అందరం కలుద్దాం..జగన్‌ను గెలిపిద్దాం: మోహన్‌ బాబు

3 Apr, 2019 08:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : ‘ఇచ్చిన మాటకు కట్టుబడటం వైఎస్‌ జగన్‌ తత్వం.. అధికారం కోసం అడ్డదారులు తొక్కని నైజం ఆయన సొంతం.. పదేళ్లుగా ప్రజల్లో ఉంటూ  అనుభవం సంపాదిం చారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. నాన్నలా ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని పరిపాలిస్తారు. అందుకే.. జగన్‌కు ఓ అవకాశం ఇవ్వండి’ అని ప్రముఖ నటుడు, విద్యాసంస్థల అధిపతి ఎం.మోహన్‌బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘రాజకీయ జీవితం అంతా కుట్రలు, కుతంత్రాల మయమైన చంద్రబాబు  పాలనలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోంది. ఎన్నికల హామీలను  నెరవేర్చకుండా ప్రజల్ని మోసగించారు’ అని ధ్వజమెత్తారు. ‘ఐదేళ్లలో చేసిందేమీ లేదు. అందుకే, వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీ రామారావు నుంచి టీడీపీనే కాదు..  నా నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీని కూడా చంద్రబాబు మోసం చేసి తీసేసుకున్నారు’ అంటూ సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై ఎం.మోహన్‌బాబు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు.  

సాక్షి : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయేలా పరిపాలిస్తాను తనకు ఓ అవకాశం ఇవ్వాలని జగన్‌ కోరుతున్నారు? మీరేమంటారు? 
మోహన్‌ బాబు : 2014లో చంద్రబాబుకు అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు. అప్పుడే జగన్‌కు ఇచ్చి ఉంటే అద్భుతాలు చేసేవారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. జగన్‌ చదువుకున్నవాడు. పార్టీని నడపడం అంటే మాటలు కాదు. సాధన, పట్టుదలతో 10 ఏళ్లుగా పార్టీని నడుపుతూ అనుభవం సంపాదించారు. ఆయన ప్రజలకు న్యాయం చేస్తారన్న నమ్మకం అందరికీ ఉంది. అందుకే ఈసారి జగన్‌కు అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. జగన్‌ కనీసం వరుసగా రెండుసార్లు సీఎం అవుతారు. జ్యోతిబసులా ఎన్నో ఏళ్లు సీఎంగా ఉండే అవకాశం కూడా ఉంది. 

సాక్షి : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యను ప్రస్తావిస్తే మీపై టీడీపీ ఎదురుదాడి చేస్తోందా? 
మోహన్‌ బాబు : వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యను రెండేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వం పట్టించు కోలేదు. కాబట్టే నేను ధర్నా చేయాల్సి వచ్చింది. ఫీజు రీయిబర్స్‌మెంట్‌ నిధులన్నీ చంద్రబాబు ఎటో మళ్లించేశారు. కాపులకు 2017–18 సంవత్సరానికి ఇవ్వాల్సిన  రూ.2 వేల కోట్లకు పైగా నిధులను ఇంకా ఇవ్వలేదు. దీన్ని ప్రశ్నిస్తే నాపై మాటల దాడి చేయిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై ఎక్కడైనా.. ఎప్పుడైనా చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. మరి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు ముందుకు రాకుండా తన చెంచాలతో మాట్లాడిస్తున్నారు. నా దగ్గరున్న వాళ్లు మాట్లాడితే వారికి తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు. కానీ.. నేను గౌరవంగా, నియంత్రణతో ఉన్నాను.  

సాక్షి : చాలా విరామం తరువాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన అంశం ఏమిటి?  
మోహన్‌ బాబు : రాజకీయాలు వద్దనుకుని చాలా ఏళ్ల క్రితం బయటకు వచ్చేశాను. ఈ రోజుకీ నాకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. చంద్రబాబూ బంధువే, వైఎస్‌ రాజశేఖరరెడ్డీ నాకు బంధువే. బంధుప్రీతితో రాలేదిప్పుడు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం ఆయన తనయుడు జగన్‌ పదేళ్ల క్రితం పార్టీ పెట్టారు. ప్రజల కోసం నేనున్నానని నిలబడ్డారు. చంద్రబాబు అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆయనకు తోడుగా ఉంటే బాగుంటుందనుకున్నాను.

2017లో చంద్రబాబు నన్ను పిలిచారు. ఏం పదవి కావాలో తీసుకోమన్నారు. నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదన్నాను. ఏపీ ప్రజల క్షేమం కోసం జగన్‌ కంకణం కట్టుకున్నారు. తండ్రిలానే మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం ఉంది. ఆయన్ని సీఎంగా చూడాలన్నదే నా కోరిక. మరోవైపు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంతవరకు చంద్రబాబును నమ్మారు. కానీ ఆయన చెబుతోంది అసత్యమనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాపైనా ఉంది. అందుకే రాజకీయాల్లోకి వచ్చాను. 

