాత కొద్దిసేపటికే ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి గారి (నాకు మేనమామ) ఆధ్వర్యంలో కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పొడిగించారని, ఆర్టీసీలో మాత్రం వర్తింపజేయడం లేదని నా దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని, అది బతికి బట్టకట్టాలంటే ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు. గతంలో తిరుపతిలో జరిగిన ఆర్టీసీ మహాసభలలో నేను చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. మళ్లీ చెబుతున్నా.. మన అందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. 65 వేల మంది కార్మికులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటాం. తోడుగా నిలుస్తాం.

చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని మీ మనసుకు ఎందుకు అనిపించలేదు?

మరిన్ని వార్తలు