సాక్షి : ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీని... ఇప్పటి టీడీపీని చూస్తే మీకేమనిపిస్తోంది?  
మోహన్‌ బాబు : అప్పుడు మా అన్న ఎన్టీ రామారావు పార్టీ నుంచి ఎంపీలు కొందరు కాంగ్రెస్‌లోకి జంప్‌ చేశారు. అక్కడ మా ఎన్టీఆర్‌ నిజాయితీపరుడు. ఇప్పుడు జగన్‌ పార్టీ నుంచి చంద్రబాబు టీడీపీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు జంప్‌ చేశారు. ఇక్కడ జగన్‌ నిజాయితీపరుడు. పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలను చేర్చుకున్న చంద్రబాబును చూస్తే జనం అసహ్యించుకుంటున్నారు. వారిలో నలుగురిని మంత్రులను కూడా చేశారు. అప్పుడే చంద్రబాబు పతనం ప్రారంభమైంది.  
 
సాక్షి :న్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ మొదటి సంతకాలకు ఎంతో విలువ ఇచ్చేవారు. కానీ.. చంద్రబాబు మొదటి సంతకాలు ఏవీ అమలు కావడమే లేదు కదా? 
మోహన్‌ బాబు : ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిలతో చంద్రబాబుకు పోలిక ఏంటి? వారిద్దరిదీ ఓ చరిత్ర. మాట ఇచ్చారంటే కట్టుబడి ఉండేవారు.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాను పాదయాత్రలో చూసిన ప్రజల బాధలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు చాలు.. ఈ రాష్ట్ర ప్రజలు నిశ్చింతగా ఉండటానికి. కానీ.. చంద్రబాబు చేసిన మొదటి సంతకాలు ఏవీ అమలు చేయనే లేదు. ఎన్నికల ముందు మహిళలకు రూ.10వేలకు పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇచ్చి మోసం చేయాలనుకుంటున్నారు. సామాన్యులకు విద్య, ఆరోగ్యం అందించి వారి బిడ్డల్ని ప్రయోజకులను చేసి శాశ్వత ప్రయోజనం కలిగించిన వైఎస్సార్‌ గొప్పవాడా.. ఎన్నికల ముందు డబ్బులు వేసి తరువాత ఐదేళ్లు దోపిడీ చేసే చంద్రబాబు గొప్పవాడా ప్రజలు తేల్చుకోవాలి.  
 
సాక్షి : చంద్రబాబు ఐదేళ్ల పాలనను ఎలా విశ్లేషిస్తారు?  
మోహన్‌ బాబు : చంద్రబాబు అంతటి అవినీతి ప్రభుత్వం దేశ చరిత్రలోనే లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన ఇద్దరు చీఫ్‌ సెక్రటరీలు అజేయ కల్లాం, ఐవైఆర్‌ కృష్ణారావులు ఆయన ఎంతటి అవినీతిపరుడో చెబుతున్నారు.   చంద్రబాబు అవినీతి మీద ఐవైఆర్‌ కృష్ణారావు ఏకంగా ఒక పుస్తకం వేశారు. చీఫ్‌ సెక్రటరీగా చేసిన అధికారి సీఎం మీద పుస్తకం రాయడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి పాల్పడింది. దీనిపై కేంద్రం లెక్కలు అడిగితే ఆయనకు ఎక్కడలేని కోపం వస్తుంది. పచ్చటి పొలాల మధ్య బిల్డింగులు కట్టొద్దని శివరామకృష్ణన్‌ కమిటీ చెబితే చంద్రబాబు వినలేదు. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్ని నాశనం చేశారు. అసలు రాజకీయాలను అవినీతిమయం చేసి చెడగొట్టిందే చంద్రబాబు.  
 

సాక్షి : కేసీఆర్, బీజేపీలతో జగన్‌ ఉన్నారని చంద్రబాబు అదే పనిగా  ఆరోపిస్తున్నారు కదా? 
మోహన్‌ బాబు : చంద్రబాబుది పచ్చకామెర్ల బుద్ధి. ఆయనకు అంతా అలానే కనిపిస్తుంది. అయినా కేసీఆర్‌తో మాట్లాడితే చేతులు కలిపేసినట్టేనా? చంద్రబాబు నాలుగేళ్లుగా కేసీఆర్‌తో మాట్లాడుతూనే ఉన్నారు కదా. నరేంద్రమోదీని  చంద్రబాబే నెత్తిన పెట్టుకున్నారు కదా. మరి మోదీతో జగన్‌ మాట్లాడితే తప్పు చేసినట్టేనా? చంద్రబాబు తన కామెర్లు తొలగించుకుని చూస్తే నిజాలు తెలుస్తాయి. జగన్‌ ఎవరితోనూ కలవడం లేదు. ఒంటరిగా పోరాడుతున్నారు.  

సాక్షి : జగన్, చంద్రబాబు నాయకత్వ సామర్థ్యాలను ఎలా విశ్లేషిస్తారు?  
మోహన్‌ బాబు : వైఎస్‌ రాజశేఖరరెడ్డి  హఠాన్మరణం తరువాత అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా సరే జగన్‌ ఆ పని చేయలేదు. అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం సొంత పార్టీ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లారు. బీజేపీగానీ ఇతర పార్టీలుగానీ పొత్తుకు ముందకు వచ్చినా ఆయన సమ్మతించలేదు. 2014 ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనే తలంపు లేనివాడు.

ప్రతిపక్ష నేతగా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లినవాడు. నవరత్నాల వంటి అద్భుతమైన పథకాలను రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తండ్రిలా ఇచ్చిన మాటకు కట్టుబడే నిబద్ధత ఉంది. కానీ చంద్రబాబు అందుకు పూర్తి భిన్నం. రాజకీయం అంతా కుట్రలు, కుతంత్రాలే. ఆయన మరో ఔరంగజేబు వంటివాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు పార్టీని అన్యాయంగా లాగేసుకున్నాడు. ఆ మహానుభావుడి మీద చెప్పులు వేయించాడు. ఆయన్ను క్షోభపెట్టి మృతికి కారణమయ్యాడు. బంధాలు, అనుబంధాలు, స్నేహం, వాత్సల్యం తెలియనివాడు చంద్రబాబు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజల్నీ మోసం చేస్తున్నాడు.  
 
సాక్షి : రాష్ట్రంలో మరో కొత్త పార్టీ వచ్చింది కదా.. ఏమంటారు?  
మోహన్‌ బాబు : నేను వేరే పార్టీల గురించి మాట్లాడను. 2014లో చంద్రబాబు ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకున్నారు. దాంతో తక్కువ మెజార్టీతో ఏదో గెలిచారు. మళ్లీ ఆ వ్యక్తే చంద్రబాబును దొంగ... మోసగాడు, అవినీతిపరుడు అన్నారు. కానీ మళ్లీ చంద్రబాబు తెరచాటుగా ఏదో చేశారు. దాంతో ప్రస్తుతం ఆ వ్యక్తి లోపాయికారీగా చంద్రబాబుకు సహకరిస్తున్నారు. గతంలో కాపు సోదరులు అందరికంటే ఎక్కువ మోసపోయారు. ఇక మోసపోరు. మంచినే గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. కాపు సోదరులే కాదు అందరూ జగన్‌నే గెలిపిస్తారు.  
​​​​​​
​సాక్షి : 
జాతీయ రాజకీయాల ప్రభావం మన రాష్ట్ర ఎన్నికల మీద ఉంటుందా?  
మోహన్‌ బాబు : జాతీయ రాజకీయాల ప్రభావం మన రాష్ట్రం మీద ఏమాత్రం ఉండదు. జాతీయ పార్టీలు ఏపీలో ప్రభావం చూపించే స్థితిలో లేవు. ఇక్కడ జగన్‌ను చూసే ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటేస్తారు.  
 
సాక్షి : ఈసారి తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కూడా వైఎస్సార్‌ సీపీకి ఎక్కువ మద్దతు లభిస్తోంది కదా? 
మోహన్‌ బాబు : తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కూడా ఎక్కువమంది వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నారు. నేను వచ్చాను. జయసుధ వచ్చారు. ఎంతోమంది ఇంకా వస్తూనే ఉన్నారు. అందరూ జగన్‌ గెలుపు కోసమే వస్తున్నారు. ఇది చారిత్రక సమయం. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఏకం కావాలి. వైఎస్సార్‌ సీపీని గెలిపించాలి. 
 
సాక్షి : విద్యా సంస్థల అధిపతిగా ఈ తరం యువతను మీరు గమనిస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం?  
మోహన్‌ బాబు : ఈ ఎన్నికల్లో 21 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. ఆ యువతకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్‌ మీ చేతుల్లో ఉంది. మంచి మార్పు కోసం వైఎస్సార్‌ సీపీకి ఓటేయండి. జగన్‌కు ఓ అవకాశం ఇవ్వండి.  చంద్రబాబు చెప్పేవన్నీ అసత్యాలు. మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోవద్దు. మేల్కొనండి. జగన్‌ను బలపరచండి.   

– వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి 

మరిన్ని వార్తలు